ప్రాంతీయం
తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి
తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణలో సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులు సహా పలువురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. ఈ బదిలీలు చేస్తూప్రభుత్వం సెప్టెంబరు 27న ఉత్తర్వులిచ్చింది. శాంతిభద్రతలపరంగా కీలకమైన హైదరాబాద్ నగర కొత్వాల్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆ స్థానంలో వి.సి.సజ్జనార్‌కు బాధ్యతలు అప్పగించింది.
‘చిల్డ్రన్ ఇన్ ఇండియా-2025’ నివేదిక
తెలంగాణలో జనన రేటు 2022తో పోల్చితే 2023 నాటికి 0.7 తగ్గనట్లు కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా-2025’ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం జాతీయ స్థాయి సగటుతో పోల్చితే తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలతోపాటు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లోనూ జననరేటు తక్కువగా ఉంది. 2023 నాటికి రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు జననరేటు 15.8 ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 16.2, పట్టణాల్లో 15.2గా నమోదైంది. అదేసమయంలో జాతీయ స్థాయిలో 2022లో 19.1గా ఉన్న జననరేటు 2023కి 18.4గా నమోదైంది.
ప్రభుత్వం చేతిలోకి మెట్రో రైలు
హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వం చేతిలోకి రానుంది. గత కొన్ని రోజులుగా పలు ప్రత్యామ్నాయాలపై చర్చలు జరగగా సెప్టెంబరు 25న జరిగిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చారు. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి ఎల్ అండ్ టీ తీసుకున్న రూ.13 వేల కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మరో రూ.2 వేల కోట్లను ఎల్ అండ్ టీకి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది.
టీజీపీఎస్సీకి ముగ్గురు సభ్యులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కి మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. దీంతో టీజీపీఎస్సీ బోర్డులో ఛైర్మన్‌తో పాటు మొత్తం సభ్యుల संख्या ఆరుకి చేరింది. కొత్తగా నియమితులైన వారిలో ఐపీఎస్ అధికారి విశ్వప్రసాద్, గ్రూప్-1 సర్వీసు అధికారి (ప్రస్తుతం మహిళా కార్పొరేషన్ ఎండీ) సి.చంద్రకాంత్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ ఉన్నారు.
ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ టాప్
దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్(ఎన్‌ఎంఈవో) పథకం అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2021 నుంచి ఐదేళ్ల కాలానికి కేంద్రం 3.22 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని తొమ్మిది రాష్ట్రాలకు నిర్దేశించింది. అందులో తెలంగాణ 1,25,300 హెక్టార్ల లక్ష్యానికి 78,869 హెక్టార్ల(63%)లో సాగు చేసి ముందు నిలిచింది.
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం
ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని 2025 ఏడాదికి కాళోజీ సాహితీ పురస్కారం వరించింది. రాష్ట్రప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. మనసు భాష, రమణీయం, మనసు మనసుకూ మధ్య, చినుకులు, తల్లివేరు, అశ్రువర్షం, రమాయణం లాంటి అనేక కవితలు, కథలు, నానీలు రాశారు. ‘రమ’ కలం పేరుతో కార్టూన్లు వేస్తారు.
జాతీయం
స్పీడ్ పోస్టులో రిజిస్టర్ పోస్టు విలీనం
బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. వాల్యూయాడెడ్ సర్వీసుగా స్పీడ్ పోస్టు కిందే ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్‌ను రూపొందించింది. ఓటీపీ ఆధారిత డెలివరీ అనే కొత్త సర్వీసును తీసుకొచ్చింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి. రిజిస్టర్ పోస్టులో ఎవరి పేరుతో అయితే మనం పంపామో వారికే పోస్టుమన్ ఉత్తరాన్ని ఇచ్చి సంతకం తీసుకుంటారు.
టాప్ పర్యాటక ప్రాంతంగా తాజ్‌మహల్
దేశంలో అత్యధికులు సందర్శించిన పర్యాటక ప్రాంతంగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ కట్టడాన్ని ఎక్కువ మంది దేశ, విదేశీ పర్యాటకులు సందర్శించారు. దేశంలోని అన్ని పురాతన కట్టడాల కంటే తాజ్‌మహల్ టికెట్లే అధికంగా అమ్ముడు పోయాయని, 62.6 లక్షల మంది స్వదేశీయులు, 6.45 లక్షల మంది విదేశీయులు తాజ్‌మహల్‌ను సందర్శించారని తెలిపింది. తర్వాతి స్థానంలో ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం (35.7 లక్షల మంది స్వదేశీయులు), కుతుబ్ మినార్ (32 లక్షల మంది స్వదేశీయులు) ఉన్నాయి. 2024లో భారతీయులు అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లారు.
ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన
బిహార్ రాష్ట్ర మహిళల అభ్యున్నతికి ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని సెప్టెంబరు 26న ప్రధాని మోదీ దిల్లీ నుంచి ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 75 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బిహార్ ఎన్డీయే సర్కారు రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించింది. ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు జీవనోపాధిలో భాగంగా వారు ఎంచుకున్న రంగంలో ఆర్థికసహాయం అందిస్తారు.
