తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్స్ కు వర్షం అడ్డంకిగా మారుతోంది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో మహిళలకు సోమవారం నిర్వహించాల్సి ఉన్న ఈవెంట్స్ ను అధికారులు వాయిదా వేశారు. వర్షం కారణంగా ఇక్కడ జరగాల్సిన ఈవెంట్స్ ను వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. వర్షం రావడంతో గ్రౌండ్ లో తడి కారణంగా ఈవెంట్స్ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడవంతో వాయిదా వేసినట్లు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ అడిషినల్ డీసీపీ షమీర్ తెలిపారు. దీంతో సోమవారం జరగాల్సిన ఈవెంట్స్ ను జనవరి 4వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. ఈ రోజు నిర్వహించాల్సి ఉన్న ఈవెంట్స్ కు 1200 మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు చెప్పారు. వారిలో కొందరి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసినట్లు డీసీపీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో సిద్దిపేటలో జరగాల్సిన ఈవెంట్స్ ను ఇప్పటివరకు ప్రారంభించలేదు. ఇందుకు సంబంధించిన తేదీలను అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జనవరి 03 వరకు 10 రోజుల పాటు ఎస్ఐ/కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలను సిద్దిపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. ఎక్కడ ఎలాంటి అక్రమాలు, విమర్శలకు తావులేకుండా శారీరక దారుఢ్య పరీక్షలు జరిగే గ్రౌండ్ మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారులందరి సమక్షంలో త్వరలో ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 9,983 మందికి శరీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.