తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో 250 అసిస్టెంటు సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌వో) ఖాళీలను సాధారణ పరిపాలన శాఖ గుర్తించింది. వీటిపై ఆర్థికశాఖకు తాజాగా నివేదిక ఇచ్చింది. ఇందులో 150 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీఎస్‌పీఎస్సీ గ్రూపు-2 ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 100 పోస్టులను పదోన్నతులు, కారుణ్య నియామకాలతో పాటు పన్నెండున్నర శాతం కోటా కింద శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా బదిలీ అయ్యే వారికి కేటాయించింది.
త్వరలో వయోపరిమితిపై ఉత్తర్వులు
రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంపుపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఖాళీల భర్తీ ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ.. పోలీసు వంటి యూనిఫాం సర్వీసులకు మినహా ఇతర పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఓసీలకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు ఉండగా… దానిని 44కి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 నుంచి 49కి, దివ్యాంగులకు 44 నుంచి 54 ఏళ్లు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం తాజాగా సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలు ప్రతిపాదనలు రూపొందించాయి. ఒకట్రెండు రోజుల్లో వీటిని సీఎం కేసీఆర్‌కు అందజేస్తాయి. ఆయన ఆమోదం లభించిన వెంటనే జీఏడీ నుంచి ఉత్తర్వులు వస్తాయి. మరోవైపు కనిష్ఠ వయో నిబంధనలు యథాతథంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం డీఎస్పీలు, జిల్లా రిజిస్ట్రార్లు, జిల్లా అగ్నిమాపక, ఉపాధి, ట్రెజరీ అధికారులు, ఉప రిజిస్ట్రార్ల పోస్టులకు కనీస వయసు 21, సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టుల దరఖాస్తుదారులకు 20 ఏళ్లు ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులుగా ఉంటారు.