సివిల్ సర్వీసెస్ సాధించాలనే.. పట్టుదల ఉండి, ఆర్థిక స్థోమత లేని మైనార్టీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ‘తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్’, 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూపీఎస్‌సీ (UPSC) ఉచిత శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 7 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే జూన్ 14న నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.
తెలంగాణలోని మైనార్టీ వర్గాలకు చెందిన యువత సివిల్ సర్వీసెస్‌లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని మైనార్టీ స్టడీ సర్కిల్ వేదికగా ఈ శిక్షణ కొనసాగుతుంది.
అర్హతలు, నిబంధనలు:
ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా జనరల్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించకూడదు. మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం సీట్లను కేటాయించారు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది.
అప్లికేషన్ : అభ్యర్థులు మే 7 నుంచి మే 31 వరకు అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ: జూన్ 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
స్టడీ సర్కిల్ ప్రత్యేకతలు:
ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని స్టడీ సర్కిల్‌లో అవసరం అయిన వసతులు కల్పిస్తారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో శిక్షణ ఇస్తారు. అంతే కాకుండా కోచింగ్‌తో పాటు లైబ్రరీ, స్టడీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా సివిల్స్ వంటి కఠినమైన పరీక్షను ఎదుర్కోవడానికి అవసరమైన గైడెన్స్ కూడా నిపుణులు అందిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు గడువులోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుని కలను సాకారం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికారిక వెబ్‌సైట్:
https://tmreis.telangana.gov.in





