నిరుద్యోగులకు శుభవార్త. ఇటీవల విడుదలైన తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (TGCAB) ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (DCCB) ఉద్యోగాల నోటిఫికేషన్ కు నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే గడువుంది. ఖాళీలున్న జిల్లాల వారీగా నోటిఫికేషన్ టెస్కాబ్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఈ ఖాళీలున్నాయి. మొత్తం ఆరు జిల్లాల బ్యాంకుల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా సహకార బ్యాంకులో అత్యధికంగా 99, కరీంనగర్‌లో 43, హైదరాబాద్‌లో 32 పోస్టులు భర్తీ చేస్తారు. మెదక్, వరంగల్‌లలో 21 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 9 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 225 ఖాళీలలో 25 శాతం పోస్టులు ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయించారు. అవసరాన్ని బట్టి ఈ సంఖ్యలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
అర్హతలు
తెలంగాణ స్థానికులైనవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. కనీసం నాలుగేళ్ల చదువు లేదా నివాసం తెలంగాణలో ఉండాలన్నది ప్రధాన షరతు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. 10వ తరగతి వరకు తెలుగు భాష చదివి ఉండాలి. ఇంగ్లిష్‌లో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తులకు నవంబర్ 6 చివరి తేదీ
ఆక్టోబర్ 18 నుంచి నవంబర్ 6 వరకు తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 500 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు సమయంలో ఫోటో, సంతకం, బొటనవేలి ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. ఒక అభ్యర్థి ఒకే జిల్లా బ్యాంకుకు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది.
ఇంటర్వ్యూ లేకుండా ఆన్‌లైన్ పరీక్ష
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాల ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ విధానం లేదు. డిసెంబర్ నెలలో పరీక్ష నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పరీక్షలో జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఆంగ్ల భాష, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 160 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఉంటుంది. తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ప్రతి సెక్షన్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి.
జీతం 47 వేల రూపాయలు
ఈ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రారంభంలోనే నెలకు రూ. 47 వేల జీతం అందుతుంది. ఈ ఉద్యోగాలకు పే స్కేల్ రూ. 24,050 నుంచి రూ. 64,480 వరకు ఉంటుంది. డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె భత్యం, వైద్య రీయింబర్స్‌మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి సౌకర్యాలు అదనం. ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ వంటి ప్రమోషన్లుంటాయి.
సహకార బ్యాంకు ఉద్యోగుల బాధ్యతలు
స్టాఫ్ అసిస్టెంట్లు ప్రధానంగా కస్టమర్లకు సేవలు అందించడం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఖాతాల నిర్వహణ వంటి ముఖ్యమైన పనుల్లో పాల్గొంటారు. సహకార బ్యాంకులు లాభం కంటే సేవకు ప్రాధాన్యం ఇవ్వడం వీటి ప్రత్యేకత. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ ప్రతి సభ్యుడికి సమాన ఓటింగ్ హక్కు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల కాంట్రాక్ట్ బాండ్, ఒక సంవత్సరం ప్రోబేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.





