Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsతెలంగాణ జల తరంగం: సాగునీటి ప్రాజెక్టులు

తెలంగాణ జల తరంగం: సాగునీటి ప్రాజెక్టులు

ఇరిగేషన్​ ప్రాజెక్టులు

తెలంగాణలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలను నివారించడానికి సాగునీటి సౌకర్యం అత్యవసరమని ప్రభుత్వం భావించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని సోర్సుల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు, మొత్తంగా రాష్ట్రంలో ఒక కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గడిచిన పదేళ్లలో 23 జిల్లాలకు కలిపి 94వేల కోట్లు సాగునీటి రంగానికి ఖర్చు చేశారు. తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్ల కాలంలోనే ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ.50 వేల కోట్లకుపైనే ఖర్చు చేసింది.

Advertisement

1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా కార్యాచరణ. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం నాలుగంచెల  వ్యూహాన్ని అనుసరిస్తున్నది.

1) ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ప్రారంభించి అనేక కారణాల వలన పూర్తికాకుండా పెండింగ్ లో ఉండిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, వాటిలో కొన్నింటిని  తెలంగాణా అవసరాలకనుగుణంగా రీ ఇంజనీరింగ్ చేసుకొని పూర్తి చేసుకోవడం.

2) అప్పటి ప్రభుత్వాలు ఆమోదించి అటకెక్కించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి నిర్దేశిత ఆయకట్టుకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడం.

Advertisement

3) తెలంగాణ ఏర్పాటుకు ముందున్న ప్రభుత్వాల నిర్లక్ష్యంతో శిథిలమైపోయిన పాత సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకీకరించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించడం.

4) తెలంగాణాకు అనాదిగా జీవనాధారంగా ఉన్న గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి తెలంగాణా గ్రామీణ ఆర్ధిక , సామాజిక , సాంస్కృతిక వికాసానికి దోహదం చేయడం.

ఈ లక్ష్యాల సాధనలో భాగంగా తెలంగాణలో ప్రారంభించి వదిలేసిన 23 భారీ ప్రాజెక్టులని, 13 మధ్యతరహా ప్రాజెక్టులని పూర్తిచేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకిగా నిలిచి, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు వదిలేసిన అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం నిర్దేశిత ఆయకట్టు 68.19 లక్షల ఎకరాలు కాగా, స్థిరీకరణ పొందే ఆయకట్టు 8.45 లక్షల ఎకరాలు. వీటిల్లో ఐదేండ్ల కాలంలో 12 ప్రాజెక్టులని పూర్తి చేసింది, మరికొన్ని ప్రాజెక్టుల ద్వారా పాక్షికంగా సాగునీరు అందుతున్నది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో 20 లక్షల ఎకరాలకు నీరందుతున్నది.

Advertisement

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి

సమైక్య రాష్ట్రంలో తెలంగాణా  ప్రాజెక్టుల నిర్మాణాన్ని గత పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా పెండింగ్ లో పడేసినారు. దశాబ్దాలు గడుస్తున్నా కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మిడ్ మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కొమురంభీమ్, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్ పూర్ తదితర ప్రాజెక్టుల పనులు పూర్తి కానివ్వలేదు. తెలంగాణా ఏర్పడగానే ఈ  పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా కదిలింది. ఇందులో కోయిల్ సాగర్, కిన్నెరసాని, మత్తడివాడు ప్రాజెక్టులను పూర్తిచేసింది. చనఖా-కొరటా ప్రాజెక్టు, గట్టు ఎత్తిపోతల పథకాలు, సదర్ మాట్ బ్యారేజీ, మల్కాపూర్ రిజర్వాయర్ల పనులు  వివిధ దశల్లో ఉన్నాయి. వట్టిపోయిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు  పునరుజ్జీవం కలిగించే గొప్ప  పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు,  నిరంతర నీటి లభ్యత కోసం  గోదావరిపై తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బ్యారేజీని కూడా నిర్మిస్తున్నది. ఖమ్మం జిల్లాలో  భక్త రామదాసు , జోగులాంబ గద్వాల జిల్లాలో  తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాలను 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి కరువు ప్రాంతాలకు సాగునేరు అందించడం జరిగింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి 11 డిసెంబర్, 2018న డ్రై రన్ నిర్వహించి, 13 డిసెంబర్, 2018 నుంచి నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుండటం ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరందుతున్నది. రాష్ట్రంలో 38 భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టగా అందులో 12 ప్రాజెక్టులు జనవరి 2020 నాటకి పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో కొన్ని పాక్షికంగా పూర్తయ్యాయి.

జనవరి 2020 నాటికి పూర్తయిన ప్రాజెక్టులు

Advertisement

అలీసాగర్, గుత్ప, గడ్డెన్నవాగు, భక్త రామదాసు, కోయిల్ సాగర్, మత్తడివాగు, చౌట్ పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, రాలివాగు, కిన్నెరసాని, బాగారెడ్డి సింగూరు కెనాల్స్, గొల్లవాగు, నిజాంసాగర్ ప్రాజెక్టు – తదితర 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. దీంతో 35.11 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది.

పనులు నడుస్తున్న ప్రాజెక్టులు

ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, ఎస్సారెస్పీ -2, దేవాదుల, కల్వకుర్తి, బీమా ఎత్తిపోతల, నెట్టెంపాడు, శ్రీపాద ఎల్లంపల్లి, వరదకాల్వ, కొమురం బీం, నీల్వాయి, పాలెం

Advertisement

80 లక్షల ఎకరాలకుపైగా సాగునీరు…

రాష్ట్రంలో 2020 నాటికి 80 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతున్నది. అన్నిప్రాజెక్టులు పూర్తయితే 53.02 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు, మరో 25.93 లక్షల ఎకరాలకు స్థిరీకరణ సాధ్యమవుతుంది. 2019-20లో సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.8,076.83 కోట్లు వెచ్చించగా.. అందులో 83 శాతం అంటే 6,670.05 కోట్లు ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపైనే ఖర్చుచేసింది. దీంతో అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. పాత పాలమూరు జిల్లాలోని కోయిల్‌సాగర్‌ ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.65లక్షల ఎకరాలు నీటి సరఫరా జరుగడంతోపాటు, దీనిద్వారా వేల చెరువుల్లో ఏడాది పొడవునా జలకళ ఉట్టిపడుతున్నది. భీమా ద్వారా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో రెండు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి.

