టీచర్ పోస్టుల నియామకాలకు కీలకమైన టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఫీజుల నియంత్రణ, మన ఊరు మన బడిపై ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటీ చేసిన తాజా సిఫారసుల మేరకు టెట్ నిర్వహించేందుకు అవసరమైన సన్నాహాలు మొదలు పెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లుగా టెట్ నిర్వహించడం లేదు. తొలి టెట్‌ను 2016 మే 22న, రెండో టెట్‌ను 2017 జూలై 23న నిర్వహించింది. . ఆ తరువాత మళ్లీ టెట్ ఊసే లేకపోవడంతో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం టెట్‌కు జీవితకాలపరిమితి ఇచ్చినా.. నూతన అభ్యర్థులతోపాటు, గతంలో టెట్‌లో అర్హత సాధించనివారు లక్షల్లో ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా బోధన చేయాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులంతా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించినవారు పేపర్-1లో 65 వేల మంది, పేపర్-2లో 1.5 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 1.75 లక్షల మంది డీఎడ్, 3 లక్షల మందికి పైగా బీఎడ్ పూర్తిచేసిన వారు ఉన్నట్లు అంచనా. ప్రతి ఏడాది 12,500 మంది డీఎడ్ కోర్సును, మరో 15 వేల మంది బీఎడ్ కోర్సును పూర్తి చేస్తున్నారు. వీరందరూ టెట్‌తో పాటు టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నోటిఫికేషన్, ప్రతి రెండేళ్లకో సారి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేవారు. తెలంగాణ ఏర్పడ్డాక పరిస్థితి మారిపోయింది. ఒకే ఒక్కసారి 2017లో టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటివరకు ఉన్న డీఎస్సీ పేరును టీఆర్‌టీగా మార్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నియమకాలు చేపట్టారు. అప్పట్లో మొత్తం 25వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది. చివరికి 8792 ఖాళీల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. దశల వారీగా వీటిని భర్తీ చేస్తున్నారు. ఆ తరువాత మళ్లీ నోటిఫికేషన్ రాలేదు.
ఇటీవలి టీచర్ల బదిలీలతో అన్ని అవరోధాలు తొలిగిపోయాయి. ఖాళీ పోస్టుల విషయంలో ఒక స్పష్టత కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై, టీచర్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్లు అంతటా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినేట్ సబ్ కమిటీ టెట్ నిర్వహించేందుకు మొగ్గు చూపింది. అదే విషయాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ( అందుకు సంబంధించిన నోట్ ఈ పోస్టు దిగువన అటాచ్ చేయబడింది) దీంతో లక్షలాది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.