రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) మరో ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది. వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు డిగ్రీ సీటు పొందలేని వారికి, దోస్త్ (DOST) రిజిస్ట్రేషన్ చేసుకోని వారి కోసం ‘స్పెషల్ డ్రైవ్’ అలాగే ‘ఇంట్రా-కాలేజ్ ఫేజ్-2’ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు , కాలేజీల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈ ప్రత్యేక విడతను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విడత ద్వారా అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు వీలుంటుంది. అప్లికేషన్ ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, పూర్తి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు..
ముఖ్యమైన తేదీలు :
స్పెషల్ డ్రైవ్ రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజుతో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 6 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది.
స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఆగస్టు 12న యూనివర్సిటీ హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది.
సీట్ల కేటాయింపు : ఆగస్టు 14న స్పెషల్ డ్రైవ్ సీట్ల అలాట్మెంట్ విడుదలవుతుంది.
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 14 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఇంట్రా-కాలేజ్ ఫేజ్-2 వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 20, 21 తేదీల్లో ఇంట్రా-కాలేజ్ మార్పుల కోసం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 22న సీట్లు కేటాయిస్తారు.
విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:
1.ఇప్పటికే దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు రాని వారు తమ పాత ఐడీ (DOST ID & Pin) తోనే స్పెషల్ డ్రైవ్‌కు అర్హులు.
2.ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు రూ. 400 ఫీజు చెల్లించి కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
3.సీటు కన్ఫర్మ్ చేసుకున్న వారు దీనికి అనర్హులు. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు పొందడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడం మంచిది.