Advertisement

ప్రాజెక్టుల రీ డిజైనింగ్

నదుల్లో మన వాటా మన ప్రజలకు ఉపయోగపడేలా సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. రాష్ట్ర విభజనకు ముందు నదీ జలాల్లో మన వాటా ప్రకారం మనం నీళ్లు వాడుకోలేకపోయాం. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1,250 టిఎంసీలు. మరో 150 టిఎంసీలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఉంది. కానీ, ఈ నీటిని వాడుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ని చేపట్టింది. దక్షిణ తెలంగాణకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు ప్రాణహిత ప్రాజెక్టు, చనాఖా కొరాట ప్రాజెక్టుల  ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.

తుపాకులగూడెం వద్ద బ్యారేజీ ( సమ్మక్క బరాజ్ )– దేవాదుల రీ డిజైన్

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం అప్పటి ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆర్భాటంగా చేపట్టి, ఆ తర్వాత నిర్లక్ష్యంగా వదిలేసింది. అక్కడ నీటి లభ్యత కోసం ఎలాంటి బ్యారేజీని నిర్మించలేదు. దీంతో అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు,  నిరంతర నీటి లభ్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం కంతనపల్లి వద్ద  గోదావరిపై తుపాకులగూడెం వద్ద రూ.2,121 కోట్లతో తుపాకులగూడం బ్యారేజీని నిర్మిస్తున్నది. దీంతో 365 రోజులూ దేవాదుల వద్ద నీటి నిల్వ ఉంటుంది. ఈ క్రమంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని వరంగల్ జిల్లాకు డెడికేటెడ్ ప్రాజెక్టుగా మారుస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గతంలో 38 టీఎంసీల నీటితో 6.21 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రతిపాదించారు. కానీ దీని వినియోగ సామర్థ్యాన్ని 60 టీఎంసీలకు పెంచాలని 2017 ఫిబ్రవరి 2న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫేజ్-3 పనుల్లో టన్నెల్ నిర్మాణంపై రామప్ప తదితర ప్రాంతాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకున్నది. రామప్ప రిజర్వాయర్ నుంచి ధర్మసాగర్‌కు పైప్ లైన్ ద్వారా  నీటిని తీసుకురావడానికి రూ.1,101 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టేషన్ ఘన్‌పూర్ మండలం మల్కాపూర్‌వద్ద 10 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్టీ పర్పస్ రిజర్వాయర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సమైక్య రాష్ట్రంలో ప్రణాళిక లేకుండా ముందుకు తీసుకువచ్చిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదుల 1,2,3 ఫేజ్‌ల అంచనాలను పెరిగిన ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం రూ.13,445 కోట్లకు పెంచుతూ 2017 ఫిబ్రవరి 2న జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. దేవాదుల ప్రాజెక్టుకు 2017-18 బడ్జెట్లో రూ.1,499 కోట్లు కేటాయించారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు కూడా మరమ్మత్తులు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎల్ఎండీ ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు అక్కడ అభివృద్ధి చెందే మత్స్య సంపదపై హక్కులు కల్పించాలని 2017 జూన్ 17న జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

తుపాకులగూడెం బ్యారేజ్ కి వనదేవత సమ్మక్క పేరు : ఈ బ్యారేజ్ కి  ఆదివాసీ వీరవనిత, వనదేవత సమ్మక్క పేరుపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తుపాకులగూడెం బరాజ్‌ను సమ్మక్క బరాజ్‌గా పేరు మారుస్తూ జీవో జారీ చేయాలని 12 ఫిబ్రవరి 2020న ఈఎన్సీ మురళీధర్‌రావును సీఎం ఆదేశించారు.

ప్రాజెక్టులపై మహారాష్ట్రతో చారిత్రిక ఒప్పందం

Advertisement

గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. కేసీఆర్ 2016 మార్చి 8న మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక అవగాహన కుదుర్చుకుని వచ్చారు. రెండు రాష్ట్రాల్లోని ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వచ్చే సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. ఫలితంగా ఉమ్మడి అంతర్ రాష్ట్రీయ బోర్డు ఏర్పాటయింది. గోదావరిపై లక్ష్మీ (మేడిగడ్డ), ప్రాణహితపై తమ్మిడిహట్టి, పెన్ గంగపై రాజాపేట, చనఖా- కొరాటా, పింపరాడ్ బ్యారేజీల నిర్మిణానికి మార్గం సుగమం అయింది.  గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ 2016 ఆగస్టు 23న ముంబైలో చారిత్రక మహా ఒప్పందం చేసుకుని, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తాజా  ఒప్పందాలతో గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం లభించింది.

మొదటి ఒప్పందం: 16 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో గోదావరిపై 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో  మేడిగడ్డ వద్ద బ్యారేజీ (లక్ష్మీ) నిర్మాణానికి అంగీకారం.

ఆయకట్టు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్  జిల్లాల్లో కొత్తగా 18.25 లక్షల ఎకరాలు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరదకాలువ ప్రాజెక్టుల కింద  18.80 లక్షల ఎకరాల స్థిరీకరణ.

Advertisement

రెండో ఒప్పందం: 1.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో బ్యారేజీ నిర్మాణం

ఆయకట్టు: ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్-కాగజ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా  చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలు.

మూడో ఒప్పందం: 0.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో పెన్‑గంగపై 213 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో చనాఖ-కొరాట బ్యారేజీ నిర్మాణం.

ఆయకట్టు: ఆదిలాబాద్ జిల్లా తాంసి, భీంపూర్, ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లో 50 వేల ఎకరాలు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. 45 లక్షల ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యం

తెలంగాణ ఏర్పాటు కాకముందు సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు తండ్లాడేవాళ్లు. తలాపునే మనకు గోదావరి పారుతూ.. వందల టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో  కలుస్తున్నా, సమైక్య పాలకుల కుట్రలతో తెలంగాణలో ప్రాజెక్టులు లేక, ఆ జలాలనుగానీ, గోదావరి నదిలో మన వాటానుగానీ సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈక్రమంలో మన గోదావరి నీళ్లను మనం వాడుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధృఢ సంకల్పంతో రూపకల్పన చేసిందే కాళేశ్వరం ప్రాజెక్టు.

తెలంగాణ రైతులకు జీవధారగా మారే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 235 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయి. గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీరు చొప్పున 195 టీఎంసీల నీటిని మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు నీటితో రాష్ట్రంలో 45 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందనుంది.

కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతకూ నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.11,806 కోట్ల వ్యయంతో మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి తేదీ. 11.12.2019న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రోజుకు 2 టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి వీలుగా ఉన్నది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉన్నందున రోజుకు 3 టిఎంసిలను ఎత్తిపోసుకోవచ్చని అధికారులు ప్రతిపాదించారు. దీంతో మిడ్ మానేరు వరకు 3 టిఎంసిల నీటిని తరలించడానికి నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 2020 వేసవి నాటికి మిడ్ మానేరు 24 టీఎంసీల నీటితో నిండు కుండలా మారింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతల వివరాలు – 01.05.2020 నాటికి

  • లక్ష్మీ బరాజ్‌

తాజా నీటి నిల్వ – 3.039 టీఎంసీలు

ఇన్‌ఫ్లో – 1,200 క్యూసెక్కులు

లక్ష్మీ పంపులోని ఒక మోటర్‌ ద్వారా 

ఎత్తిపోస్తున్నది – 2,100 క్యూసెక్కులు

  • సరస్వతి బరాజ్‌

తాజా నీటి నిల్వ – 5.32 టీఎంసీలు

సరస్వతి పంపుహౌజ్‌లోని ఒక మోటర్‌ ద్వారా ఎత్తిపోస్తున్నది – 2,900 క్యూసెక్కులు

  • పార్వతి బరాజ్‌

తాజా నీటి నిల్వ – 3.921 టీఎంసీలు

పార్వతి పంపుహౌజ్‌ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నది – 2,610 క్యూసెక్కులు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నుంచి ఇప్పటివరకు ఎత్తిపోసిన నీటి పరిమాణం..

లక్ష్మీ పంపుహౌజ్‌60.5 టీఎంసీలు
సరస్వతి పంపుహౌజ్‌55.50 టీఎంసీలు 
పార్వతి పంపుహౌజ్‌53 టీఎంసీలు
నంది పంపుహౌజ్‌68 టీఎంసీలు
గాయత్రీ పంపుహౌజ్‌66 టీఎంసీలు
మొత్తం ఎత్తిపోతలు303 టీఎంసీలు

చెన్నూరుకు కాళేశ్వరం జలాల కోసం డీపీఆర్ (10.2.2020)

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని బీడు భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు మూడుబరాజ్‌ల బ్యాక్‌వాటర్‌ను తరలించేందుకు మూడు లిఫ్టు పథకాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లిఫ్టు పథకాలపై సమగ్ర సర్వేతోపాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు రూ.6.88 కోట్లు విడుదలచేస్తూ ప్రభుత్వం 10 ఫిబ్రవరి 2020న ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకాలతో చెన్నూరు నియోజకవర్గంలోని 1.35 లక్షల ఎకరాలకు శాశ్వత ప్రాతిపదికన సాగునీరు అందనున్నది.

కాళేశ్వరం సందర్శించిన సీఎం కేసీఆర్ (13.2.2020)

కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ పీఠభూమిపై మునుపెన్నడూ కనీవినీ ఎరుగని జలనిధిని చూసి అపరభగీరథుడు, సీఎం కేసీఆర్‌ ఉప్పొంగిపోయారు. కేవలం మూడున్నరేండ్లలోనే రికార్డుస్థాయిలో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం ‘కాళేశ్వరం’లో ప్రధానమైన లక్ష్మీ బరాజ్‌లో 16 టీఎంసీల నీటిని చూసి తన్మయం చెందారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా 13 ఫిబ్రవరి 2020న  రోజంతా జరిపిన పర్యటనలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేసిన సీఎం కేసీఆర్. ఆ తర్వాత లక్ష్మీబరాజ్‌ను సందర్శించి, ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు.

టూరిజం స్పాట్ గా కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి మీద నిర్మించిన బ్యారేజీలను టూరిస్ట్ స్పాట్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాశ్మీర్‌‌‌‌లో దాల్ సరస్సులా ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్లను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా అధికారులు ప్రతిపాదనలు సిధ్దం చేశారు. ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గోదావరి నదికి ఇరువైపులా దాల్ లేక్లా ఆకర్షణీయంగా మొక్కలు పెంచనున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి, అన్నారం బ్యారేజీల వద్ద  బోటింగ్, బృందావన్‌‌‌‌ గార్డెన్‌‌‌‌లోలా ఫౌంటెయిన్‌‌‌‌, అమ్యూజ్‌‌‌‌మెంట్ వాటర్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం మేడిగడ్డ  బ్యారేజీ టూరిస్ట్ స్పాట్‌‌‌‌కు రూ.105 కోట్లు, కన్నెపల్లికి రూ.80 కోట్లు,  అన్నారం బ్యారేజీకి రూ.25 కోట్లు, అన్నారం కెనాల్ టు కన్నెపల్లి టూరిజం పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. ఈ పనులు పూర్తయితే కాళేశ్వరానికి టూరిస్టుల సంఖ్య గననీయంగా పెరుగుతుంది.

రంగనాయకసాగర్ కు కాళేశ్వరం జలాలు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయకసాగర్‌లోకి నీళ్లొచ్చాయి. గోదావరి జలాలను మరో దశలో ఎత్తిపోసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులోనే రెండో అతిపెద్ద మోటర్లు ప్రారంభమయ్యాయి. మేడిగడ్డ వద్ద 90 మీటర్ల ఎత్తులో పారే గోదావరి జలాలను.. 490 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దపేటకు తరలించారు. రాజన్న సిరిసిల్ల – సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ (అనంతగిరి) జలాశయం నుంచి సిద్దిపేట సమీపంలోని రంగనాయకసాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లను తరలించే కార్యక్రమాన్ని 23 ఏప్రిల్, 2020న ప్రారంభించారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని సర్జ్‌పూల్‌ పంపుహౌజ్‌లో మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్‌లోకి నీళ్లు వదిలారు. దాదాపు 170 కిలోమీటర్ల దూరంలోని మేడిగడ్డనుంచి ప్రస్థానాన్ని ప్రారంభించిన కాళేశ్వరగంగ రంగనాయకసాగర్‌కు చేరి ఏడవగట్టాన్ని పూర్తిచేసుకున్నది. రంగనాయకసాగర్‌ ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలోని 71 వేల ఎకరాలు, సిరిసిల్ల నియోజకవర్గంలోని 23,645, హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని 4,900, మానకొండూరు నియోజకవర్గంలోని 9,730, జనగామ నియోజకవర్గంలోని వెయ్యి ఎకరాలకు సాగునీరు అందనున్నది.

అన్నపూర్ణ పంపుహౌజ్‌లోని 105 మెగావాట్ల సామర్థ్యంఉన్న నాలుగు మోటర్ల ట్రయల్ రన్ దశలవారీగా నిర్వహించి అన్నపూర్ణ జలాశయంలోకి నీటిని విజయవంతంగా ఎత్తిపోస్తున్నారు. దీంతో 3.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న అన్నపూర్ణ జలాశయంలో 1.7 టీఎంసీల మేర నీటినిల్వ చేరింది. అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి అప్రోచ్‌చానల్‌ (1.746కి.మీ)లో ప్రవహించి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయిపల్లి హెడ్‌రెగ్యులేటరీకి చేరుకున్న గోదావరి జలాలు అక్కడినుంచి గ్రావిటీ కెనాల్‌ (0.354కి.మీ), సొరంగం (8.59కి.మీ) ద్వారా రంగనాయక్‌సాగర్‌ సర్జ్‌పూల్‌ (చంద్లాపూర్‌ పంప్‌హౌజ్‌)కు చేరుకున్నాయి. చంద్లాపూర్‌ పంప్‌హౌజ్‌లో ఏర్పాటుచేసిన మోటర్లతో 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయక్‌సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. మూడు టీఎంసీల సామర్థ్యంగల రంగనాయక రిజర్వాయర్‌ నుంచి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని లక్షా 10వేల ఎకరాలకు సాగునీరందనున్నది.

రంగనాయక సాగర్ 3వ మోటారు ప్రారంభం

రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో భాగంగా 30 ఏప్రిల్, 2020న సర్జ్‌పూల్‌లోని 3వ మోటర్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. గోదావరి జలాలు పెద్దఎత్తున రిజర్వాయర్‌లోకి చేరాయి. ఈ నీటిని రంగనాయకసాగర్‌ కుడి, ఎడుమ కాల్వలకు విడుదల చేశారు.

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి

కాళేశ్వరం ప్రాజెక్టులో చారిత్రాత్మకమైన కొండ పోచమ్మ రిజర్వాయర్ ను 29 మే 2020న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో మోటర్లను సీఎం కేసీఆర్ ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. ముందుగా సీఎం కేసీఆర్‌ దంపతులు మర్కూక్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో జరిగిన చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మర్కూక్‌ పంప్‌హౌజ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ త్రిదండి చినజీయర్‌స్వామితో కలిసి సుదర్శనహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న తర్వాత మర్కూక్‌ పంప్‌హౌజ్‌ను ప్రారంభించారు. పంప్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్‌.. కంప్యూటర్‌ ద్వారా స్విచ్‌ఆన్‌ చేసి మొదటి మోటర్‌ను ప్రారంభించారు. నిమిషాల్లోనే గోదావరి జలాలు పంప్‌హౌజ్‌ను కొండపోచమ్మ రిజర్వాయర్‌ సిస్టిర్న్‌ నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పంప్‌హౌజ్‌ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌ బండ్‌పైకి సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. పంపునుంచి ఉప్పొంగుతున్న జలాలను చూసి పరవశించారు. సీఎం దంపతులు, చినజీయర్‌స్వామి అక్కడ గంగమ్మకు చీరెసారె సమర్పించారు. గోదారమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మర్కూక్‌ పంప్‌హౌజ్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌ రెండో నంబర్‌ మోటర్‌ను ప్రారంభించారు. రెండు మోటర్ల నుంచి ఉప్పొంగిన జలాలను చూసి రిజర్వాయర్‌ వద్దకు తరలివచ్చిన రైతులు, ప్రజాప్రతినిధులు పరవశించిపోయారు. మర్కూక్‌ పంప్‌హౌజ్‌ నుంచి వరదరాజపురం వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడ ఆలయంలో వరదరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి

    ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, చినజీయర్ స్వామి చేతుల మీదుగా 29 మే 2020న ఆవిష్కృతమైంది. గోదావరి నదిపై లక్ష్మి బ్యారేజి (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీరు 618 మీటర్ల అత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ లో పడతాయి. 15 టిఎంసిల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీటి సౌకర్యం లేక వ్యవసాయం సరిగా సాగకుండా ఎడారిగా మారిన కరువు ప్రాంతాలకు నీరు చేరుతుంది.   

శ్రీ సీతారామ ప్రాజెక్టు

ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామం వద్ద శ్రీ సీతారామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి 2016 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 8 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్నఈ ప్రాజెక్టుకు 2017-18 బడ్జెట్లో రూ.981 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 3.29 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు, సాగునీరందడమేగాక, 3.45  లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చు. మొత్తం 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది.

భక్త రామదాసు ప్రాజెక్టు

తెలంగాణ ప్రభుత్వం 11 నెలల రికార్డు సమయంలో పూర్తిచేసిన సాగునీటటి పథకం.. భక్త రామదాసు ప్రాజెక్టు. ఖమ్మం జిల్లా పాలేరులో భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి 16 ఫిబ్రవరి 2016న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు భూసేకరణలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టారు. పైపులైన్లు, పంప్‌హౌజ్, అప్రోచ్ ఛానల్, సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని సమాంతరంగా చేపట్టారు. సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేశారు. మంత్రులు, అధికారులు, ఇంజినీర్లు, వర్కింగ్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి కేవలం 11 నెలల కాలంలోనే పథకాన్ని పూర్తి చేసి దేశచరిత్రలో రికార్డు సృష్టించారు. నిర్దేశించుకున్న లక్ష్యాని కంటే 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేశారు. 2017 జనవరి 23వ తేదీన ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రాజెక్టును 2017 జనవరి 31న సీఎం కేసీఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పథకం ద్వారా తిరుమలాయ పాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలాల్లోని 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

రూ.3,482 కోట్లతో సీతమ్మసాగర్‌ (దుమ్ముగూడెం)

