తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. దీనిలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 243 అంగన్వాడీ టీచర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నోటిఫికేషన్ వివరాలు:
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 62 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో ఆల్వాల్ ప్రాజెక్టు పరిధిలో 18 ఖాళీలు, మేడ్చల్ పరిధిలో 20 ఖాళీలు, కుత్బుల్లాపూర్ పరిధిలో 24 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ జులై 27న ప్రారంభం కాగా, ఆగస్టు 05సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఆన్లైన్లోఅప్లై చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ సర్టిఫికేట్ల ఒరిజినల్స్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన 2 సెట్ల జిరాక్స్ కాపీలను ఆగస్టు 5 సాయంత్రంలోగా సంబంధిత ఐసీడీఎస్ ఆఫీస్‌లో సమర్పించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.
హైదరాబాద్ జిల్లా నోటిఫికేషన్ వివరాలు:
హైదరాబాద్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో భారీగా 181 అంగన్వాడీ టీచర్ ఖాళీల భర్తీకి వేరొక నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో చార్మినార్ ప్రాజెక్టు పరిధిలో 40, గోల్కొండలో 27, ఖైరతాబాద్‌లో 17, నాంపల్లిలో 38 ,సికింద్రాబాద్ పరిధిలో అత్యధికంగా 59 ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన మహిళలు జులై 29 నుంచి ఆగస్టు 22 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
అర్హతలు, వయోపరిమితి వివరాలు:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తప్పని సరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. 1.7.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. వీటితో పాటు అభ్యర్థి ఖచ్చితంగా అప్లై చేసుకుంటున్న అంగన్వాడీ కేంద్రం పరిధిలోని స్థానిక నివాసి అయి ఉండాలి (గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు పరిధికి చెందినవారై ఉండాలి).
కావాల్సిన డాక్యుమెంట్స్:
అప్లికేషన్ సమయంలో , సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి. వయోపరిమితి నిర్ధారణ కోసం టెన్త్ సర్టిఫికేట్, విద్యా అర్హత కోసం ఇంటర్ మార్కుల మెమో, తహశీల్దార్ జారీ చేసిన కాస్ట్ సర్టిఫికెట్ నోటిఫికేషన్ తేదీ నుంచి ఏడాది లోపు తీసుకున్న స్థానిక నివాస డాక్యుమెంట్స్ సమర్పించాలి. వీటితో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు , వర్తించే ఇతర సర్టిఫికేట్లు యాడ్ చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం:
అభ్యర్థులు ముందుగా తెలంగాణ శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ (wdcw.tg.nic.in) ను సందర్శించి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. ఆ తర్వాత మీ జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత, విద్యా అర్హత వివరాలను ఎంటర్ చేయాలి. కోరిన సర్టిఫికేట్లను సరిగ్గా స్క్యాన్ చేసి అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఆ ఫారమ్‌ను ప్రింట్ తీసి, అవసరమైన సర్టిఫికేట్ కాపీలతో సహా నిర్ణీత గడువులోగా సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు అప్లికేషన్లకు చివరి తేదీ ఆగస్టు 05, అలాగే హైదరాబాద్ జిల్లాకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్టు 22. చివరి సమయంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవడం మంచిది.





