ఘనంగా అవతరణ వేడుకలు నిర్వహించండి: కలెక్టర్లకు కేసీఆర్ సూచనలు

ఆరు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఉత్సవాలు సాగాలన్నారు. ఈ రోజు సచివాలయంలో మంత్రులు,ప్రభుత్వ సలహాదారులు, సీఎస్, సీఎంవో కార్యదర్శులు, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దశాబ్ది ఉత్సవాల ఖర్చుల కోసం రూ. 105 కోట్ల ను విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
ప్రతీపక్షాలపై ప్రధాని ఫైర్

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవ వేడుకను బహిష్కరిస్తూ విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని మోడీ ఇవాళ ఉదయం భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో జరిగిన సభను ప్రధాని ప్రస్తావిస్తూ.. ‘‘అందులో 20 వేలమంది పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్, మాజీ ప్రధాని, ఇతర విపక్ష ఎంపీలు, నేతలు వచ్చారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అందులో పాల్గొన్నారు. ఒక కమ్యూనిటీ ఈవెంట్‌కు వారంతా కలిసికట్టుగా హాజరయ్యారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు.
కేంద్రం ఆధ్వర్యంలోనూ అవతరణ వేడుకలు: కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జూన్ 2వ తేదీన అట్టహాసంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పారా మిలిటరీ దళాలతో కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదే రోజు సాయంత్రం అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
జడ్చర్లలో కాంగ్రెస్ జోష్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఈ రోజు భారీ సభను ఏర్పాటు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖ్ హాజరయ్యారు. తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కీలక నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం సభ కొనసాగుతోంది.
గాంధీభవన్ ముట్టడికి గొల్ల కురుమలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ క్షమాపణలు చెప్పేందుకు తామిచ్చిన డెడ్ లైన్ ముగియడంతో గొల్ల కురుమలు ఈ రోజు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ వద్ద యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దున్నపోతులతో గొల్లకురుమలు ప్రదర్శనలు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు గాను రేవంత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గొల్లకురుమలు డిమాండ్ చేశారు. గొల్లకురుముల ముట్టడి పిలుపుతో గాంధీభవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడ పోలీసులు భద్రత పెంచారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రా విద్యార్థుల హవా

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రా విద్యార్థుల హవా కొనసాగింది. తొలి పది ర్యాంకుల్లో ఎనిమిదింటిని ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టీఎస్ ఎంసెట్ ఫలితాలను ఇవాళ ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ లలో ఏపీ విద్యార్థులే టాపర్లుగా వాళ్లే ఉన్నారు. ఇంజినీరింగ్ లో టాప్ 10లో ఇద్దరే తెలంగాణ విద్యార్థులు ఉండగా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ టాప్ టెన్ లో ముగ్గురు తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు.
కవిత అరెస్ట్ లేదా?: ఆర్ఎస్ ప్రవీణ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఇక లేనట్లేనా? అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఈ రోజు ఆయన ట్వీట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేశ్ రూ.80 కోట్లు క్రిప్టోకరెన్సీ,హవాలా ద్వారా కవితకు ముడుపులు చెల్లించినట్లు వాంగ్మూలం ఇచ్చినా కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన కూతురును కాపాడుకోవడం కోసమే బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
హుజూరాబాద్ లో హైడ్రామా
హుజూరాబాద్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. సినీ ఫక్కీలో నవవధువును బంధువులు కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. జగిత్యాల జిల్లా కొండగట్టులో కొత్తజంట పెళ్లి చేసుకుని హనుమకొండకు కారులో తిరిగి వెళ్తుండగా 15 మంది వారిని హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అడ్డుకున్నారు. అందులో కొందరు వధువును కారులో ఎక్కించుకుని వెళ్లిపోగా.. మరికొందరు వరుడిపై దాడి చేశారు. వరుడు, వధువు ఇద్దరిది హనుమకొండ జిల్లాలోని మడికొండ గ్రామంగా అని తెలుస్తోంది. ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో వధువు బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. అపహరణ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ట్రాఫిక్ చలాన్లు కట్టలేక సూసైడ్

ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు గురై ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగల్ లోని ఓ బట్టల షాపులో పని చేస్తుండేవాడు. ప్రతి రోజూ తన స్కూటీపై పనికి వెళ్లివచ్చేవాడు. అయితే ఈనెల 21న వరంగల్ చౌరస్తాలో ఆయన్ను పోలీసులు ఆపారు. 17 పెండింగ్చలాన్లు వెంటనే కట్టాలంటూ స్కూటీని సీజ్‌చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి సూసైడ్ చేసుకున్నాడు.
హైదరాబాద్ లో విషవాయువు కలకలం

హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి విషవాయువు కలకలం రేపింది. టప్పాచబుత్ర, యూసుఫ్‌నగర్, కార్వాన్, నటరాజ్‌నగర్, మహేష్ కాలనీలో ఘాటైన వాసన రావడంతో భయంతో రాత్రంతా స్థానికులు జాగారం చేశారు. వాంతులతో చిన్నారులు, మహిళల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ ఎంత వెతికినా ఈ వాసన ఎక్కడ నుంచి వచ్చిందో గుర్తించలేకపోయారు. సుమారు గంటన్నర తర్వాత దుర్వాసన రావడం ఆగిపోయిందని స్థానికులు చెబుతున్నారు.