తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెలలో ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమం కోసం 1491 ఆప్తాల్మిక్ ఆఫీసర్లను నియమించనుంది. ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల వారీగా ఈ నియమకాలు చేపట్టాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది.
అన్ని జిల్లాల్లో డిసెంబర్ 1 వ తేదీన ఈ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆప్తాల్మిక్ ల్యాబ్ అసిస్టెంట్ కోర్సులు చేసిన వారందరూ ఈ పోస్టులకు అర్హులు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ 5వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయి. పదో తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల చొప్పున వేతనం చెల్లించనున్నారు.