తెలంగాణ డీఈఈసెట్ (TG DEECET-2026) ఫలితాలు మే 30న విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు కౌన్సెలింగ్, వెబ్ ఆప్షన్ల తేదీలను కూడా అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు ఈ ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం.
కౌన్సెలింగ్ వివరాలు:
డీఈఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా.. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ రోజు (జూన్ 2) నుంచి జూన్ 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు జూన్ 6 నుంచి జూన్ 8 వరకు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కాలేజీలను వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు. ఒకవేళ వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే.. జూన్ 9న ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు.
అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్, ఆప్షన్ల ఆధారంగా జూన్ 14న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీటు పొందిన వారు జూన్ 14 – 17 వరకు కాలేజీలలో ట్యూషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత, కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి రోజు తరగతులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి.





