మెగా డీఎస్సీకి ఈసారి పోటీ తక్కువగానే ఉంది. ఒక్కో టీచర్ పోస్టుకు సగటున 25 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే నెల 17 నుంచి డీఎస్సీ పరీక్షలు ఆన్లైన్లో (సీబీటీ పద్ధతిలో) నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల షెడ్యూల్ను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటీఫికేషన్ రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం పాత నోటిఫికేషన్ను రద్దు చేసింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి జూన్ 20వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరించింది.
ఈసారి డీఎస్సీ దరఖాస్తుదారుల్లో ఇదివరకే డీఎస్సీ2023కి అప్లై చేసుకున్న వారు 1.77 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. 2017లో జరిగిన టీఆర్టీలో 8,792 పోస్టులకు 2,77,574 మంది అప్లై చేయగా, ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ పడ్డారు. అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్నా, పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పోస్టులు పెరగటంతో పోటీ తగ్గినట్లయింది.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం భారీగా పోటీ ఉంది. ఒక్కో పోస్టుకు 56 మంది పోటీ పడుతున్నారు. ఎస్జీటీ పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది. ఒక్కో పోస్టుకు కేవలం 12 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఒక్కో పండిట్ పోస్టుకు 25 మంది, ఒక్కో పీఈటీ పోస్టుకు 65 మంది పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్ లో 27,027 మంది ఉన్నారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 2,265 మంది అప్లై చేశారు. ఎక్కువగా నల్గొండలో 15,610 మంది, నిజామాబాద్ లో 13,166 మంది, ఖమ్మంలో 12,970 మంది, వికారాబాద్ లో 12,856, సూర్యపేటలో 11,907, జనగామలో 11,021, నాగర్ కర్నూల్ లో10,651, సంగారెడ్డిలో 10,569 మంది దరఖాస్తు చేశారు. తక్కువగా జయశంకర్ భూపాలపల్లిలో 2,828, ములుగులో 2,908 మంది అప్లై చేశారు. ఇటీవల నిర్వహించిన టెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశంతో 24 వేల మంది అప్లై చేసుకున్నారు.