తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షల ప్రత్యేకం)
తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 594 మండలాలు ఉన్నాయి. జనాభా 3,50,03,674(2011 జనాభా లెక్కల ప్రకారం). దేశ జనాభాలో తెలంగాణ శాతం 2.89శాతం. దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉంది.
భౌగోళిక విస్తీర్ణం: 1,12,077 చ.కి.మీ. దేశ జనాభాలో తెలంగాణ శాతం 3.41శాతం. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం 11. విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా నల్లగొండ. అతి చిన్న జిల్లా హైదరాబాద్. అత్యధిక గ్రామీణ జనాభా గల జిల్లా నల్లగొండ. అత్యల్ప గ్రామీణ జనాభా గల జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి. అత్యధిక పట్టణ జనాభా గల జిల్లా హైదరాబాద్.అత్యల్ప పట్టణ జనాభా గల జిల్లా ములుగు. తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత 312 చ.కి.మీ.
33 జిల్లాల సంక్షిప్త సమాచారం
ఆదిలాబాద్: దీనిని పూర్వం ఎదులాపురం అని పిలిచేవారు. ఈ జిల్లాలో నాగోబా జాతర జరుగుతుంది. కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయి జలపాతాలు ఉన్నాయి.
నిర్మల్: 400ఏళ్ల క్రితం పాలించిన నిమ్మనాయుడు పేరుమీద ఈ జిల్లాకు ఆ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. నిర్మల్ పెయింటింగ్స్, కొయ్యబొమ్మలకు నిర్మల్ ప్రసిద్ధి.
మంచిర్యాల: రెండో అన్నవరంగా పిలిచే గూడింగట్టు సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్, శివ్వారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. చెన్నూరుర తాలుకాలో జరిగే వేలాల జాతర ప్రసిద్ధి. సిమెంట్ పరిశ్రమలు ఈ జిల్లా ప్రత్యేకం.
కుమ్రం భీం ఆసిఫాబాద్: జల్, జంగిల్, జమీన్ కోసం నిజాం సర్కార్‌పై పోరాటం చేసిన గోండు అమరవీరుడు కుమ్రంభీం పేరు మీద జిల్లాకు ఆ పేరు పెట్టారు. హైమన్ డార్ఫ్ దంపతుల స్మారక స్తూపం మార్లవాయి గల జిల్లా. విద్యుత్ కనెక్షన్లు అతి తక్కువగా ఉన్న జిల్ఆ కుమ్రంభీం ఆసిఫాబాద్.
కరీంనగర్: పూర్వం సబ్బినాడు, ఎల్లందలుగా పిలిచేవారు. గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిల్వర్ ఫిలిగ్రీ కళకు ప్రసిద్ధి. తెలంగాణ నుంచి మొదటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత(1980) పైడి జైరాజ్ ఈ జిల్లాకు చెందినవారే.
జగిత్యాల: జగ్గదేవుడు పేరుమీద జగిత్యాల పేరు వచ్చింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఈ జిల్లాలోనే ఉన్నాయి. రాఖీ గుట్టులు, అతిపెద్ద బొనాల జాతర జరిగే పెద్దపూర్ ఈ జిల్లాలో చెందినవే.
రాజన్న సిరిసిల్ల: మార, చేనేత పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయం ఉన్న జిల్లా. దేశంలోనే తొలి సహకార విద్యుత్ సరఫరా సంస్థ నెలకొని ఉన్న జిల్లా. ప్రసిద్ధ తెలుగు కవి సి.నారాయణరెడ్డి (సినారె) ఈ ప్రాంతానికి చెందిన వారే.
పెద్దపల్లి: రామగిరి ఖిల్లా, ధూళికట్ట బౌద్ధస్తూపం గల జిల్లా. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ గల జిల్లా. జాతీయ రహదారులు లేని జిల్లా.
నిజామాబాద్: పూర్వనామం ఇందూరు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం గల జిల్లా. ఆర్మూర్ సిద్ధులగుట్ట జాతర, డిచ్పల్లి రామాలయం (దక్షిణ భారతదేశ ఖజురహో) ప్రసిద్ధి. తెలంగాణలో గోదావరి నది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది.
కామారెడ్డి: దోమకొండ సంస్థానాధీశుడైన రెండో కామారెడ్డి పేరిట వెలసిన గ్రామం. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు ప్రసిద్ధి. డెయిరీ టెక్నాలజీ కళాశాల గల ఏకైక జిల్లా. రాష్ట్రంలో బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక జిల్లా.
హనుమకొండ: వేయి స్తంభాల గుడి, అయినవోలు జాతరకు ప్రసిద్ధి. ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఎనమాముల ఈ జిల్లాలోనిదే.
