విద్యుత్ రంగంలో అద్భుత విజయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలు విధించేవారు. హైదరాబాద్ నగరంలో రోజూ 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి. కావాల్సినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డవి. కరెంటు కోసం పారిశ్రామిక వేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. హైదరాబాద్ లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది. వ్యవసాయానికి రెండు మూడు గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే నాశనం అయ్యేది. లో ఓల్టేజీ సమస్యల వల్ల నిత్యం మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కూడా ఈ దుస్థితి కొనసాగింది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
విద్యుత్ సంక్షోభాన్ని సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడమనే సవాల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటగా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించుకోగలిగారు. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. అవి వేగంగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించే వరకు వెంటపడ్డారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అత్యవసం కాబట్టి, ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పిజిసిఎల్ ద్వారా కొత్త లైను నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు.
ఆరో నెల నుంచే కోతల్లేని విద్యుత్ సరఫరా
ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల (2014, నవంబర్ 20) నుంచే కోతల్లేని విద్యుత్ ప్రజలకు అందిస్తున్నారు. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 9 గంటల త్రీఫేజ్ కరెంటు అందిస్తున్నారు. భవిష్యత్ లోనూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలుండకుండా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 28 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నది.
వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా
వ్యవసాయ సాగుకు తగినంత నీరు బోరు లేదా బావుల ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర కరెంటు కోతల వల్ల వ్యవసాయాన్ని సాగు చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సమస్య విద్యుత్తే కనుక ప్రభుత్వం వ్యవసాయానికి 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది.
రాష్ట్రంలోని 30 శాతం కరెంటు ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. సమైక్య పాలనలో కనీసం 1500 మెగావాట్లు కూడా వ్యవసాయానికి ఇవ్వలేదు. కానీ నేడు దాదాపు 3500 మోగావాట్ల కరెంటు వ్యవసాయానికి వినియోగం అవుతున్నది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కోసం చేసిన కేటాయింపులు 3,621 కోట్లు. తెలంగాణ వాటా 1,521 కోట్లు. కానీ నేడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కేటాయించిన బడ్జెట్ పది వేల కోట్ల రూపాయలు.
వంద శాతం పెరిగిన స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
2014లో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, ఫిబ్రవరి 2020 నాటికి వందశాతానికి పైగా పెరిగి 15,980 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. ఇందులో 3,681 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉంది.
యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం
4 వేల మెగావాట్ల రికార్డు స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో జెన్ కో దామరచర్లలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మిస్తున్నది. ఈ ప్లాంటు కొత్త రికార్డు సృష్టించబోతున్నది. నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఒక రాష్ట్రం తనకు తానుగా 4వేల మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్లాంటు స్థాపించడం దేశంలోనే ఇది ప్రప్రథమం.
భద్రాద్రి పవర్ ప్లాంట్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని ఏడూళ్ల బయ్యారం వద్ద 1,080 మెగావాట్ల (4 X 270) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ స్టేషన్ (బీటీపీఎస్)త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది.
రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణం
కేటీపీఎస్ 7వ యూనిట్ నిర్మాణాన్ని కేవలం 42 నెలల్లోనే పూర్తిచేసి, 800 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చింది. 2015 జనవరి 1న ఈ ప్లాంటు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2018 జూన్ 30 నాటికి ప్లాంటు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన ప్రాజెక్టు ఇది.
వచ్చే మూడేళ్లలో అదనంగా మరో 10 వేల మెగావాట్లు
తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా పడుగులు వడవడిగా పడుతున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కేంద్రప్రభుత్వంపై వత్తిడి తెచ్చి రామగుండం ఎన్.టి.పి.సి.లో 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి ఆమోదం తీసుకుంది. ఇప్పటికే మొదటి దశలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. 4,000 మెగావాట్ల యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ పనులు పూర్తవుతాయి. సింగరేణి నుంచి మరో 800, సిజిఎస్ ద్వారా మరో 809, సోలార్ ద్వారా ఇంకో 1,584, హైడల్ ద్వారా ఇంకో 90 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. వీటన్నిటి ద్వారా వచ్చే మూడేళ్లలో పదివేలకు పైగా మెగావాట్లు అదనంగా వచ్చి చేరుతుంది. అప్పుడు తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారి ఇతరులకు కరెంటు అందించే స్థితి వస్తుంది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అవసరం ఉన్న వర్గాలకు మరిన్ని రాయితీలు ఇచ్చుకునే వెసులుబాటు కలుగుతుంది.
