వచ్చే ఏడాది కొలువులు భర్తీ చేయడానికి సింగరేణి రెడీ అవుతోంది. 177 జూనియర్ అసిస్టెంట్, 39 మైనింగ్ ఇంజనీర్, 10 ఇండ్రస్టియల్ ఇంజనీర్, 6 ఐటీ ఇంజనీర్‌తో పాటు ఇతర కేటగిరీల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
మొత్తం 16,040 ఉద్యోగాలు
ఏడేళ్ల కాలంలో 58 ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ల ద్వారా 3,498, కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా 12,553 కలిపి మొత్తం 16,040 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సింగరేణి సంస్థ డిసెంబర్ 28న ఒక ప్రకటనలో తెలిపింది. ఒత్తిళ్లతో అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందని ఇంటర్వ్యూ విధానం పూర్తిగా తొలగించి కేవలం రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వివరించింది. రాత పరీక్ష జరిగిన రోజునే ఫలితాలు వెల్లడించి, ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొంది. ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణిలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించి జాబ్ సాధించాలని అధికారులు కోరారు.