వరంగల్: పాకాల సరస్సు, వరంగల్ ఖిల్లా, భద్రకాళి ఆలయానికి ప్రసిద్ధి. దేశంలోనే ఆదర్శ గ్రామపంచాయతీ గంగదేవిపల్లి ఈ జిల్లాలోనే ఉంది.
జయశంకర్ భూపాలపల్లి: ఆచార్య జయశంకర్ పేరుమీద ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు ప్రసిద్ధి. దక్షిణ త్రివేణి సంగమం కాళేశ్వరం ఈ జిల్లాలోనే ఉంది.
ములుగు: 2019 ఫిబ్రవరి 17న ఏర్పడిన జిల్లా రామప్ప ఆలయం (యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది), లక్నవరం చెరువు, సమ్మక్క సారలమ్మ జాతర ఈ జిల్లాలోనే జరుగుతున్నాయి. తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతం ఉంది.
జనగామ: జైనుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. రాజకీయ, సామాజిక ఉద్యమాలకు పోరుగడ్డ. ఇత్తడి లోహ వస్తువులకు ప్రసిద్ధ ప్రాంతం పెంబర్తి ఈ జిల్లాలోనిదే. రాష్ట్రంలో అత్యధిక పాల ఉత్పత్తి చేస్తోన్న జిల్లా.
మహబూబాబాద్: పూర్వం మానుకోటగా పిలిచేవారు. కొరవి వీరభద్ర స్వామి జాతర ప్రసిద్ధి. కాకతీయుల కాలం నాటి బయ్యారం చెరువు శాసనం ఈ జిల్లాలోనిదే. మున్నేరు నది జన్మస్థలం.
ఖమ్మం: పూర్వనామం స్తంభాద్రి. ఖమ్మం ఖిల్లా, అతిపెద్ద బౌద్ధ స్తూపం నెలకొన్న ప్రాంతం. తీర్థాల జాతర జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణాది అయోధ్యగా పిలిచే భద్రాద్రి సీతారామయ్య పేరు మీద ఏర్పాటు చేసిన జిల్లా. కిన్నెరసాని ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఈ జిల్లాలోనివే. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, మణుగూరు భారజల కర్మాగారం ప్రసిద్ధి. కిన్నెరసాని, అభయారణ్యం, పర్ణశాల గల జిల్లా.
నల్లగొండ: పూర్వనామం నీలగిరి, నందికొండ. నాగార్జున సాగర్, డిండి, శాలిగౌరారం ప్రాజెక్టులు గల జిల్లా. పచ్చల సోమేశ్వరాలయం ఉంది. చెర్వుగట్టు జాతర, తుల్జాభవాని జాతరకు ప్రసిద్ధి. చౌకధరల దుకాణాలు అధికంగా గల జిల్లా.
సూర్యాపేట: పూర్వనామం భానుపూరి. గేట్ వే ఆఫ్ తెలంగాణగా వ్యవహరిస్తారు. గొల్లగట్టు జాతర(తెలంగాణలో అతిపెద్ద రెండో జాతర), సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా.
యాదాద్రి భువనగిరి: లక్ష్మీనర్సింహాస్వామి పేరు మీద ఈ జిల్లా ఏర్పాటు చేశారు. కొలనుపాక జైన దేవాలయం, భువనగిరి కోట ప్రసిద్ధి. సిల్క్ సిటీగా పిలిచే పోచంపల్లి ఈ జిల్లాలోనిదే.
మహబూబ్‌నగర్: పూర్వనామం పాలమూరు. పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్నెంకొండ, పిల్లలమర్రి ఈ జిల్లాలోనే ఉన్నాయి. కురుమూర్తి, మన్నెంకొండ జాతర ప్రసిద్ధి.
నాగర్ కర్నూల్: మల్లెల తీర్థం జలపాతం, సలేశ్వరం ఈ జిల్లాలోనివే. మహాత్మాగాంధీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నెలకొని ఉన్నాయి.
జోగులాంబ గద్వాల: ఆలంపూర్ జోగులాంబ ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ప్రసిద్ధి. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సమర్పించే ఏరువాడ జోడు పంచెలను ఇక్కడే తయారు చేస్తారు. తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక సంప్రదాయాలు, సంస్కృతులు కలిగిన జిల్లా.
వనపర్తి: బాలబాలికల లింగ నిష్పత్తి అత్యల్పంగా గల జిల్లా. తెలంగాణ విత్తన శుద్ధి కర్మాగారం ఉంది. సరళసాగర్ ప్రాజెక్టు గల జిల్లా.