27. 77 వేల కోట్ల వ్యవయంతో పంపిణి, సరఫరా వ్యవస్థల పటిష్టం
విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగు పర్చడంలో కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 99.90 శాతం ట్రాన్స్ మిషన్ అవేలబులిటీతో దేశ సగటును మించింది. దీనికోసం రూ.27,770 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టింది.
విద్యుత్తు రంగంలో నాలుగేళ్లలో సాధించిన పురోగతి
2 జూన్, 2014 నాటికి | 2020 మే నాటికి | |
విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం (మెగావాట్లలో) | 7,778 | 15,980 |
గరిష్ట డిమాండ్ | 5,661 | 13,168 |
గరిష్ట వినియోగం (మిలియన్ యూనిట్లలో) | 128 మి.యూనిట్లు | 255 మిలియన్ యూనిట్లలో |
400 కె.వి. సబ్ స్టేషన్లు | 6 | 21 |
220 కె.వి. సబ్ స్టేషన్లు | 51 | 91 |
132 కె.వి. సబ్ స్టేషన్లు | 176 | 238 |
మొత్తం ఇ.హెచ్.టి. సబ్ స్టేషన్లు | 233 | 350 |
ఇ.హెచ్.టి.లైన్ల పొడవు (CKM) | 16,379 | 25,605 |
ట్రాన్స్ఫర్మేషన్ సామర్ధ్యం (MVA లో) | 14,059 | 35,336 |
33 కె.వి.సబ్ స్టేషన్స్ | 2,178 | 3,029 |
మొత్తం డిస్కం లైన్ల పొడవు (కి.మీ.) | 4,40,229 | 5,67,622 |
డి.టి.ఆర్. ల వైఫల్యం (శాతం) | 26.71 % | 6.61 % |
వ్యవసాయ కనెక్షన్లు | 19,02,754 | 24,48,000 |
మొత్త కనెక్షన్లు | 1,11,19,990 | 1,55,00,000 |
దేశ సగటును మించిన తలసరి విద్యుత్ వినియోగం
విశ్వవ్యాప్తంగా ప్రగతి సూచికలుగా (indicators) గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశ సగటును మించింది. 2018-19 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 యూనిట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,896 యూనిట్లు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుంటే, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది.
తలసరి విద్యుత్ వినియోగంలో 11.34 శాతం వృద్ధి
ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 10 శాతం వృద్ధిరేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 2017-18 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,727 యూనిట్లుంటే, 2018-19 నాటికి 1,896కి చేరింది. . ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.7 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2017-18లో దేశ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,149 యూనిట్లుంటే, 2019-19లో 1,181 యూనిట్లు నమోదైంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లనే తెలంగాణ ఈ ఘనతను సాధించగలిగింది. ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. పరిశ్రమలు 3 షిఫ్టులు పనిచేస్తున్నాయి. వీటన్నింటి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం దేశంలో మరే రాష్ట్రంలో పెరగని విధంగా పెరిగింది.
గరిష్ట డిమాండ్ లో 11.94 శాతం వృద్ధి
విద్యుత్తు గరిష్ట డిమాండ్ వృద్ధి రేటులోనూ తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధి శాతం నమోదు చేసింది. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, 2017-18 సంవత్సరంలో 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే, 2018-19లో తెలంగాణలో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, 2019-20 సంవత్సరంలో 11,703 మెగావాట్లకు చేరింది. 28 ఫిబ్రవరి, 2020న ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కూడా లేనంతగా తెలంగాణలో 13,168 మెగావాట్ల అత్యదిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44 అయితే, తెలంగాణ రాష్ట్ర వృద్ధిరేటు 8.18 శాతంగా నమోదైంది. 23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 23మార్చి, 2014న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో 5,661 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన డిమాండ్ 132.6 శాతం అధికం.
బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యానికి అనుగుణంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రగతికి బాసటగా విద్యుత్ రంగం నిలుస్తున్నది. పారిశ్రామిక ప్రగతికి కొత్తగా తీసుకొచ్చిన టిఎస్ – ఐపాస్ చట్టం విజయవంతమై, పరిశ్రమలు తెలంగాణకు తరలిరావడంలో పవర్ హాలిడేలు ఎత్తేసి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్యమైన కారణం. రికార్డు స్థాయిలో పంటలు పండడంలో, భూగర్భంలోని జలాలను బయటకు రప్పించిన 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ పాత్ర ఉంది. పాలీ హౌజ్ కల్టివేషన్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్, మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున విస్తరించడం వెనుక విద్యుత్ విజయం దాగి ఉంది. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పన వెనుక.. దాని నిర్వహణకు అవసరమైన 11వేల మెగావాట్ల విద్యుత్ ను జెన్ కో అందించగలుతుందనే విశ్వాసం ఉంది. ఇంటింటికీ నల్లా నీళ్లు అందించే బృహత్తర పథకం మిషన్ భగీరథ విజయవంతం కావడం.. విద్యుత్ శాఖ సమర్థత మీదే ఆధారపడి ఉంది. హైదరాబాద్ లో మెట్రో రైలు తిరగాలన్నా, ఐటి పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేయాలన్నా, వ్యాపార-వాణిజ్య సంస్థల్లో కార్యకలాపాలు నిరాటంకంగా జరగాలన్నా, దానికి నిరంతరాయ విద్యుత్ సరఫరాయే మూలాధారం. విద్యుత్ సరఫరా ఒక్కటి సరిగ్గా లేకుంటే దాని ప్రభావం ఇన్ని రంగాలపై ఖచ్చితంగా పడేది. అందుకే ఇవాళ తెలంగాణలో విద్యుత్ రంగం సాధించింది సాధారణ విజయం కాదు. తెలంగాణ దశను, దిశను నిర్దేశించే స్థాయిలో గొప్ప పాత్రను ఈ విజయం సాధించి పెట్టింది. తెలంగాణ ప్రగతితో విద్యుత్ తీగలు పెనవేసుకున్న సందర్భమిది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్దీకరించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలైన ట్రాన్స్ కో,జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో ఔట్‌సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న 23,667 మంది తాత్కాలిక ఉద్యోగుల (ఆర్టిజన్ల) సర్వీసును ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
ఆరోగ్య రంగం
ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సౌకర్యాల కల్పన
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ-వైద్య సౌకర్యాల కల్పనకు ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు మెరుగైన ఫలితాలను సాధించాయి. ఈ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు మాతా, శిశు మరణాలను తగ్గింపులో గణనీయమైన ప్రగతి సాధ్యమైంది. కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధనకై అహరహం శ్రమిస్తున్నది.
అత్యవసర ఆరోగ్య సౌకర్యాలు
ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) : క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం పది పడకలు కలిగిన 20 ఐసియులను ఏర్పాటు చేసింది. 25 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసియు సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు భద్రతనిస్తున్నది.
ఎస్ఎన్ సియు (సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్) : నవజాత శిశులకు అత్యవసర సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. పూర్వం 18 మాత్రమే ఉన్న ఎస్ఎన్ సియుల సంఖ్యను 42 కు పెంచి పసి పిల్లల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నది.
ఎంఐసియు (మేటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) : గర్భిణీలు, బాలింతలకు కు అత్యవసర వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా ‘మేటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల(ఎంఐసియు)ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యూనిట్ల ద్వారా ఎంతో మంది తల్లులు ప్రత్యేక ఆరోగ్య సేవలను పొందారు.
కంటివెలుగు
రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకుండా అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా ‘కంటి వెలుగు’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా నేత్ర శిబిరాలను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో సమస్యలున్న 41 లక్షల మందికి కంటి అద్దాలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందించింది.
జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ హబ్స్ ఏర్పాటు
వ్యాధుల నిర్ధారణకు పైసలు పెట్టుకోలేని నిరుపేదలకు ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ప్రతీ జిల్లా కేంద్ర దవాఖానలో డయాగ్నస్టిక్ హబ్ లను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో మోడల్ హబ్‌ను ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ హబ్‌లో రక్త, మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ పనితీరు పరీక్షలు, కొలెస్ట్రాల్, షుగర్ వంటివాటితోపాటు మొత్తం 58 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. వీటి ఏర్పాటుతో ప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నది.
