టెట్.. తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షల షెడ్యూలు విడుదలైంది. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటించారు. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్షలను.. జనవరి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో పేపర్ -2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి పేపర్ 1, పేపర్ 2 రెండు పరీక్షలు కలిపి 2.75 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రిపరేషన్ ప్లాన్
‣ టెట్ పేపర్-1 రాసే అభ్యర్థులు అవసరమైన సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే 3 నుంచి 8 తరగతుల వరకు పాఠ్యపుస్తకాల నోట్స్ రాసుకొని పూర్తిగా చదవాలి.
‣ పేపర్-2 రాసే అభ్యర్థులు 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు పక్కా ప్రణాళికతో చదవాలి.
‣ తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి నోట్సు తయారు చేసుకుని సాధన చేయాలి.
పేపర్-1 కోసం డీఎస్సీ అభ్యర్థులు సాంఘిక, గణితం, విజ్ఞానశాస్త్రాలకు సంబంధించిన కంటెంట్‌ను 3 నుంచి 8వ తరగతుల వరకు చదవాలి.
పేపర్-2 అభ్యర్థులు 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పుస్తకాలలోని కంటెంట్‌ను చదవాలి. తెలుగు అకాడమీ లాంటి ప్రామాణికమైన సంస్థల పుస్తకాలను చదువుతూ స్వతహాగా నోట్సు తయారుచేసుకోవడం ఉత్తమం.
‣ గణితం కంటెంట్‌లో అరిథ్‌మెటిక్, దత్తాంశ నిర్వహణ, సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితం, క్షేత్రమితి, బీజగణితం, యూనిట్లపై దృష్టి పెట్టాలి.
‣ సైన్స్‌లో సహజ దృగ్విషయాలు, సజీవ ప్రపంచం, జీవప్రక్రియలు, మన పర్యావరణం యూనిట్లపై దృష్టి పెట్టాలి.
‣ సోషల్ స్టడీస్‌లో 6 థీమ్‌లు ఉన్నాయి. రాజకీయ వ్యవస్థలు-పరిపాలన, సామాజిక వ్యవస్థీకరణ – అసమానతలు, భూమి వైవిధ్యం- మాన చిత్రాలు, ఉత్పత్తి-వినిమయం, జీవనాధారాలు మతం-సమాజం, సంస్కృతి విభాగాలను అధ్యయనం చేయాలి.
‣ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజిలో అభ్యసనం (లెర్నింగ్) యూనిట్‌లో ప్రధాన అంశాలైన ప్రేరణ, అభ్యసన, అభ్యసనా సిద్ధాంతాలు, అభ్యసన బదలాయింపు, స్మృతి-విస్మృతిపై ఎక్కువగా దృష్టి పెట్టి చదవాలి.
‣ అధ్యాపన శాస్త్రం (పెడగాజి)లో కీలకంగా ఉండే బోధన ఉపగమాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సహిత విద్య, బోధన దశలు, ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (2009), జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005)పై కాస్తా దృష్టి పెట్టి చదవాలి.
లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు, వాటి ఉదాహరణలను బాగా చదవి సిలబస్‌లో ఇచ్చిన సాహిత్యం(లిటరేచర్) అవగాహన చేసుకోవాలి.