తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన దోస్త్ రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ విడతలో మొత్తం 52,902 మంది విద్యార్థులకు సీట్లు లభించాయని కన్వీనర్ తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు మే 31 నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో.. మే 31 నుంచే మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ విడత జూన్ 16 వరకు కొనసాగుతుందని, జూన్ 20న సీట్లు కేటాయిస్తారని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
కామర్స్ విభాగంలోనే అత్యధిక సీట్లు:
రెండో విడత కౌన్సెలింగ్ కోసం కొత్తగా 46,504 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వీరితో పాటు మొదటి విడతలో సీటు వచ్చి, నచ్చిన కోర్సు కోసం ప్రయత్నించిన విద్యార్థులు కూడా వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. ఇలా రెండు వర్గాల విద్యార్థులు కలిసి మొత్తం 60,499 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా.. వారిలో 52,902 మందికి సీట్లు కేటాయించారు. ఈ విడతలో కూడా ఎప్పటిలాగే కామర్స్ గ్రూపునకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. సీట్లు పొందిన వారిలో అత్యధికంగా 21,431 మంది కామర్స్ విభాగంలోనే అడ్మిషన్లు పొందడం విశేషం.
జూన్ 5 లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్:
రెండో విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు తమ సీటును కన్ఫామ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మే 31 నుంచి జూన్.. 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ద్వారా సీటును రిజర్వ్ చేసుకోవచ్చని కన్వీనర్ సూచించారు. గడువులోగా రిపోర్ట్ చేయని వారి సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు.
నేటి నుంచే థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు:
మరోవైపు, దోస్త్ థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 31 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు, అలాగే సీట్లు రాని విద్యార్థులు ఈ విడతలో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మే 31 నుంచి ప్రారంభమై జూన్ 16 వరకు కొనసాగుతుంది. అనంతరం విద్యార్థుల ఆప్షన్ల ఆధారంగా జూన్ 20న సీట్లను కేటాయించనున్నారు. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.





