తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘టీజీ దోస్త్’ (TG DOST) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. తాజాగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కూడా మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ గడువు , తరగతుల ప్రారంభంపై ఉన్నత విద్యామండలి స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేసింది.
డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే!
రాష్ట్రంలోని 969 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే TG DOST (Degree Online Services, Telangana) వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీ పరిధిలోని సుమారు 4.40 లక్షల సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
తొలి రోజే 3,804 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోగా.. ఇప్పటివరకు మొత్తం 47,036 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి విడత: రిజిస్ట్రేషన్‌కు మే 7, వెబ్ ఆప్షన్లకు మే 8 చివరి తేదీలు.
సీట్ల కేటాయింపు: మే 14న ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.
తర్వాత విడతలు: సెకండ్ ఫేజ్ మే 15 నుంచి, థర్డ్ ఫేజ్ మే 31 నుంచి ప్రారంభమవుతాయి.
కాలేజీ రిపోర్టింగ్: సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 మధ్య సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
తరగతుల ప్రారంభం:
ఉన్నత విద్యామండలి నిబంధనల ప్రకారం.. జూన్ 29 నుంచి విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు జరుగుతాయి. అనంతరం జులై 1 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు గడువులోపు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.





