తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (TG CETs-2026) ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) తాజాగా ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను వివిధ యూనివర్సిటీలకు అప్పగిస్తూ, కన్వీనర్లను కూడా నియమించింది. ముఖ్యంగా ఈ ఏడాది కూడా అన్ని ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) నిర్వహించనున్నారు. ఏ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. కన్వీనర్లు ఎవరు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రవేశ పరీక్షలు – కన్వీనర్ల వివరాలు:
TG EAPCET (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ): దీనిని జేఎన్టీయూ హైదరాబాద్ (JNTUH) నిర్వహిస్తుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ కె. విజయకుమార్ రెడ్డి నియమితులయ్యారు.
TG ICET (MBA & MCA): నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ దీని బాధ్యత తీసుకుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ అలవాల రవి వ్యవహరిస్తారు.
TG ECET (డిప్లొమా నుంచి ఇంజనీరింగ్): దీనిని ఉస్మానియా యూనివర్సిటీ (OU) నిర్వహిస్తుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ నియమితులయ్యారు.
TG EDCET (B.Ed): వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ బి. వెంకట్రామ్ రెడ్డి ఎంపికయ్యారు.
TG LAWCET & PGLCET (LLB & LLM): ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు ప్రొఫెసర్ బి. విజయలక్ష్మి కన్వీనర్‌గా ఉంటారు.
TG PGECET (M.Tech/M.Pharm): దీని బాధ్యతను కూడా జేఎన్టీయూ హైదరాబాద్ స్వీకరించింది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ కె. వెంకటేశ్వర రావు వ్యవహరిస్తారు.
TG PECET : కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ నియమితులయ్యారు.
ప్రస్తుతానికి కేవలం కన్వీనర్లు, యూనివర్సిటీల వివరాలను మాత్రమే ప్రకటించారు. పరీక్షల నోటిఫికేషన్లు, అప్లికేషన్ తేదీలు, పూర్తి షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి త్వరలోనే విడుదల చేయనుంది.