సాగునీరు, విద్యుదుత్పత్తి లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద సీతమ్మసాగర్‌ మల్టీ పర్పస్ ప్రాజెక్టు (దుమ్ముగూడెం)ను రూ.3,482 కోట్లతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను విడుదల చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. కేవలం సాగునీటికోసమే కాకుండా.. గోదావరిపై చెప్పుకోదగిన జలవిద్యుత్‌ కేంద్రం లేదనే లోటును తీర్చేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దుమ్ముగూడెం బరాజ్‌కు రూపకల్పన చేశారు. 37 టీఎంసీల నీటినిల్వతో, 70 గేట్లతో చేపడుతున్న ఈ బరాజ్‌ వద్ద సాంకేతికంగా హెడ్‌ అనుకూలంగా ఉండటంతో ఏకంగా 320 మెగావాట్ల జలవిద్యుదుత్పాదనకు అవకాశం ఉన్నది. కృష్ణాపై 2,369 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉండగా.. గోదావరిపై పోచంపాడు-36 మెగావాట్లు, నిజాంసాగర్‌-10 మెగావాట్లు, సింగూరు-15 మెగావాట్లతో మాత్రమే కేంద్రాలు ఉన్నాయి. దుమ్ముగూడెం బరాజ్ నిర్మాణంతో గోదావరిపై జలవిద్యుదుత్పత్తి సామర్థ్యం 381 మెగావాట్లకు పెరుగనున్నది. కాగా, ఈ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి రూ.3604 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.35 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్నఈ పథకానికి 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2017-18 బడ్జెట్లో రూ. 4 వేల కోట్లు కేటాయించారు. 1600 కోట్లు ఖర్చు చేశారు(2018 జూన్ నాటికి). శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 60 రోజులపాటు 120 టీఎంసీల వరద నీటిని లిప్ట్ చేసి, ఎగువ ప్రాంతాలకు అందించడమే ఈ  ప్రాజెక్టు లక్ష్యం. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 1100 గ్రామాలకు, హైదరాబాద్ కు తాగునీరు అందుతుంది. ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసి సాగు, తాగు అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. మొదటిదశ ఎత్తిపోతలతో నార్లాపూర్ జలాశయానికి, అక్కడి నుంచి రెండో దశలో ఏదుల రిజర్వాయర్ కు ఆరున్నర టీఎంసీల నీటిని మళ్లిస్తారు. మూడోదశలో వట్టెం ప్రాజెక్టుకు 16.58 టీఎంసీలు, అక్కడి నుంచి గ్రావిటీతో 19 టీఎంసీల నీటిని కరివెన జలాశయానికి  పంపేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. నాలుగో దశలో 5 లక్షల 42 వేల ఎకరాలకు సాగునీటితోపాటు హైదరాబాద్ కు తాగునీరు అందించనున్నారు. ఐదో దశలో ఉదండాపూర్ జలాశయం నుంచి నీటిని మళ్లించి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నింపుతారు. దీంతో 4 లక్షల 13వేల ఎకరాలకు సాగునీరందుతుంది.

డిండి ఎత్తిపోతల పథకం

ఎన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్లగొండ జిల్లా ప్రజల కోసం రూ.6,190 కోట్ల వ్యయంతో డిండి ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015 జూన్ 12న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 2 జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రాజెక్టు భూసేకరణకు రూ.75 కోట్లను విడుదల చేయాలని 2015 జులై 25న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కాగా, ఈ ప్రాజెక్టు కోసం 2017-18 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి, పనులను వేగవంతం చేశారు.

‘డిండి’కి ఆర్.విద్యాసాగర్ రావు పేరు

సాగు, తాగునీటిలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన సాగునీటిరంగ నిపుణుడు దివంగత ఆర్.విద్యాసాగరరావు పేరును డిండి ఎత్తిపోతల పథకానికి పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫైల్ పై 2018 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 2018 మే నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకాన్నిఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకంగా పరిగణించాలని ప్రభుత్వం నీటిపారుదల శాఖను ఆదేశించింది.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం

ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా  పెండింగ్‌లో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, స్వరాష్ట్రంలో మూడేండ్లలోనే కార్యరూపం దాల్చింది. కల్వకుర్తి మండలం ఎల్లికట్ట దగ్గర డీ-29 కాల్వ ద్వారా కృష్ణా జలాలను మంత్రి హరీశ్ రావు 2017 అక్టోబర్ 15న విడుదల చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను 25 టిఎంసిల నుంచి 40 టిఎంసిలకు పెంచారు. ప్రాజెక్టు కింద ఆయకట్టును 4 లక్షల ఎకరాలకు పెరిగింది.

కల్వకుర్తి ప్రాజెక్టులో మార్కండేయ లిఫ్టు నిర్మాణానికి ప్రతిపాదన – 14 ఫిబ్రవరి 2020

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన మార్కండేయ లిఫ్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ లిఫ్టు   కోసం సర్వే చేసి, డిపిఆర్ సిద్ధం చేయాలని 13 ఫిబ్రవరి 2020న జీవో జారీ చేసింది. 100 ఎకరాల విస్తీర్ణంలో అర టీఎంసీకి పైగా నీటి సామర్థ్యంతో నిర్మించే మార్కండేయ లిఫ్టు ద్వారా 5,622 ఎకరాలకు సాగునీటితోపాటు, మొత్తంలో 15శాతం నీటి సరఫరాతో పలు గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది.

ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మన రాష్ట్రానికున్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, డిండి, శ్రీ సీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తున్నది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉండి నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం వేగవంతం చేసి, నిధులు కేటాయించింది. ప్రభుత్వ కృషి వల్ల ఆయకట్టుకు నీరందింది. మహబూబ్ నగర్ జిల్లాలోని బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందుతున్నది.

వచ్చే ఖరీఫ్ నాటికి ఈ నాలుగు ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి చేసుకోవడం వల్ల పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.  ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం బీమ్, మత్తడివాగు, గడ్డెన్నవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయగా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. 2019 జూన్  నాటికి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయి లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఖమ్మం జిల్లాలోని పాలెం, కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా 20 వేల ఎకరాలకు నీరందుతుంది.

శ్రీరాంసాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు

ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును 9.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా, ఇప్పుడు దాని సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయింది. ఒకానొక సమయంలో తాగడానికి కూడా నీరులేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణలో నదుల నాడి పట్టేసిన సీఎం కేసీఆర్ గోదావరిని సజీవంగా ఉంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పునరుజ్జీవింప జేసేందుకు సంకల్పించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు 2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. స్వల్ప ఖర్చుతో ప్రతిపాదిత 9.6 లక్షల ఎకరాలతోపాటు, అదనంగా మరో 4.6 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 14.2 లక్షల ఎకరాల భూముల్లో సాగుచేసే రెండు పంటలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

కాళేశ్వరం నుండి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఇప్పటికే ఉన్న వరదకాల్వను మరింత బలోపేతం చేసి.. దానిని జలాశయంగా మార్చి మొత్తం శ్రీరాంసాగర్‌ ఆయకట్టును, ఆరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టుకు ఒకేసారి రూ. 2 వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్.. రైతుల్లో సంతోషాన్ని నింపారు. కాళేశ్వరం వరదకాలువతో ఈ ప్రాజెక్టును నింపడం వల్ల సాగు, తాగునీటికి కొరత ఉండదని,  రెండు పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది.

