తెలంగాణలోని వివిధ హాస్పిటళ్లలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 17వ తేదీన సీబీటీ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి.- ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ‘నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతో పాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
భర్తీ చేయనున్న పోస్టులు
ప్రజా ఆరోగ్య విభాగం, వైద్య విద్యా విభాగం 1,576
తెలంగాణ వైద్య విధాన పరిషత్ 332
ఆయుష్ 61
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) 01
ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ 80
ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నియామకాల్లో వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే పనిచేసిన లేదా పని చేస్తున్న వారికి 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ అనుభవమున్న వారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. పూర్తి వివరాలు https://mhsrb. telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తుదారులకు కనీసం 18 ఏండ్లు, గరిష్టంగా 46 ఏండ్ల వయో పరిమితి నిబంధన విధించారు. 2024, జులై 1 నాటికి ఉన్న వయస్సును పరిగణిస్తారు. రిజర్వేషన్ కేటగిరీలకు గతంలో ఉన్న వయో పరిమితి కూడా సడలింపులు వర్తిస్తాయి. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు వచ్చే నెల 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఛాన్స్ కూడా ఉంటుది. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.