తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే వినూత్నంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ ఈ నెల నుంచే కోర్సులను ప్రారంభించనుంది. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణను అందించి జాబ్ గ్యారంటీ ఉండే కోర్సులను యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆయా రంగాల్లో పేరొందిన కంపెనీలు, సంస్థల భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందిస్తోంది. హైదరాబాద్‌లోని కందుకూర్ మండలం మీర్ఖాన్పేట లో ఆగస్ట్ 1వ తేదీన 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ భవనాలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.
గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో తాత్కాలికంగా యూనివర్సిటీ తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే బోర్డ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సమక్షంలో జరిగిన సమావేశంలో ఏయే కోర్సులు ముందుగా ప్రారంభించాలనే చర్చలు జరిగాయి. లాజిస్టిక్స్, మెడికల్ అండ్ హెల్త్, ఫార్మా రంగాల్లో అత్యధిక ఉద్యోగాల డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెలలోనే మొదటి విడత కోర్సులు ప్రారంభించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు ప్రకటించారు. దసరా సెలవుల తర్వాత నాలుగు కోర్సులకు సంబంధించిన అడ్మిషన్లు, అర్హతల పూర్తి వివరాల నోటిఫికేషన్ వెలువడనుంది. త్వరలోనే మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు స్కిల్ యూనివర్సిటీ వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోందని వైస్ ఛాన్సలర్ తెలిపారు.
నాలుగు కోర్సులు:
- లాజిస్టిక్స్ కోర్సులు: లాజిస్టిక్స్ రంగంలో వేర్ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్, కీ కన్జైనర్ ఎగ్జిక్యూటివ్ పేర్లతో రెండు షార్ట్ టర్మ్ కోర్సులను యూనివర్సిటీ ప్రారంభించనుంది. ప్రముఖ గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీ రెడింగ్టన్ గచ్చిబౌలి క్యాంపస్‌లో రూ.7 కోట్లతో లాజిస్టిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తోంది.
- నర్సింగ్ ఫినిషింగ్ కోర్సు (FINE): నర్సింగ్‌లో అత్యుత్తమ నైపుణ్యాలను నేర్పేందుకు ఫినిషింగ్ స్కిల్స్ ఎక్సెలెన్స్ కోర్సును ప్రారంభించనుంది. అపోలో మెడ్‌స్కిల్స్ లిమిటెడ్ ఈ కోర్సు నిర్వహిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలపై శిక్షణను అందించే ఈ కోర్సు నర్సులకు ఉన్నత ఉపాధి అవకాశాలను అందించనుంది.
- ఫార్మా అప్రెంటిస్షిప్ కోర్సు: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తో భాగస్వామ్యంతో 6 నెలల అప్రెంటిస్షిప్ ఇండక్షన్ కోర్సును యూనివర్సిటీ ప్రారంభిస్తుంది. ఫార్మా రంగంలో ప్రాక్టికల్ అనుభవం కోసం ఈ కోర్సుఉ రూపొందించారు. డాక్టర్ రెడ్డీస్ ఫార్మా అసోసియేట్ పేరుతో ఈ కోర్సు నిర్వహిస్తారు.
ఉద్యోగ అవకాశాలు:
యూనివర్శిటీ అందించే కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ గ్యారంటీగా ఉంటుంది. ఈ విద్యార్థులు నెలకు కనీసం రూ. 20,000 నుంచి రూ. 25,000 వేతనంతో ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఉంటాయి.