తెలంగాణలో మరో వేయికి పైగా ఉద్యోగాల (Telangana Govt Jobs) భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మరో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకం కొనసాగుతోంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ సైతం పూర్తయింది. అయితే.. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మంగళవారం ప్రారంభం కానుంది. మూడు రోజుల్లో.. అంటే ఈ నెల 25తో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్త అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.
ఈ భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలో భారీగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్.. అందుకు అనుగుణంగా వాటిలో ఉద్యోగాలను భర్తీ చేయట్లేదన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ అంశంపై దృష్టి సారించింది. పూర్తి స్థాయిలో ఆయా మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చింది.