ఎస్సారెస్పీ వరదకాల్వ  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దగ్గర మొదలై  మిడ్ మానేరు ప్రాజెక్టు  వరకు ఉంటుంది. దీని పొడవు 123 కిలోమీటర్లు.  కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సా రెస్పీలోకి నీరు వస్తుంది. 2020 నాటికి ఎస్సారెస్పీ కాలువ నిండుగా ప్రవహిస్తున్నది.

ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ తో నీళ్లు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా.. రివర్స్ పంపింగ్ తో  ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తారు. దీనిలో రెండు టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ వరద కాలువ 99వ  కిలోమీటర్ దగ్గర పోస్తారు. ఇవి మిడ్ మానేరు ప్రాజెక్టుకు చేరతాయి. ఇందులో ఒక టీఎంసీ నీటిని  మిడ్ మానేరుకు వదిలి, ఇంకో టీఎంసీని పైకి తీసుకుపోతారు. మూడు దశలలో  రివర్స్ పంపింగ్ తో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పంపించేలా డిజైన్ చేశారు. రూ. 2 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం ఈ  పథకాన్ని చేపట్టింది. మూడు దశల  లిఫ్టులకు  156 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుండగా 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 పంపులు  ఏర్పాటు చేస్తారు. రివర్స్ పంపింగ్ తో పైకిపంపే నీళ్లతోపాటు.. వరద కాలువలనే ఒకటిన్నర టీఎంసీలదాకా  నీళ్లు నిల్వ ఉంటాయి. ఈ కాల్వ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు. దీంతో వరద ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు లిఫ్టు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో అనుసంధానించిన ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ జీవనాడిగా.. ప్రగతి రేఖగా భాసిల్లుతుంది.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం

ఆర్డీఎస్ రైతులకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ఉద్యమనేతగా 2002 జూలై 23న కేసీఆర్ ఐదురోజులపాటు పాదయాత్ర చేపట్టారు. దశాబ్దాలుగా నీటి కోసం వేచి చూస్తున్న ఆర్డీఎస్ రైతుల బాధలను అర్థం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నీళ్లు అందిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో 2018 జనవరి 8న జోగుళాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం తుమ్మిళ్లలో రూ.783 కోట్లతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటిదశ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. తుంగభద్ర నది నుంచి వరదల సమయంలో 90 రోజుల పాటు రెండు పంపుల ద్వారా నీటిని తరలించి ఆర్డీఎస్ కాల్వకు అనుసంధానం చేసి, డీ-24 నుంచి డీ-40 వరకు సాగునీరు పుష్కలంగా అందించాలని పథకంలో రూపకల్పన చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు రాజోలిబండ డైవర్సన్ స్కీం (ఆర్డీఎస్) నుంచి కొన్నేళ్లుగా నీరందక పోవడంతో ఆయకట్టు బీడుగా మారింది.

ఈ క్రమంలో ఆర్డీఎస్ పరిధిలోని 55,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం పనుల కోసం ప్రభుత్వం 90.27 ఎకరాల భూమిని సేకరించింది. అందులోనే ఓపెన్ చానల్, పంపుహౌస్ నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు, డెలివరీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తారు. తుంగభద్ర నది నుంచి 530 మీటర్ల మేరకు ఓపెన్ చానల్, 200 మీటర్ల ఫోర్‌వే ఏర్పాటు చేయనుంది. ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్ 286.5 మీటర్ల నుంచి సైతం పంపు హౌస్‌కు నీళ్లు వెళ్లేలా ఓపెన్ చానల్ ఏర్పాటు చేస్తారు. అక్కడ పంపు హౌస్ నిర్మాణం చేపట్టి, మూడు పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోటి 320 క్యూసెక్కుల నీటిని తోడుతాయి. రెండు పంపుల నీరు నేరుగా 75వ కిలో మీటర్ దగ్గర ఆర్డీఎస్ కాల్వలోని డీ-24 దగ్గర నీటిని వదలనున్నారు. అక్కడి నుంచి అలంపూర్ మండలంలోని డీ-40 వరకు నీటిని అందిస్తారు. 55,600 ఎకరాలకు సాగునీరందించే మొదటి దశ పనులను ఎస్‌ఈడబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి  ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పైపులు, మోటర్లను తెచ్చి పనులు చేస్తున్నారు.

నల్లగొండ జిల్లా కాలువల పునరుద్ధరణకు నిధులు

నల్లగొండ జిల్లాలో 3 కాలువల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 285 కోట్లను మంజూరు చేసింది. పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి కెనాల్, బీబీనగర్ మండలం బున్యాదిగాని కెనాల్, వలిగొండ మండలం ధర్మారెడ్డి కెనాల్ వ్యవస్థలను పునరుద్ధరించడానికి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. టెండర్లు కూడా ఖరారయ్యాయి.

ప్రాజెక్టుల నుంచి మంచినీరు, పరిశ్రమలకు నీరు

తెలంగాణ ఏర్పాటుకు ముందున్న ప్రభుత్వాలు కొన్ని మంచినీటి ప్రాజెక్టులు నిర్మించినా వాటికి నీరు అందుబాటులో లేక నిరుపయోగంగా వుండేవి. పరిశ్రమలకు కూడా నీటి లభ్యత సమస్యగా వుండేది. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి అవసరాల కోసం, మరో 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునేలా ప్రభుత్వం విధానం రూపొందించింది.

రాష్ట్రంలో 1200 చెక్‌డ్యాంలు

రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 600, వచ్చే ఏడాదిలో మిగిలిన వాటి నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 146 చెక్‌డ్యాంలు మంజూరు చేశారు. అందులో 53 పూర్తికాగా, మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయి. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలోని  వాగులు, వంకల్లో సుమారు 15 టీఎంసీల నీటిని నిల్వ చేసి, మూడులక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు.

కాల్వల్లో తూముల నిర్మాణం కోసం రూ.471 కోట్లు

భారీ, మధ్యతరహా ప్రాజెక్టు కాల్వ ల్లో రూ.471 కోట్లతో 3 వేల తూముల (ఓటీ) నిర్మాణం చేపట్టగా.. అందులో 70 శాతం పనులు పూర్తయ్యాయి.

మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ

కాకతీయ రాజులు వెయ్యేళ్ల క్రితం తవ్వించిన గొలుసుకట్టు చెరువులతో తెలంగాణలో వ్యవసాయం సుభిక్షంగా సాగేది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండేది. గ్రామాలు కూడా స్వయం పోషకాలుగా ఉండేవి. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల హయాంలో చెరువులు కుట్ర పూరితంగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. చెరువులన్నీ శిథిలావస్థకు చేరుకొని, తెలంగాణలో వ్యవసాయం బాగా దెబ్బతిన్నది. మళ్లీ చెరువులకు పూర్వకళ వస్తే తప్ప గ్రామాలు బాగుపడవని, భారీ ప్రాజెక్టులను నమ్ముకోవడం కన్నా, చెరువులను పునరుద్ధరించు కోవడమే ఉత్తమమైన మార్గమని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు.

 తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో 265 టీఎంసీల వాటా వుంది. కానీ, మనం ఆ నీటిని పూర్తిస్థాయిలో వాడుకోవడం లేదు. చెరువులను పునరుద్ధరిస్తే తప్ప మనకు కేటాయించిన నీటిని వాడుకోవడం సాధ్యంకాదని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకానికి రూపకల్పన చేశారు. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గం  సదాశివనగర్ పాత చెరువు పునరుద్ధరణ పనులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 2015 మార్చి 12న మిషన్ కాకతీయ పథకాన్నిఅధికారికంగా ప్రారంభించారు. దీంతో తెలంగాణలో వేలాది చెరువులకు ప్రాణం లేచివచ్చింది. ‘తాంబాలా’లుగా ఉన్న చెరువులు ‘గంగాళాలు’గా తయారయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ పనితీరు కళకళలాడుతున్న చెరువులే ఉదాహరణ.

 జూలై 2014 లో మొదటిసారిగా తెలంగాణలో చెరువుల సమగ్ర సర్వే జరిగింది. అన్ని జిల్లాల్లో మొత్తం చెరువుల సంఖ్య 46,571 గా తేలింది. వీటిలో 38,451 చెరువులు కాగా మిగతావి కుంటలు ఉన్నాయి. ఇందులో  గొలుసుకట్టు చెరువులు 5 వేలకు పైనే ఉన్నట్టు లెక్క తేలింది. వీటి కింద ఉన్న ఆయకట్టు 25,92,437 ఎకరాలు. మిషన్ కాకతీయ పథకం చక్కటి ఫలితాలిస్తున్నది. ఈ పథకం చేపట్టిన ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెరిగాయి. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మిషన్ కాకతీయ పనులు చేపట్టిన ప్రాంతాల్లో జరిపిన శాస్త్రీయ అధ్యయనాల్లో ఇది తేలింది.

  1. మిషన్ కాకతీయ నాలుగు దశల పురోగతి

ఇప్పటివరకు నాలుగు దశల్లో  26,690 చెరువులకు పూర్వ వైభవాన్ని కల్పించింది. పునరుద్ధరణ పనులు చేపట్టిన చెరువుల కింద 20.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. రూ.9,155.97 కోట్ల అంచనాతో నాలుగు విడుతలుగా చేపట్టిన పనులతో దాదాపు 22 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కింద రూ.4,352.18 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసింది.

నాలుగు విడుతల్లో 2,384.35 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలిగించారు. తద్వారా 8.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఏకంగా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమైంది. మరమ్మతుల్లో భాగంగా పూడిక తొలగింపు, చెట్లు, పొదలను తొలగించడంతోపాటు మత్తడి ఎత్తును పెంచడంతో చెరువుల సామర్థ్యం పెరిగింది. 2016-17 నుంచి 2018-19 వరకు చెరువుల కింద సాగువిస్తీర్ణం పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావటం, ప్రాజెక్టుల కాల్వలను చెరువులకు అనుసంధానించడంతో సాగు విస్తీర్ణం ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని నీటిపారుదలశాఖ అంచనావేస్తున్నది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత చెరువుల కింద సాగు విస్తీర్ణం

సంవత్సరంవానాకాలంయాసంగిమొత్తం
2014-155,84,1781,11,3976,95,575
2015-162,82,98749,4753,32,462
2016-178,73,4257,25,65011,99,075
2017-189,41,4114,24,01113,65,422
2018-1910,88,4543,88,40614,76,860

మిషన్ కాకతీయ ప్రభావాలు – 3 మీటర్లు పెరిగిన భూగర్భ జలాలు

మొత్తంగా ఆయకట్టులో ఉన్న 17%  ఎండిపోయిన బావులు, బోరు బావులు తిరిగి పునరుజ్జీవం పొందాయి. ఇవి ఆయకట్టు ప్రాంతంలో, ఆయకట్టు బయట కూడా ఉన్నాయి. గతంలో భూమి నుంచి 11.88 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండగా, ఇపుడు 3 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగి 8.88 మీటర్ల లోతున నీళ్లు అందుతున్నాయి. మెదక్ జిల్లాలో అత్యధికంగా 15.17 మీటర్లు, అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో 1.81 మీటర్లు భూగర్భ జల మట్టం పెరిగినట్టుగా అధ్యయనాల్లో తేలింది.

పంటలు, దిగుబడి: సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు పంట దిగుబడి కూడా పెరగడం అంటే..  చెరువుల పునరుద్ధరణతో నీటి నిల్వ పెరిగి నీటి లభ్యత పెరిగిందని భావించవచ్చు. మిషన్ కాకతీయ ప్రభావంతో గతంలోకంటె వరి ఎకరాకు 3.32 క్వింటాళ్ల దిగుబడి పెరిగితే, పత్తి 3.79 క్వింటాళ్లు, పసుపు 5 క్వింటాళ్లు, మక్కజొన్న 6.08 క్వింటాళ్లు, మిర్చి 7.13 క్వింటాళ్ల దిగుబడి పెరిగింది. 

పూడిక మట్టి, రసాయన ఎరువుల వినియోగం: పూడిక మట్టిని చల్లుకున్నరైతు  కుటుంబాలకు రసాయనిక ఎరువుల వాడకం  30%  తగ్గింది. ఆ మేరకు రైతుకు ఆర్ధిక భారం తగ్గింది. పూడిక మట్టిని చల్లుకున్న రైతులకు పంటల దిగుబడిలో పెరుగుదల నమోదైంది. రైతులకు ఎకరాకు వరికి రూ.1915, పత్తికి రూ.3490, మిర్చి పంటకు రూ.595 మేర ఖర్చు తగ్గింది.