నారాయణపేట: చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం. రాష్ట్రంలోకి కృష్ణా నది తంగడి ద్వారా ప్రవేశిస్తుంది. గొర్రెల సంఖ్య అత్యధికంగా గల జిల్లా.
సంగారెడ్డి: అందోల్, మంజీర మొసళ్ల అభయారణ్యం, సింగూరు జలాశయాలకు ప్రసిద్ధి. జైలు మ్యూజియం గల జిల్లా. కేతకి సంగమేశ్వర, జోగినాథుని, నల్లపోచమ్మ జాతరలకు ప్రసిద్ధి. అత్యధిక రెవెన్యూ గ్రామాలు గల జిల్లా. జీవవైవిధ్య వారసత్వ ప్రవదేశంగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువు కలిగి ఉన్న జిల్లా.
సిద్దిపేట: కొమరవెల్లి మల్లన్న, బెజ్జంకి జాతర ఈ జిల్లాలోనే జరుగుతాయి. తొలి ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటైన జిల్లా. శనిగరం ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్, గౌరవెల్లి ప్రాజెక్టులు ఉన్నాయి.
మెదక్: పూర్వనామాలు సిద్ధాపూర్, మెతుకుదుర్గం. ఏడుపాయల, సికండ్లాపూర్ జాతరలు, మెదక్ చర్చి ప్రసిద్ధి. స్థూల సాగు విస్తీర్ణంలో పెరుగుదల శాతం అధికంగా గల జిల్లా.
రంగారెడ్డి: అత్యధిక రెవెన్యూ డివిజన్లు గల జిల్లా. చేవేళ్ల జాతర, ఆరుట్ల బుగ్గ జాతరకు ప్రసిద్ధి. గండిపేట, ఉస్మాన్‌సాగర్ గల జిల్లా. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, చిలుకూరు బాలజీ టెంపుల్ ప్రసిద్ధి.
మేడ్చల్ మల్కాజ్గిరి: కీసర, చిత్తారమ్మ జాతరలు ప్రసిద్ధి. తెలంగాణ ఫారెస్ట్ అకాడమి, ఈసీఐఎల్, ఎన్ఎఫ్సీ, ఎన్జీఆర్ఐ తదితర జాతీయ సంస్థలు ఉన్నాయి. అతి తక్కువ గ్రామ పంచాయతీలు గల జిల్లా.
వికారాబాద్: వికారొద్దీన్ అనే నవాబు పేరు మీద వచ్చింది. తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి చెందిన అనంతగిరి కొండలు ఈ జిల్లాలోనివే. దేశంలో రెండో అతిపెద్ద టీబీ శానిటోరియం గల జిల్లా. తలసరి ఆదాయం తక్కువగా గల జిల్లా.
హైదరాబాద్: భూపరివేష్టిత జిల్లా. పెద్దమ్మ, మహంకాళి, ఆల్వాల్ జాతరలకు ప్రసిద్ధి. గ్రామ పంచాయతీలు లేని జిల్లా. అధిక శాసనసభ స్థానాలు ఉన్నాయి.
అధిక జనసాంద్రత గల జిల్లా హైదరాబాద్ (18161)
అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ములుగు (71)
తెలంగాణ రాష్ట్ర సగటు లింగ నిష్పత్తి 988: 1000
అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా నిర్మల్ 1046
అత్యల్ప లింగ నిష్పత్తి గల జిల్లా రంగారెడ్డి 950
తెలంగాణ అక్షరాస్యత శాతం 66.54శాతం
అక్షరాస్యత రేటులో దేశంలో తెలంగాణ రాష్ట్ర స్థానం 31
అక్షరాస్యత శాతం అధికంగా గల జిల్లా హైదరాబాద్
అక్షరాస్యత శాతం అత్యల్పంగా గల జిల్లా జోగులాంబ గద్వాల్
తెలంగాణలో ఎస్సీల జనాభా అధికంగా గల జిల్లా రంగారెడ్డి
తెలంగాణలో ఎస్సీల జనాభా అత్యల్పంగా గల జిల్లా ములుగు
తెలంగాణలో ఎస్టీల జనాభా అధికంగా గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణలో ఎస్టీల జనాభా అత్యల్పంగా గల జిల్లా జోగులాంబ గద్వాల్
తెలంగాణలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,769
అత్యధిక గ్రామ పంచాయతీలు గల జిల్లా నల్లగొండ(844)
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం 24.05శాతం
అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా హైదరాబాద్
అత్యధిక అటవీ విస్తీర్ణ శాతం గల జిల్లా ములుగు
అత్యల్ప అటవీ విస్తీర్ణ శాతం గల జిల్లా కరీంనగర్
Nice
Super information