రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల అడ్మిషన్లకు సంబంధించి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) కీలక ప్రకటన జారీ చేసింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరంలో చేరేందుకు చివరి తేదీ జులై 31 గా నిర్ణయించింది. విద్యార్థులు తుది గడువులోగా అడ్మిషన్ తీసుకోవాలని సూచించింది.
అడ్మిషన్ ప్రక్రియ వివరాలు:
తెలంగాణలో ఇంటర్మీడియట్ కోర్సులు MPC, BiPC, CEC, HEC వంటి వివిధ స్ట్రీమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తి , విద్యా అర్హతల ఆధారంగా ఈ కోర్సుల్లో చేరవచ్చు. అడ్మిషన్లు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలలో జరుగుతాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు, అవసరం అయిన డాక్యుమెంట్లు:
ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం విద్యార్థులు SSC లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని కాలేజీలు మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి. కాబట్టి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రముఖ కాలేజీలలో సీటు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్లికేషన్ సమయంలో SSC మార్కుల మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ (అవసరమైతే), ఆధార్ కార్డ్ వంటివి అవసరం అవుతాయి . రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లను తప్పనిసరిగా సమర్పించాలి.
అప్లికేషన్ విధానం:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ సులభంగా ఉంటుంది. విద్యార్థులు TSBIE అధికారిక వెబ్‌సైట్‌లోని అడ్మిషన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత, అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. విద్యార్థులకు కాలేజీల ఎంపిక, సీటు కేటాయింపు వివరాలు వెబ్‌సైట్ ద్వారా తెలిజేస్తారు.
ముఖ్యమైన సూచనలు:
ఈ రోజు (జులై 31) చివరి తేదీ కాబట్టి.. విద్యార్థులు ఈ గడువులోపు అప్లై చేయడం ముఖ్యం. అడ్మిషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా.. TSBIE హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.