అత్యవసర సేవల వాహనాలు
102 వాహనాలు :
గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులకు సేవలందించేందకు ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద 102 వాహన సర్వీసులను అందిస్తున్నది. గర్భినులను ఇంటి నుండి ప్రభుత్వ దవాఖానకు, ప్రసవానంతరం దవాఖాన నుండి ఇంటికి సురక్షితంగా తరలించడానికి 102 వాహనాలు అందిస్తున్న సేవలు అపూర్వమైనవి. 102 వాహన సేవలకు ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో రూ.15 కోట్లు కేటాయించింది.
104 వాహనాలు :
గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలందించేందుకుగాను ప్రభుత్వం 104 వైద్యసేవలను కొనసాగిస్తున్నది. ప్రతి నెలా నిర్దేశించిన గ్రామాల్లో ఇవి సేవలందిస్తూ వస్తున్నాయి. చిన్నచిన్న రుగ్మతలతో బాధపడే వృద్ధులు, మహిళలకు వైద్యసేవలతో పాటు నెలకు సరిపడా మందులను వీటి ద్వారా అందిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక ప్రగతి నిధి చట్టం (సబ్ ప్లాన్)
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి, ఖర్చు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం –2017 బిల్లును తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించి, ఖచ్చితంగా ఖర్చు చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించి, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నది.
గ్రామ పంచాయతీలుగా మారిన గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు
తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ ప్రభుత్వం 28 మార్చి, 2018న అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 1,177 తండాలు, గూడాలను కొత్తగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 1,281 ఆవాస ప్రాంతాలు షెడ్యూల్డు ఏరియాలో ఉండడంతో అవి ఎస్టీలకే రిజర్వు అయ్యాయి. ఎస్టీల జనాభాను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో 688 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేసింది. దీంతో 3,146 మంది ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం లభించింది. ఇంతపెద్ద మెత్తంలో ఎస్టీలకు ప్రత్యేక పంచాయతీలను ఏర్పాటు చేసి, గ్రామపరిపాలనా బాధ్యతలను ఎస్టీలకే అప్పగించే అభ్యుదయ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలో నిలిచిపోతుంది.
ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా గృహోపయోగ విద్యుత్ అందివ్వాలని 24 ఆగస్టు, 2018న ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు 50 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. టీవీల వినియోగంతోపాటు ఇతర విద్యుత్ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్ వాడకం ఎక్కువ కావడంతో 101 యూనిట్లకు పెంచారు.
సంక్షేమం
ఆసరా పెన్షన్లు
నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు అండగా నిలవడం సామాజిక బాధత్యగా భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. వీరందరికీ ప్రతినెలా ఆసరా పెన్షన్లు అందిస్తున్నది.
రాష్ట్రంలోని 12,32,556 మంది వృద్ధులు, 14,35,599 మంది వితంతువులు, 62,267 మంది గీత కార్మికులు, 36,979 మంది నేత కార్మికులు, 32,812 మంది ఎయిడ్స్ పేషంట్లు, 4,07,436 మంది బీడీ కార్మికులు, 1,34,047 మంది ఒంటరి మహిళలు, 14,897 మంది బోదకాలు బాధితులకు రూ.2016 చొప్పున, 4,93,274 మంది వికలాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అందజేస్తున్నది.
పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం తీర్చేందుకు ‘కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్’
రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీవర్గాలకు కళ్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టి, రూ.1,00,016 చొప్పున అందజేస్తున్నది. 6,15,573 మందికి ఈ పథకాలను అందజేశారు.
ఆహార భద్రత కోసం‘ప్రతీ వ్యక్తికీ ఆరు కిలోల బియ్యం’
రాష్ట్రంలో ఏ పేద కుటుంబం ఆకలికి అలమటించవద్దని, కనీస ఆహార భద్రత ఉండాలని ప్రభుత్వం రేషన్ బియ్యం కోటాను పెంచింది. ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 17,010 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డు కలిగిన మొత్తం 87,56,456 కుటుంబాల్లోని 2,80,54,576 మందికి ఆరుకిలోల బియ్యం అందిస్తున్నది.
