తెలంగాణలో త్వరలో నోటిఫికేషన్స్ వెలువడనున్నాయి. అందుకే గ్రూప్-1 ఉద్యోగ నియామకాల్లో డీఎస్పీ అభ్యర్థుల ఎత్తు ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే ఎత్తు ఎక్కువగా ఉండటంపై నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా, మిగతా రాష్ట్రాలు, చివరకు ఐపీఎస్ ఎంపికకు సమానంగా ఎత్తును సవరించాలని వారు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. జిల్లాలు, జోన్ల వారీగా ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తయింది. దీంతో వచ్చే నెలారెండు నెలల్లోనే గ్రూప్-1 ఉద్యోగ ప్రకటన కూడా వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
పోలీసుశాఖలో డీఎస్పీల ఎంపిక దీని పరిధిలోకే వస్తుంది. అయితే తెలంగాణలో డీఎస్పీ అభ్యర్థులు కనీస ఎత్తు 167.5 సెంటీమీటర్లు ఉండాలనేది నిబంధన. నిరుద్యోగుల అభ్యంతరం దీనిపైనే. దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు, డీఎస్పీ స్థాయిలో ఉండే కేంద్ర పారామిలటరీ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులతోపాటు చివరకు ఐపీఎస్‌ల ఎంపికకు కూడా కనీస ఎత్తు 165 సెంటీమీటర్లు మాత్రమే.
కానీ తెలంగాణలో దీన్ని 167.5 సెంటీమీటర్లుగా నిర్ధారించారు. పైస్థాయిలో ఉండే ఐపీఎస్‌లకే ఎత్తు 165 సెంటీమీటర్లు ఉన్నప్పుడు డీఎస్పీలకు ఇంకో రెండున్నర సెంటీమీటర్ల ఎక్కువ ఎత్తు ఎందుకన్నది నిరుద్యోగుల వాదన. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు పలుదఫాలుగా వినతిపత్రాలు సమర్పించారు.