ఆగస్టు 7న ఎస్ఐ, ఆగస్టు 21న కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. కొంతమందికి నెగెటివ్ మార్కులపై అనుభవం ఉన్నా చాలా మందికి అవగాహన లేదు. దీంతో రానున్న పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రశ్నలు ఏవిధంగా అడుగుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే సెలెక్షన్ విధానంలో ఉండాలనేది నెగెటివ్ మార్కుల ముఖ్య ఉద్దేశం. గతంలో జరిగిన ఎస్ఐ పరీక్షలో అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం పెట్టి, బార్డర్లో క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించిన వారు చాలా మందే ఉన్నారు. నెగెటివ్ మార్కుల్లో ముఖ్యమైన అంశం ఎలిమినేషన్ పద్ధతి. నాలుగు సమాధానాల్లో ఒక దాని తర్వాత ఒకటి తొలగించుకుంటూ పోతూ చివరగా సమాధానం కరెక్టుగా రాబట్టడమే ఈ ప్రాసెస్ ముఖ్య ఉద్దేశం.
ఎలిమినేషన్ మెథడ్‌లో రీజనింగ్, అర్థమెటిక్ సబ్జెక్టుల నుంచి ఆన్సర్స్ గుర్తించడం చాలా కష్టం. ఇది కేవలం జనరల్ స్టడీస్‌లోని సబ్జెక్టులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్రామాణిక పుస్తకాలు కాకుండా స్థానిక మెటీరియల్ చదివిన స్టూడెంట్స్ నెగెటివ్ మార్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విశ్లేషణాత్మకంగా ఆలోచించడం పరీక్షలోనే కాదు, ఉద్యోగంలో చాలా అవసరం అని నెగెటివ్ మార్కింగ్ విధానం పోలీస్ పరీక్షలో ప్రవేశపెట్టారు.
- ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిపేరయ్యే అభ్యర్థులు క్వాలిఫై అయ్యే వ్యూహం సాధారణంగా రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సబ్జెక్ట్‌పై ఎక్కువ ఫోకస్ చేయడం. రెండోది జనరల్ స్టడీస్ సబ్జెక్టులను చదువుకొని విజయం సాధించడం. నెగెటివ్ మార్కింగ్ ఉండడం వలన రీజనింగ్ అర్థమెటిక్ నమ్ముకోవడం కంటే జనరల్ స్టడీస్ లోని అంశాలపై ఫోకస్ చేయడం ఉత్తమం.
- ప్రిలిమ్స్‌లో 20% నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎస్ఐ మెయిన్స్‌లోని పేపర్1, పేపర్2, పార్ట్ A ఆబ్జెక్టివ్ పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులు ఉన్నాయి. మెయిన్స్ ఎస్ఐ క్వాలిఫై పేపర్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్లో 25 మార్కులకు ఉంటుంది. ఇందులో మాత్రమే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
- 20% నెగెటివ్ మార్కులు ఉన్నాయంటే 100 మార్కులకు ఆన్సర్ చేస్తే, వాటిలో 20 ప్రశ్నలు తప్పయితే ఫైనల్‌గా వచ్చేది 76 మార్కులు మాత్రమే. 20 ప్రశ్నలు తప్పుగా సమాధానం పెట్టడంతో వచ్చిన 80 మార్కుల నుంచి 4 మార్కులు తొలగిస్తారు. తప్పనిసరిగా ఆన్సర్ తెలిస్తేనే ప్రశ్న అటెంప్ట్ చేయాలి. లేకుంటే వచ్చిన మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.
గెస్ చేస్తే మార్క్స్ లాస్
నెగెటివ్ మార్కుల ప్రభావం వంద శాతం అర్థమెటిక్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ప్రశ్నకు సమాధానం తెలిస్తేనే ఆన్సర్ చేయాలి. ఇందులో గెస్ చేసి ఆన్సర్ చేస్తే మార్కులు తగ్గే అవకాశం ఉంది.
