రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ ఖరారు చేసింది. డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు గడువు ఆగస్టు 14 (ఈ రోజు)తో ముగియనుంది. దోస్త్ (DOST) కౌన్సెలింగ్‌లో సీట్లు పొందలేకపోయిన విద్యార్థులు, అలాగే ఇప్పటివరకు డిగ్రీ అడ్మిషన్ల కోసం అప్లై చేసుకోని వారు ఈ స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చు. ఇది చివరి అవకాశం కాబట్టి.. విద్యార్థులు కాలేజీల్లో అందుబాటులో ఉన్న ఖాళీలను పరిశీలించి, వెంటనే అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
వివిధ కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను తెలుసుకోవడానికి విద్యార్థులు నేరుగా ఆయా కాలేజీలను సంప్రదించవచ్చు లేదా వెబ్‌సైట్‌లను చెక్ చేయవచ్చు.
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. అవసరమయ్యే డాక్యుమెంట్స్:
ఇంటర్మీడియట్ మార్కుల మెమో (మార్క్ షీట్).
ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్.
క్యాస్ట్ సర్టిఫికెట్ .
రెసిడెన్స్ సర్టిఫికేట్.
ఆధార్ కార్డ్.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలను ఎంచుకున్న తర్వాత, పైన పేర్కొన్న డాక్యుమెట్లతో నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో ఏదైనా సందేహాలు ఉంటే.. అడ్మినిస్ట్రేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. పలు కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ వంటి వివిధ కోర్సులలో అందుబాటులో ఉన్న సీట్లలో తమకు ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకొని, వెంటనే స్పాట్ అడ్మిషన్ పొందవచ్చు. ఈ అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. విద్యార్థుల అర్హత, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.





