మృత్తికలు
రాళ్లు రప్పలతో కూడిన సేంద్రియ పదార్థ అవశేషాలకు మూలమైన భూ ఉపరితల భాగాన్నే మృత్తికలు అంటారు. మృత్తికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. సాధారణంగా మృత్తికలు రెండు రకాలుగా ఏర్పడతాయి. మొదటి రకం భూమిలో ఉన్న రాళ్లు వాటిపై ఉన్న వాతావరణ ప్రభావం వల్ల శిథిలమై చివరికి మెత్తని మృత్తికగా ఏర్పడతాయి. వీటిని స్థానబద్ధ మృత్తికలు అంటారు.
ఉదాహరణకు నల్ల మృత్తికలు, ఎర్ర మృత్తికలు
రెండోరకం భూమిపై ఉన్న రాళ్లు వాటిపై ఉన్న వాతావరణ ప్రభావం వల్ల మెత్తని మన్నుగా మారి నీటిలో కలిసి కొట్టుకుని పోయిగాని లేదా ధూళి రూపంలో గాలి ద్వారా కొట్టుకునిపోయిగాని మరోచోట మేట వేసి మృత్తికలుగా మారవచ్చు.
తెలంగాణలో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే నేలలున్నాయి. ఇక్కడ సారవంతమైన ఒండ్రు నేలల నుంచి తక్కువ సారం ఉన్న ఇసుక నేలల వరకు పలు రకాల నేలలను కలిగి ఉంది. ప్రధానంగా ఒండ్రునేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.
నల్లరేగడి నేలలు
అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, సున్నపురాళ్లు, షేల్స్ ల క్రమక్షయంతో ఏర్పడవే నల్లరేగడి నేలలు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఈ మృత్తికల క్షార స్వభావం 7.8 నుంచి 8.7 వరకు ఉంటుంది. నల్లరేగడి నేలలను ‘తనను తాను దున్నుకునే నేలలు’ అంటారు. వీటికే ‘రేగర్ నేలలు’ అని మరో పేరుంది. తెలంగాణలో ఇవి 25శాతం వరకు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో పత్తి, పొగాకు, మిరప, పసుపు, సజ్జ, జొన్న పంటలు అధికంగా పండుతాయి.
ఎర్ర నేలలు
తెలంగాణ అత్యధికంగా విస్తరించి ఉన్న నేలలు ఎర్ర నేలలు. ఇవి దాదాపుగా 48శాతం వరకు విస్తరించి ఉన్నాయి. గ్రానైట్ రాళ్లు రూపాంతరం చెందగా ఇవి ఏర్పడతాయి. వీటి అంతర్నిర్మాణం ఆధారంగా వీటిని రెడ్ లోమ్, రెడ్ ఎర్త్ అని రెండు రకాలుగా వర్గీకరించారు. ఎర్ర నేలల్లో ఫెర్రిక్ ఆక్సైడ్(Feo) కలిగి ఉండటం వల్లే అవి ఎరుపు రంగులో ఉంటాయి. ఎర్ర నేలలను తెలంగాణలో చెల్క, దుబ్బనేలలుగా విభజించారు. ఇవి ఎక్కువగా వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్‍నగర్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
ఈ నేలల్లో ప్రధానంగా పండే పంట – వేరుశెనగ.
ఒండ్రు నేలలు
ఇవి అధికంగా సారవంతమైన నేలలు. ఒండ్రునేలలు ప్రధానంగా నదుల వల్ల కొట్టుకు వచ్చిన లేదా మేట వేసిన మన్ను వలన ఏర్పడుతాయి. ఈ నేలల్లో ఫాస్ఫరస్, పొటాషియం, ఎక్కువగా ఉండి నైట్రోజన్, ఆర్గానిక్ కార్బన్‍లు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి రాష్ట్రంలో 20శాతం వరకు విస్తరించి ఉన్నాయి. అధికంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలో ఉన్నాయి. వరి, చెరుకు, అరటి, మామిడి, నిమ్మ వంటి పంటలకు ఇవి అత్యంత అనుకూలం.
లాటరైట్ నేలలు
ఎక్కువ వర్షపాతం, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం కారణంగా ఇవి ఏర్పడతాయి. ఈ నేలలు తడిసినప్పుడు మెత్తగా ఉండి, ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. అందుకే వీటిని ‘బ్రిక్ సాయిల్’ అంటారు. ఇవి అల్యూమినియం హైడ్రైడ్ ఆక్సైడ్‍ల మిశ్రమంతో ఉంటాయి కావున వీటికి జేగురు నేలలు అని మరో పేరుంది. ఈ నేలల్లో కాఫీ, తేయాకు, రబ్బరు, జీడిమామిడి వంటి పంటలకు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణలో ఇవి సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‍ఖేడ్, జహీరాబాద్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
మృత్తికలు సహజకారకాలైన గాలి, నీరుతో క్రమక్షయం చెందుతాయి. వ్యవసాయ ఉత్పత్తి ఎక్కువగా మృత్తిక క్రమక్షయంపైనే ఆధారపడి ఉంటుంది. అడవులు పెంచడం, ఆనకట్టల నిర్మాణం, వాలు కట్టలను పెంచడం, సాంద్రీకరణ, పంటల మార్పిడి విధానాల ద్వారా క్రమక్షయాన్ని అడ్డుకోవచ్చు.
మృత్తిక సంరక్షణకు తోడ్పడుతున్న జాతీయ సంస్థలు
- నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే, ల్యాండ్ అండ్ ప్లానింగ్ – నాగపూర్
- ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ – భోపాల్
- సెంట్రల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్( వర్షధార పంటల వ్యవసాయ పరిశోధన కేంద్రం) – హైదరాబాద్
- నేషనల్ అకాడమి ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‍మెంట్ సెంటర్ – హైదరాబాద్