క్షేత్రగణితం: ఈ టాపిక్ నుంచి ఇచ్చే క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ప్రశ్న వస్తే అటెంప్ట్ చేయాలి. నాన్ మ్యాథ్స్ బ్యాగ్రౌండ్ ఉన్న అభ్యర్థులు ఫార్ములా ఆధారంగా వచ్చే ప్రశ్నలు ఆన్సర్ చేస్తే టైమ్ సేవ్ అయ్యే చాన్స్ ఉంటుంది.
నంబర్ సిస్టమ్: ఈ అంశం నుంచి వచ్చే ప్రశ్నలు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రశ్న చూడగానే దానికి తగిన ఆలోచన వస్తే ఆన్సర్ చేయడం ఉత్తమం. ఎక్కువగా ఆలోచిస్తే సమయం వృథా అవుతుంది.
క్లాక్ (గడియారాలు): ఇందులో కొంతవరకు ఎలిమినేషన్ పద్ధతి అనుసరించవచ్చు. క్యాలెండర్ టాపిక్‌లో మాత్రం కచ్చితంగా ఆన్సర్ తెలియాల్సిందే.
కాలం-పని, పని-వేతనం, కాలం-దూరం: ఈ టాపిక్స్ కాన్సెప్ట్ ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉంటుంది. కాబట్టి విశ్లేషణాత్మకంగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ సరైన ఆన్సర్ గుర్తించవచ్చు.
నిష్పత్తి-అనుపాతం, సరాసరి అండ్ పర్సంటేజ్: ఈ టాపిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలకు కొంచెం సమయం పట్టినా ఆన్సర్ మాత్రం చేయొచ్చు. మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఇందులో వచ్చే క్వశ్చన్స్కు ఆన్సర్ గుర్తించడం సులభంగా ఉంటుంది.
సాధారణ వడ్డీ ప్రశ్నలు కొంత వరకు లాజిక్ మీద ఆధారపడి చేయవచ్చు. కాని చక్రవడ్డీకి సంబంధించిన ప్రశ్నలు పూర్తిగా, లోతుగా ప్రాక్టీస్ చేస్తేనే అటెంప్ట్ చేయాలి. లేకుంటే సమయం వృథా అవుతుంది.
భాగస్వామ్యం నుంచి వచ్చే ప్రశ్నలు షార్ట్ కట్ తెలియకుంటే ఆన్సర్ చేయడానికి 2 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుంది. లాభ–నష్టాలు టాపిక్ నుంచి పూర్తిగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలు వస్తాయి. సూత్రాలు గుర్తుంటేనే ఆన్సర్ చేయడం ఉత్తమం.
ఎలిమినేషన్ మెథడ్
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో ఉండే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ గ్రూప్స్ పరీక్షతో పోల్చుకుంటే సులువుగా ఉంటుంది. పోలీస్ పరీక్షలో జనరల్ స్టడీస్ నుంచి లిమిటెడ్ సిలబస్‌లో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎలిమినేషన్ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ మీద కనీసం10 మార్కులు తక్కువ కాకుండా ప్రశ్నలు అడుగుతారు.
సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్
ఏకరూప ప్రశ్నలు(సింగిల్ స్టేట్మెంట్ ప్రశ్నలు) లోకల్ మెటీరియల్‌పై ఆధారపడి చదివిన వారికి కొంతమేరకు సులువుగా ఉంటుంది. కాని ప్రామాణికమైన పుస్తకాలు చదివితే చాలా సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. మొత్తం 100 ప్రశ్నల్లో కనీసం ఏకరూప ప్రశ్నలు 20 నుంచి 25 వరకు వచ్చే చాన్స్ ఉంటుంది. నెగెటివ్ మార్కుల విధానంలో జనరల్ స్టడీస్ అంశానికి సంబంధించి ఏకరూప ప్రశ్నలకు రెండో ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఈ ప్రశ్నలతో సమయం ఆదా చేసుకోవడంతో పాటు, మంచి మార్కులు సాధించవచ్చు. ఎలిమినేషన్ పద్ధతి ఇలాంటి క్వశ్చన్స్కు ఎక్కువగా కలిసి వస్తుంది.
