రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో.. చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కలిపిస్తోంది. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్'(NMMS) 2026-27 ప్రకటనను విడుదల చేసింది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలో అర్హత సాధిస్తే.. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తి వరకు ప్రతి నెలా రూ.1000 ఆర్థిక సాయం పొందుతారు. అర్హత కలిగిన అభ్యర్థులు.. ఆగస్ట్ 24 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..
స్కాలర్షిప్ వివరాలు & ప్రయోజనాలు:
ఈ పరీక్షలో.. ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులకు నెలకు రూ.1,000 చొప్పున, ఏడాదికి రూ. 12వేల లభిస్తాయి. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు (మొత్తం 4 ఏళ్లు) రూ. 48వేల సాయం అందుతుంది. ఈ నగదు నేరుగా విద్యార్థి బ్యాంక్ ఖాతాలో.. డీబీటీ (DBT)ద్వారా జమ అవుతుంది.
ఎవరు అర్హులు?
తరగతి: ప్రస్తుతం 2026-27 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులై ఉండాలి.
మార్కులు: 2025-26లో 7వ తరగతిలో కనీసం 55% మార్కులు (ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 50%) వచ్చి ఉండాలి.
పాఠశాల: ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక, ఎయిడెడ్, స్థానిక సంస్థల బడుల్లో మాత్రమే చదువుతూ ఉండాలి.
ఆదాయం: విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ. 3,50,000 (రూ. 3.5 లక్షలు) మించకూడదు. (నోట్: గతంలో ఉన్న ఆదాయ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ. 3.5 లక్షలకు పెంచింది).
గమనిక: గురుకులాలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్ ఆన్-ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తించదు.
ఎంపిక విధానం:
విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి.
MAT (మెంటల్ ఎబిలిటీ టెస్ట్): 90 మార్కులు.
SAT (స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్): 90 మార్కులు (గణితం, సైన్స్, సోషల్ అంశాలు).
అర్హులైన విద్యార్థులు తమ పాఠశాల హెడ్ మాస్టర్ ద్వారా సంబంధిత గడువులోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ portal.bsetelangana.org సంప్రదించవచ్చు.





