తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ప్రకటించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ డాక్టర్ బి.జనార్ధన్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో బీఆర్కే భవన్లో మంగళవారం ఆయన రివ్యూ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు టీఎస్పీఎస్సీ మెడికల్ రిక్రూట్‌మెంట్, పోలీస్ రిక్రూట్‌మెంట్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ జరుగుతుందన్నారు.
నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు , రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్ పీఎస్సీకి వెంటనే సమాచారం అందిస్తే, వాటి ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే నెలలో నోటిఫికేషన్‌లు జారీ చేస్తుందన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ శాంతికుమారి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.