కరోనా వైరస్ – లాక్ డౌన్ సమయంలో ఉచితంగా రేషన్ బియ్యం– రూ.1500 నగదు పంపిణీ
కరోనా లాక్ డౌన్ సందర్భంగా పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికీ నెలకు రూ.12 కిలోల చొప్పున ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఉచితంగా బియ్యం సరఫరా చేశారు. ప్రతి కుటుంబం నిత్యావసరాలు కొనుక్కోవడానికి ఏప్రిల్, మే నెలలకు రూ.1500 చొప్పున నగదును వారి అకౌంట్లలో జమ చేశారు.
తెలంగాణ స్ఫూర్తితో కేంద్రం ‘‘ఒకే దేశం – ఒకే కార్డు’’ పథకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ పోర్టబిలిటీ (తెల్ల కార్డు ఉన్న లబ్ధిదారులు ఎక్కడినుంచైనా రేషన్ తీసుకునే విధానం) స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ‘‘ఒకే దేశం – ఒకే కార్డు’’ పథకం ప్రవేశపెట్టింది. దీంతో లబ్ధిదారులు భౌగోళిక పరిధితో సంబంధం లేకుండా దేశంలో ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు తీసుకునే వీలు కలుగుతుంది.
విద్యార్థులకు మంచి భోజనం పెట్టడానికి ‘సన్నబియ్యం’
గురుకులాల్లో చదువుకునే విద్యార్థులందరికీ సన్నబియ్యంతో వండిన అన్నమే పెట్టాలని సీఎం కేసార్ నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో 3,854 సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు, 28,623 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతినెలా 12 వేల మెట్రిక్‌టన్నుల సన్నబియ్యాన్ని 16 సంక్షేమ విభాగాల ద్వారా సరఫరా చేస్తున్నది.
గుడుంబా నిర్మూలన – పునరావాస కార్యక్రమాలు
గుడుంబా నిర్మూలనకు ప్రభుత్వం బహుముఖ వ్యూహం అమలు చేసింది. ఒకవైపు గ్రామ సభల్లో ప్రతిజ్ఞలు చేయించింది. మరోవైపు గుడుంబా మాఫియాపై ఉక్కుపాదం మోపింది. పునరావాసంలో భాగంగా గుడుంబాపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి, వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించింది. గుడుంబా తయారీ పై ఆధారపడిన 6,323 మందికి ఒక్కొక్కరికి రూ.2లక్షలతో ఆటో, బట్టలదుకాణం, కిరాణా షాపు,పాల కేంద్రంమొదలైనవి ఏర్పాటు చేయించి పునరావాసం కల్పించింది.
అర్చకులకు ప్రభుత్వ జీతం: ఏండోమెంట్ పరిథి లోని అర్చకులు, పూజారులకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.జర్నలిస్టుల సంక్షేమం: జర్నలిస్టుల సంక్షేమానికి రూ.120 కోట్లను కేటాయించింది.
చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడంతో పాటు ఐదేండ్ల వరకు వారి కుటుంబానికి రూ.3 వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నది. గాయపడి నిస్సహాయ స్థితిలో వున్న వారికి రూ.50 వేలు సాయం చేస్తున్నది. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు ఇచ్చింది. ఉచిత బస్సుపాస్ లు ఇచ్చింది
న్యాయవాదుల సంక్షేమం: న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసింది. న్యాయవాదులకు హెల్త్ కార్డులను అందజేయాలని నిర్ణయించింది. న్యాయవాది జీవిత భాగస్వామికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా, ప్రమాదంలో మరణించిన న్యాయవాది కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయంచెల్లించేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో అడ్వకేట్స్ ట్రస్ట్ ఒప్పందంచేసుకుంది.
జర్నలిస్టులు, హోం గార్డులు, డ్రైవర్లకు ప్రమాద బీమా: డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి,5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది.
మహిళా-శిశు సంక్షేమం
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది.
‘కేసీఆర్ కిట్’: ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు గర్భిణీకి రూ.12వేల నగదు, రూ.3వేల కిట్ అందిస్తున్నారు. ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనం.
అమ్మఒడి వాహనాలు: గర్భిణులను దవాఖానాకు తీసుకురావడానికి, ప్రసవం తర్వాత బిడ్డతో సహా ఇంటికి చేర్చడానికి ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కోసం అమ్మఒడి వాహనాలను(102 వాహనం) నడుపుతున్నది.
టూవీలర్ 108 వాహనాలు (బైక్ అంబులెన్స్ లు): ప్రమాద సందర్భాల్లో సత్వర సాయమందించేందుకు 108 బైక్ అంబులెన్సులు ప్రవేశ పెట్టింది.