అర్థం చేసుకుంటే ఈజీ
జతపరిచే ప్రశ్నలు సరిగ్గా అర్థం చేసుకుంటే సమాధానం గుర్తించడం ఈజీగా ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నల్లో 15 నుంచి 20 ప్రశ్నలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు ఆన్సర్ గుర్తిస్తే కాన్పిడెన్స్‌తో పాటు క్వాలిఫై అయ్యే మార్కులు ఈజీగా పొందవచ్చు. కరెంట్ అఫైర్స్ విషయంలో న్యూస్ పేపర్లే కాకుండా, మ్యాగజైన్స్ చదవాలి.
రీజనింగ్ ప్రాక్టీస్
- మొత్తం 50 ప్రశ్నల్లో దాదాపుగా 20 ప్రశ్నలను సులువుగా రీజనింగ్‌లో ఆన్సర్ చేయవచ్చు. ఈ సబ్జెక్టులో ఎలిమినేషన్ మెథడ్ బాగా ఉపయోగపడుతుంది. ఒకే సబ్ టాపిక్ కు సంబంధించిన ప్రశ్నలు దాదాపు 5 వరకు ఉంటాయి. ఆ సబ్టాపిక్ మీద సంపూర్ణంగా అవగాహన ఉంటే అత్యధిక మార్కులు సాధించవచ్చు.
- నాన్‌వెర్బల్ ప్రశ్నలకు కొంత సమయం కేటాయిస్తే ప్రాక్టీస్ లేకుండా సమాధానాలు గుర్తించవచ్చు.
- వెర్బల్ రీజనింగ్ నుంచి వచ్చే ప్రశ్నలకు ఆన్సర్ చేయాలంటే ప్రాక్టీస్ తప్పనిసరి. ఇంతకుముందే ఈ టాపిక్ ప్రిపేరై ఉంటే ప్రశ్నలను ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు.
- జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్ ప్రశ్నలు పూర్తిగా కమాండ్ ఉంటేనే అటెంప్ట్ చేయాలి తప్ప, లేకపోతే సమయంతో పాటు మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.
- విజువల్ మెమొరీ ప్రశ్నలు కొంతవరకు సులువుగా సమాధానం గుర్తించవచ్చు, కానీ ఆ ప్రశ్న ఏ కోణంలో అడుగుతున్నారో గమనిస్తే ఆన్సర్ చేయవచ్చు.
- స్పాటియల్ విజువలైజేషన్ క్వశ్చన్స్ గమనిస్తే తక్కువ సమయంలోనే మంచి మార్కులు సాధించడంతో పాటు, సమయం కలిసి వచ్చి, పరీక్ష హాల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
- అనాలజీ టాఫిక్కి ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా, మంచి స్కోర్ రాబట్టవచ్చు. కానీ ఆ అనాలజీని సరైన క్రమంలో, సందర్భానుసారం ఆలోచించాలి. లేకుంటే సులువుగా వచ్చే మార్కులు కోల్పోయి, క్వాలిఫై అయ్యే మార్కులు కోల్పోవాల్సి వస్తుంది.
- సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ప్రశ్నలకు సమాధానాలు రాయడం సులువు, కాని సరైన క్రమంలో గుర్తించి, తక్కువ సమయంలోనే సమాధానం వచ్చేట్లు ఉంటేనే అటెంప్ట్ చేయాలి.
- ప్రాబ్లమ్ అండ్ సాల్వింగ్ అనాలసిస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కు సమాధానం గుర్తించాలంటే గతంలో ఇలాంటి మోడల్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఇబ్బంది పడడంతో పాటు ఎగ్జామ్ హాల్లో కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం ఉంది.