ఇంటర్ వార్షిక పరీక్షలు మే నెల 2వ తేదీ నుంచి ప్రారంభించి అదే నెల 20వ తేదీకి పూర్తిచేసేలా ఇంటర్‌బోర్డు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఏప్రిల్‌లో పరీక్షలు జరుపుతామని బోర్డు ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడం, కరోనా మూడో దశ దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలస్యంగా మే నెలలో మొదలుపెట్టాలని బోర్డు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలి
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2.35 లక్షల మంది తప్పారు. వారందరినీ కనీస మార్కులు ఇచ్చి పాస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మార్కులతో సంతృప్తిపడని వారు ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని పేర్కొంది. వారిలో కనీసం 50 శాతం మంది ఇంప్రూవ్‌మెంట్ రాస్తారని అంచనా. ఈ క్రమంలో అసలే ఒత్తిడిలో ఉన్న ఆ విద్యార్థులు ఒక రోజు ప్రథమ, మరుసటి రోజు ద్వితీయ పరీక్షలు రాయాలంటే ఆందోళనకు గురవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం ప్రధాన సబ్జెక్టుల పరీక్షల మధ్యనైనా రెండు రోజుల వ్యవధి ఉంటే బాగుంటుందని, ఆ దిశగా బోర్డు కాలపట్టిక రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
టెన్త్ పరీక్షల తేదీలు ఖరారు
పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించే తేదీలను ప్రభుత్వం పరీక్షల విభాగం ఖరారు చేసింది. పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించింది. ఈ నెల 29వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 10, రూ.200 అదనంతో ఫిబ్రవరి 21, రూ.500 అదనంతో మార్చి 3వ తేదీ వరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆ ప్రకారం మే 20వ తేదీ తర్వాత మొదలవుతాయి.