రెక్కలు వాహనాల పథకం ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి తల్లీబిడ్డలకు సేవలందించేందుకు రాయితీతో ద్విచక్ర వాహనాలను అందించింది. గర్భిణుల పేర్ల నమోదు, టీకాలు, ఇతర వైద్యసేవలకు 6,500 వాహనాలను సమకూరుస్తున్నారు.
ఆరోగ్య లక్ష్మి – పోషకాహారం: అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రతి రోజూ ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని అందించే ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. గుడ్లతో పాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతి నెలా మొదటి తేదీన అందిస్తున్నారు.
మహిళా ఆర్గనైజర్లు: మాతాశిశు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కోసం ప్రతి రెండు జిల్లాలకు ఒకరి చొప్పున, హైదరాబాద్ మొత్తానికి ఒకరు చొప్పున ప్రభుత్వం మహిళా ఆర్గనైజర్లను నియమించింది.
విద్యార్ధినులకు హెల్త్, హైజెనిక్ కిట్స్: విద్యార్థినులకోసంప్రభుత్వం బాలికా ఆరోగ్య రక్ష పథకాన్నిప్రవేశపెట్టింది. ప్రభుత్వపాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలోచదువుకుంటున్న 8 లక్షలమంది విద్యార్థినులకు హెల్త్, హైజెనిక్ కిట్స్ అందిస్తున్నది.
స్త్రీ నిధి – పది లక్షల వరకు వడ్డీ లేని రుణం: తెలంగాణ రాష్ట్రంలో 4.60 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లో 83.58 లక్షల కుటుంబాలకు ఉపయోగపడేలా వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
దేశంలోనే తొలిసారిగా సంచార పశువైద్యశాలలు: ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో 100 సంచార పశువైద్యశాలలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 1962 నంబర్‌కు ఫోన్ చేసిన అరగంటలో సంచార పశు వైద్యశాల వస్తుంది.
మైక్రో ఇరిగేషన్
తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల రైతులకు 100% రాయితీ, వెనుకబడిన తరగతులకు మరియు సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ, ఇతర రైతులకు 80% రాయితీలు ఇస్తున్నది.
పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ సబ్సిడీ: 75శాతం సబ్సిడీతో పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ అందిస్తున్నది.
గోదాముల నిర్మాణం – కోల్డ్ స్టోరేజ్ లింకేజ్: తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 18.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన 364 గోడౌన్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 22.47 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 540 గోదాములు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్ లింకేజి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే నిర్మించిన గోదాములతో పాటు కొత్తగా మరో 40లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.స్పెషలైజ్డ్ మార్కెట్లు: నల్లగొండ జిల్లా గంధంవారిగూడెం దగ్గర 1.50 కోట్లతో బత్తాయి మార్కెట్ ను, నకిరేకల్ లో 3.07 కోట్లతో నిమ్మకాయల మార్కెట్ ను, పి.ఏ.పల్లి మండలం కొనమేకలవారిగూడెం దగ్గర 60.30 లక్షలతో దొండ మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నది. మామిడి మార్కెట్ ను కొల్లపూర్లో నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు.
మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు
దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేశారు. రిజర్వేషన్ల వల్ల 25 మంది ఎస్సీలు, 10 మందిఎస్టీలు, 50 మందిబీసీలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లు కాగలిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వల్ల, 60 మంది మహిళా రైతులు చైర్మన్లు అయ్యారు.
పరమపద వాహనాలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వారి మృత దేహాలను ఉచితంగా ఇంటికి పంపడానికి ప్రభుత్వం పరమపద వాహనాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 50 వాహనాలు నడుస్తున్నాయి. ఇంకా వీటి సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు: నగరంలోని వివిధ డివిజన్లలో ప్రభుత్వం బస్తీ దవాఖానాల(అర్బన్ హెల్త్ క్లీనిక్)ను ప్రారంభించింది. పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రస్తుతం 168 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త జోనల్ వ్యవస్థ: స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా తెలంగాణలో నూతన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
తక్కువ వేతనాలు పొందే వారి జీతాల పెంపు: హోంగార్డులు, అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఐకెపి ఉద్యోగులు, సెర్ప్ ఉద్యోగులు, నరేగా ఉద్యోగులు, 108 సిబ్బంది, 104 సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, విఆర్ఏలు, విఏఓలు, కాంట్రాక్టు లెక్చరర్లు, సిఆర్టీలు, అర్చకులు తదితర ఉద్యోగులందరి వేతనాలను ప్రభుత్వం పెంచింది.
అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఉద్యోగం: ప్రతీ అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. హైదరాబాద్ లో అమరవీరు స్మృతి చిహ్నం నిర్మాణంలో ఉంది. ఉద్యమకారులపై నమోదయిన కేసులను ప్రభుత్వం ఎత్తేసింది.
ఆదాయ పరిమితి పెంపు : దారిద్ర్య రేఖ దిగువన (బిపిఎల్) ఉండే కుటుంబాలను గుర్తించేందుకు అమలులో ఉన్న ఆదాయ పరిమితిని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేల నుంచి లక్షన్నరకు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రెండు లక్షలకు పెంచింది. దీంతో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత లభించింది.
ప్రకృతి వైపరీత్యాలలో మృతి చెందిన వారి కుటుంబాలకు సహాయం: వరదలు వడగండ్లు ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయిన రి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు, పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 6 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తోంది
మైనారిటీ సంక్షేమం
- మైనారిటీ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీషు మీడియం విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతున్నది.
- అధికారికంగా రంజాన్, క్రిస్మస్: రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రతీ సంవత్సరం పేద మైనారిటీ కుటుంబాలకు ప్రభుత్వం కొత్త బట్టలు అందిస్తున్నది. అధికారికంగా ఇఫ్తార్, క్రిస్మస్ విందులు ఏర్పాటు చేస్తున్నది.
- టీఎస్ ప్రైమ్: మైనారిటీ వర్గాల పారిశ్రామిక వేత్తలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే రాయితీలు, ప్రోత్సహకాలు అందించడానికి టి ఎస్ ప్రైమ్ పథకం అమలు చేస్తున్నది.
- అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణం: ముస్లిం అనాథలకు ఆశ్రయమిస్తున్న అనీస్ ఉల్ గుర్బాకు నాంపల్లిలో 4300 చదరపు గజాల స్థలం కే మైనారిటీ యువతకు టాయించి రూ.20 కోట్ల తో భవనం నిర్మిస్తున్నది.
- మైనారిటీ యువతకు ప్రత్యేక శిక్షణ: మైనారిటీ యువత వివిధ రంగాల్లో రాణించడానికి నాక్, ఇసిఐఎల్, సిఐపిఇటి, సెట్విన్ సంస్థల ద్వారా నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నది
- చర్చిల నిర్మాణ అనుమతులు సులభతరం: స్థానిక సంస్థల అనుమతితో చర్చ్ ల నిర్మాణం చేసుకునె వీలు కల్పించింది.
- మక్కామసీదు అభివృద్ధి : నగరం లోని మక్కామసీదుకు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8.48 కోట్లు మంజూరు చేసింది.
- షాదీఖానాల నిర్మాణం: ముస్లింల సామాజిక వికాసం కోసం రాష్ట్రవ్యాప్తంగా పూర్తి ప్రభుత్వ ఖర్చుతో షాదీఖానా మరియు ఉర్దూ ఘర్ ల నిర్మాణం జరుగుతున్నది.
- సిక్ గురుద్వారా నిర్మాణం: హైదరాబాద్ నగరంలో గురుద్వారా నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
- ఇమామ్, మౌజమ్ లకు భృతి: దేశంలో మరెక్కడాలేని విధంగా ప్రభుత్వం 5 వేల మసీదుల్లో ప్రార్థనలు చేసే 8,428 మంది ఇమామ్, మౌజమ్ లకు నెలకు 5000 రూపాయల భృతి కల్పించింది
- ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలోని కోకాపేటలో 10 ఎకరాల స్థలంలో రూ.40 కోట్ల వ్యయంతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్‌హాల్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ఉర్దూ భాషాభివృద్ధి: ప్రభుత్వం ఉర్దూను రెండవ అధికార భాషగా ప్రకటించింది, విద్యార్థులు ప్రథమ భాష గా చదువుకునే అవకాశం కల్పించింది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో, కలెక్టరేట్లలో 66 మంది ఉర్దూ అధికారులను నియమించింది.