తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు 2022-–23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి, విద్యార్థుల సంక్షేమానికి భారీగా కేటాయింపులు జరిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సర్కార్ భారీగా కేటాయింపులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. వంద కోట్లను ప్రతిపాదించింది. అటవీ విశ్వ విద్యాలయానికి కూడా ఈ బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించారు.
కొత్త మెడికల్ కాలేజీలకు రూ.1000 కోట్లు
అన్ని జిల్లాల్లో రానున్న రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 2023లో మిగతా ఎనిమిది జిల్లాలు మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్
రాష్ట్ర వ్యాప్తంగా అన్నిప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ను పంపిణీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది. స్కాలర్షిప్స్ కోసం రూ.4688 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.