చేపల పెంపకం: మిషన్ కాకతీయ  చెరువుల్లో 2013-14  ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు 2016-17 సంవత్సరంలో చేపల ఉత్పత్తి  62 శాతం వరకు పెరిగింది. 2018-19లో ఐదు వేల చెరువుల్లో 70 కోట్ల చేప పిల్లల్ని వేయడం ద్వారా 2.94 లక్షల టన్నుల మత్స్య సంపద అభివృద్ధి చెందింది. దీని ద్వారా రూ.2.942 కోట్ల  విలువైన మత్స్య సంపదను సృష్టించడం సాధ్యమైంది.

చెరువు కట్టల బలోపేతం : మిషన్ కాకతీయలో చెరువు కట్టలు బలోపేతం అయిన కారణంగా వరదలకు తెగిపోయిన చెరువులు , ఇతరత్రా నష్టపోయిన  చెరువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వేల సంఖ్యలో నష్టానికి గురయ్యే చెరువులు వందల్లోకి పడిపోయినాయి. బాగా వర్షాలు పడిన సంవత్సరాల్లో నష్టపోయిన చెరువుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నది. 2009లో 1,107, 2010 లో 4,251, 2013 లో 1,868 చెరువులు బాగా వర్షాలు పడి నష్టపోగా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పుణరుద్దరన తరువాత నష్టపోయిన చెరువుల సంఖ్య వందల సంఖ్యలోకి వచ్చాయి.  మిషన్ కాకతీయ పథకంలో చెరువు కట్టలను బలోపేతం చేసినందువల్లనే ఇది సాధ్యమైంది.

చెరువులకు జియో ట్యాగింగ్‌

దేశంలోనే తొలిసారి చెరువులకు ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేపట్టింది. వెబ్‌సైట్‌లో వివరాలన్నీ అందుబాటులో పెట్టడంవల్ల ఎక్కడి నుంచైనా ఏ చెరువు గురించైనా తెలుసుకోవచ్చు. 46 వేల చెరువుల ట్యాగింగ్ పూర్తయింది.

ఫీడర్ చానల్స్ పునరుద్ధరణకు చర్యలు

వరదను మోసుకొచ్చే ఫీడర్ చానల్స్ ఏ చెరువుకైనా ప్రాణాధారం. ఆ మార్గం బాగుంటేనే పడిన ప్రతి వర్షపు చినుకు చెరువుకు చేరి జలకళ సంతరించుకుంటుంది. కానీ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తెలంగాణలో ఏకంగా 18 వేల చెరువులు జీవధార కోల్పోయాయి. వరద వచ్చే మార్గాలు మూసుకు పోవడంతో వాస్తవ సామర్థ్యం మేరకు నీరు నిల్వ కావడం లేదు. భారీగా వర్షాలతో వరద వచ్చినప్పటికీ, సహజ సిద్ధంగా రావాల్సినంత వరద నీరు చెరువుల్లో నిల్వ కాలేదు. 20 ఏండ్లుగా వీటిని పరిశీలిస్తే.. ఏడాదిలో అత్యధిక నెలలు ఆ చెరువులన్నీ ఎండిపోయి ఉన్నట్టుగా సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ లో భాగంగా ప్రభుత్వం ఫీడర్ చానల్స్ పునరుద్ధరణకు కూడా ప్రాధాన్యం కల్పించింది.

ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం

యావత్ తెలంగాణ రాష్ట్రంలోని చెరువులన్నీ 365 రోజుల పాటు నీటితో కళకళలాడాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం అనే కొత్త కార్యక్రమం చేపట్టింది. మిషన్ కాకతీయ ద్వారా బాగుపడ్డ చెరువులు వర్షం వచ్చినా, రాకపోయినా సరే ఎప్పుడూ  నిండుకుండలా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకే ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయాలని భావించారు. ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టుల కాల్వలను చెరువులకు కలుపుతారు. గొలుసుకట్టు చెరువులోని మొదటి చెరువుకు ప్రాజెక్టు నుంచి కాల్వ ద్వారా నీరందిస్తారు. ఆ చెరువు నిండి, అలుగు పోసి కింద చెరువు నిండుతుంది. గొలుసుకట్టు చెరువుల్లోని చివరి చెరువు కూడా పూర్తిగా నిండేవరకు కాల్వ ద్వారా ప్రాజెక్టుల నీళ్లు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికోసం కాల్వ నుంచి గొలుసుకట్టులోని మొదటి చెరువుకు మంచి కాల్వ నిర్మిస్తామనీ, ఒక చెరువు నుంచి మరో చెరువుకు అలుగు నీరు సాఫీగా పారడానికి కాల్వలు సిద్ధం చేస్తామని చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ చిన్న నీటిపారుదల కోసం, అంటే  చెరువుల కోసం తెలంగాణకు 265 టిఎంసిలను కేటాయించింది.

మొత్తం 12,154 గొలుసుల గుర్తింపు

గొలుసుకట్టు చెరువులను అనుసంధానించే కార్యక్రమం సిద్ధమైంది. వర్షం ద్వారా వచ్చే నీళ్లు, ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లన్నీ చెరువులకు చేరి, చెరువులన్నీ నిండేలా గొలుసు కట్టు చెరువులు-ప్రాజెక్టు కాల్వల అనుసంధానం ప్రణాళిక ఖరారైంది. ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే చాలు. చెరువులు జలకళ సంతరించుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు కాల్వలతో చెరువుల అనుసంధానం తుది దశకు చేరుకుంది. చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో ఆయకట్టు ప్రాంత అభివృద్ధి సంస్థ (కాడా) గొలుసుల విధానాన్ని కొలిక్కి తెచ్చింది. రాష్ట్రంలో ఉన్న 48,843 చెరువుల్లో ఒకే గొలుసులో 27,814 ఉన్నట్లు అధికారులు తేల్చారు. అంటే 57 శాతం సహజసిద్ధంగా ఏర్పడిన గొలుసుకట్టు వ్యవస్థలో ఉన్నాయి. 34శాతం చెరువులు మాత్రం భౌగోళికంగా దేనికవే ఉన్నాయి. ఈ చెరువులకు సమీపంలో ఉన్న ప్రాజెక్టు కాల్వలను కూడా గుర్తించారు.

రాష్ట్రంలో ఒక్కో గొలుసులో రెండు నుంచి పదికిపైగా చెరువులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 12,154 గొలుసులను గుర్తించారు. పైనున్న చెరువుకు సమీపంలోని ప్రాజెక్టు కాల్వను అనుసంధానిస్తే సులువుగా కింది చెరువులు నిండేలా ఈ గొలుసుకట్టు వ్యవస్థను గుర్తించారు. ప్రధాన ప్రాజెక్టుల కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు గొలుసు వ్యవస్థకు ఎంతదూరంలో ఉన్నాయో కూడా తేల్చారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!