పీజీ చేయాలనుకునే విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ (TG CPGET) 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎగ్జామ్ కన్వీనర్ రాజేందర్ ఈ వివరాలను వెల్లడించారు. జులై 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాల్లో రోజుకు మూడు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు, సెషన్ల పూర్తి టైమ్ టేబుల్‌ను cpget.tgche.ac.in లేదా kakatiya.ac.in వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తెలంగాణలోని టాప్ మోస్ట్ వర్సిటీలలో సీటు సాధించవచ్చు. అవి
1.ఉస్మానియా యూనివర్సిటీ (OU)
2.కాకతీయ యూనివర్సిటీ (KU)
3.తెలంగాణ యూనివర్సిటీ
4.మహాత్మాగాంధీ యూనివర్సిటీ
5.పాలమూరు యూనివర్సిటీ
6.శాతవాహన యూనివర్సిటీ
7.జేఎన్‌టీయూహెచ్ (JNTUH)
8.వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ
9.మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ (కొత్తగూడెం)
పరీక్ష విధానం:
సమయం: పరీక్ష వ్యవధి కేవలం 90 నిమిషాలు (గంటన్నర).
ప్రశ్నలు: మొత్తం 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ (మల్టీపుల్ ఛాయిస్) ప్రశ్నలు ఉంటాయి.
టీజీ సీపీగెట్ ఆర్ట్స్,సైన్స్,కామర్స్,మేనేజ్‌మెంట్ విభాగాల్లోని దాదాపు అన్ని రకాల పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), పీజీ డిప్లొమా, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
సైన్స్ ,టెక్నాలజీ కోర్సులు (M.Sc):
సైన్స్ అభ్యర్థుల కోసం ఎం.ఎస్.సి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, జువాలజీలతో పాటు ప్రస్తుతం డిమాండ్ ఉన్న బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయో-టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, జియాలజీ , జాగ్రఫీ వంటి విభిన్న కోర్సులలో అడ్మిషన్ల కోసం పరీక్షలు నిర్వహిస్తారు.
ఆర్ట్స్,సోషల్ సైన్సెస్ (M.A):
సాహిత్యం, సామాజిక శాస్త్రాలపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఆర్ట్స్ విభాగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఎం.ఏ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, వంటి భాషా కోర్సులతో పాటు కెరీర్‌కు ఎంతో ఉపయోగపడే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఫిలాసఫీ, మీడియా రంగం వైపు వెళ్లాలనుకునే వారి కోసం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (MCJ) కోర్సులను ఇందులో చేర్చారు.
కామర్స్, మేనేజ్‌మెంట్ ,ఇతర ప్రొఫెషనల్ కోర్సులు:
కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విద్యార్థుల కోసం ఎం.కామ్ (M.Com) లో విభిన్న స్పెషలైజేషన్లతో పరీక్షలు ఉంటాయి. వీటితో పాటు సమాజ సేవ, లైబ్రరీ నిర్వహణ, శారీరక విద్య రంగాలలో స్థిరపడాలనుకునే వారి కోసం మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (M.S.W), మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (M.Lib.I.Sc), మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (M.P.Ed) వంటి ప్రొఫెషనల్ పీజీ కోర్సులను కూడా ఈ సింగిల్ ఎంట్రన్స్ ద్వారానే భర్తీ చేస్తారు.
పీజీ డిప్లొమా,ఇంటిగ్రేటెడ్ కోర్సులు:
రెగ్యులర్ పీజీ కోర్సులే కాకుండా కెరీర్ ఓరియెంటెడ్ పీజీ డిప్లొమా కోర్సులైన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS), డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్, చైల్డ్ సైకాలజీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ వంటి కోర్సులను కూడా సీపీగెట్ ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంబీఏ (MBA), హ్యుమానిటీస్ విభాగాల్లో 5 సంవత్సరాల లాంగ్-టర్మ్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను కూడా ఈ ఎంట్రన్స్ ద్వారా అందిస్తున్నారు.





