తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సువర్ణావకాశాన్ని అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల వారీగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను సర్కార్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు రాగా, తాజాగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 178 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ములుగు జిల్లా పరిధిలోని తాడ్వాయి, వెంకటాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 115 ఖాళీలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 293 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలను గమనిస్తే.. అత్యధికంగా పాల్వంచ ప్రాజెక్టు పరిధిలో 29 పోస్టులు, మణుగూరులో 24 పోస్టులు, ఇల్లెందులో 21 పోస్టులు, టేకులపల్లిలో 19 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు దమ్మపేట, కొత్తగూడెం ప్రాజెక్టులలో చెరి 16 ఖాళీలు, దుమ్ముగూడెంలో 12, అశ్వారావుపేటలో 11, బూర్గంపాడులో 10, చంద్రగొండలో 8 ఖాళీలు ఉన్నాయి. ఇక ములుగు జిల్లా విషయానికి వస్తే తాడ్వాయి, వెంకటాపురం ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల విభాగంలో మొత్తం 115 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు:
అంగన్‌వాడీ టీచర్ , హెల్పర్ (ఆయా) పోస్టులకు కనీస విద్యా అర్హత ఇంటర్‌గా నిర్ణయించారు. అయితే అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుకు ఒకవేళ ఇంటర్ చదివిన మహిళలు ఎవరూ అందుబాటులో లేకపోతే.. అప్పుడు టెన్త్ పాసైన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానికత కలిగిన మహిళలు, వినికిడి పరికరాలు వాడుతూ ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించే దివ్యాంగులు ఈ పోస్టులకు అర్హులు.
ఎంపిక విధానం:
ఈ నియామకాల్లో ఎంపిక విధానం చాలా పారదర్శకంగా ఉంటుంది. అప్లై చేసుకునే అభ్యర్థి తప్పని సరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. అంటే.. పట్టణ ప్రాంతాల్లో అయితే సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలోనే నివసిస్తూ ఉండాలి. గిరిజన ఆదివాసీ తండాలు, గూడెంలలో ఉండే పోస్టులకు స్థానిక ఎస్టీ మహిళలు, ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఇంటర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తారు. అలాగే వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం అదనపు వెయిటేజీ ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (DSC) నిర్వహించే 10 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ములుగు జిల్లా అభ్యర్థులు అప్లై చేయడానికి చివరి తేదీ జులై 15 కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభ్యర్థులకు చివరి తేదీ జులై 18. కొత్తగూడెం జిల్లా అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ జులై 20 నుంచి ఆగష్టు 7 వరకు జరుగుతుంది.
ఆన్‌లైన్‌లో అప్లై చేసే సమయంలో బర్త్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇంటర్ లేదా ఆపై చదివిన విద్యార్హత మార్కుల లిస్ట్,రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. అలాగే వితంతువులు అయితే భర్త డెత్ సర్టిఫికెట్, అనాథలు అయితే అనాథ సర్టిఫికేట్ , దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అర్హత గల స్థానిక మహిళలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.





