2026-27 విద్యా సంవత్సరానికి షెడ్యూల్ విడుదల
జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం
అనుబంధ కళాశాలల్లోనే చేరాలని టీజీబీఐఈ సూచన
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, గురుకుల, సంక్షేమ, మోడల్ జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల అడ్మిషన్స్ మే 12 నుంచి మొదలవుతాయని తెలిపింది. ఈ మేరకు మే 11న బోర్డు కార్యదర్శి అన్ని అనుబంధ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
మొదటి విడత అడ్మిషన్స్ దరఖాస్తుల స్వీకరణకు మే 31 చివరి తేదీగా నిర్ణయించారు. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి విడత అడ్మిషన్స్ ప్రక్రియ జూన్ 30తో పూర్తవుతుంది.
ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక అడ్మిషన్స్ కల్పించవచ్చని బోర్డు తెలిపింది. అనంతరం విద్యార్థులు ఒరిజినల్ ఎస్‌ఎస్‌సీ పాస్ సర్టిఫికెట్, చివరిగా చదివిన పాఠశాల జారీ చేసిన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత అడ్మిషన్‌ను ఖరారు చేయాలని సూచించింది.
అడ్మిషన్స్‌లో రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఎన్‌సీసీ, క్రీడలు, పాఠ్యేతర కార్యకలాపాలకు 5 శాతం, మాజీ సైనికులు, రక్షణ సిబ్బందికి 3 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం సీట్లు కేటాయించాలని తెలిపింది. బాలికలకు ప్రత్యేక కళాశాలలు లేని చోట మొత్తం సీట్లలో 33.33 శాతం రిజర్వ్ చేయాలని తెలిపింది.
జీపీఏ, సబ్జెక్టు వారీ గ్రేడ్ పాయింట్లు, అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్స్ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. అడ్మిషన్స్ పేరిట ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని హెచ్చరించింది. ఇతర ప్రమాణాల ఆధారంగా అడ్మిషన్స్ కల్పించే జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, సంక్షేమ, మైనారిటీ, మోడల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ కోరే విద్యార్థులు ఆధార్ నంబర్ సమర్పించాలి. అన్‌ఎయిడెడ్ కళాశాలలు అనుమతి ఉన్న సెక్షన్లలోనే, ఒక్కో సెక్షన్‌లో గరిష్ఠంగా 88 మంది విద్యార్థులకే అడ్మిషన్స్ ఇవ్వాలని బోర్డు స్పష్టం చేసింది. అనుమతి లేకుండా అదనపు సెక్షన్లలో అడ్మిషన్స్ కల్పిస్తే జరిమానాతో పాటు కళాశాల అనుబంధాన్ని రద్దు చేసే చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
అడ్మిషన్స్ సమయంలో కళాశాల భవనం ప్రవేశద్వారం వద్ద మంజూరైన సెక్షన్లు, నిండిన సీట్లు, ఖాళీ సీట్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. ఆ వివరాలను ప్రతిరోజూ నవీకరించాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డుకు అనుబంధంగా ఉన్న జూనియర్ కళాశాలల్లోనే అడ్మిషన్స్ పొందాలని టీజీబీఐఈ సూచించింది.