దేశ తొలి స్టార్టప్ డ్యాష్‌బోర్డ్
పరిశ్రమల స్థాపన, స్టార్టప్‌ల (అంకుర సంస్థల) నమోదులో తమిళనాడు మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలో స్టార్టప్‌లను పెంచేందుకు పెట్టుబడుల ఆకర్షణ దిశగా ‘ఇన్నోవేషన్-టీఎన్’ పేరుతో ప్రత్యేక స్టార్టప్ డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ స్టార్టప్ ‘వైనాస్’, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రచారానికి నోడల్ సంస్థగా ఉన్న ‘గైడెన్స్ తమిళనాడు’సంయుక్తంగా దీన్ని రూపొందించాయి.
సెప్టెంబరు 23నే ఆయుర్వేద దినోత్సవం
ఈ ఏడాది నుంచి ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబరు 23న నిర్వహించేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. గెజిట్‌లో ఈ విషయాన్ని ప్రచురించింది. గతంలో దీపావళి ముందు వచ్చే ధన త్రయోదశి (ధన్‌తేరస్) రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించేవారు. దీనివల్ల ఏటా తేదీల్లో మార్పులు రావడంతో ఆయుర్వేద దినోత్సవానికి పెద్దగా ప్రాధాన్యం దక్కడంలేదు. ఈ క్రమంలో నిర్దిష్టంగా ఒకే తేదీన జరపాలని సెప్టెంబరు 23ను నిర్ణయించారు.
ఈసీ జాబితా నుంచి పార్టీల తొలగింపు
ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద పేరు నమోదు చేసుకుని గుర్తింపు పొందని 474 పార్టీలపై వేటుపడింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి ఎనిమిది పార్టీలు ఉన్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం లాంటి కారణాలతో ఇలాంటి పార్టీలను జాబితా నుంచి ఈసీ తొలగించింది. తెలంగాణ నుంచి రద్దయిన పార్టీల లిస్టులో ఆలిండియా ఆజాద్‌పార్టీ, ఆలిండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారతదేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజాపార్టీ, లోక్‌సత్తాపార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి ఉన్నాయి.
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్
దేశంలోని మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘స్వస్థ్ నారీ సశక్త్ పరి-వార్ అభి-యాన్’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. ఇందులో తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణకు కార్డుల జారీ, గర్భిణులకు పరీక్షలు టీకాలు వేయడం, రక్తహీనత, పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నిర్ధారణకు ఉచిత పరీక్షలు చేయనున్నారు.
బీమా సుగమ్ అధికారిక వెబ్‌సైట్
పాలసీదారులు బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా బీమా సుగమ్ అధికారిక వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నేతృత్వంలో బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్‌ఐ) దీన్ని ఆవిష్కరించింది. 2047 నాటికి దేశంలో అందరినీ బీమా పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
పాడి, ఆక్వా రంగాలకూ ఫసల్ బీమా
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)ను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించనుంది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల సమయంలో రైతులకు భరోసా కల్పించడానికి అమలు చేస్తున్న ఈ పథకాన్ని పాడి, ఆక్వారంగాలకూ వర్తింపజేయాలని, కోతల తర్వాత బీమాను కొనసాగించాలని నిర్ణయించింది. ఏటా 4 కోట్ల మంది రైతుల నమోదుతో పీఎంఎఫ్‌బీవై ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకంగా గుర్తింపు పొందింది. ప్రీమియం పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్దది. మొదట్లో తృణ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, వార్షిక వాణిజ్య పంటలకే వర్తించేది. పథకాన్ని పునర్ వ్యవస్థీకరించి వాతావరణ-ఆధారిత పంటల బీమా పథకంగా మార్చాక ఉద్యాన(పండ్లు, కూరగాయలు) పంటలూ చేరాయి.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2025 ర్యాంకింగ్స్
కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2025 ర్యాంకులను విడుదల చేసింది. అత్యుత్తమ పనితీరుతో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విద్యాసంస్థ వరుసగా ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం ఇది ఏడోసారి. ఓవరాల్ కేటగిరీలో ఐఐఎస్‌సీ బెంగళూరు ద్వితీయ స్థానంలో, ఐఐటీ బాంబే తృతీయ, ఐఐటీ దిల్లీ నాలుగో స్థానంలో నిలిచాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో తెలంగాణలోని జేఎన్‌టీయూహెచ్ 81 ర్యాంక్‌లో ఉంది. ఇది తొలిసారిగా 100లోపు స్థానం సంపాదించింది.
అంతర్జాతీయం
ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన చైనాలో సెప్టెంబరు 28న ప్రారంభమైంది. హ్యూజియాంగ్ గ్రాండ్ కాన్యన్ పేరుతో గిజౌ ప్రావిన్సులో నిర్మించిన ఈ వంతెనపై ట్రాఫిక్‌ను అనుమతించారు. దీనివల్ల ప్రయాణికులకు 2 గంటల 2 నిమిషాల సమయం ఆదా కానుంది.ఈ వంతెన నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. నదిపై 625 మీటర్ల (2,051 అడుగులు) ఎత్తున దీనిని నిర్మించారు. దీని మెయిన్ స్పాన్ 1,420 మీటర్లుంది. ఇది పర్వతాల మధ్యన నిర్మించిన అతి పెద్ద స్పాన్.
ఔషధాలపై 100 శాతం దిగుమతి పన్ను
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై 100%; వంటగదిలో బిగించే అరలు వంటివాటిపై (కిచెన్ క్యాబినెట్లపై).. స్నానపుగదుల్లో సమకూర్చే హంగులపై 50% చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు. ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25% పన్ను పడుతుందని, ఇవన్నీ అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’ ద్వారా ప్రకటించారు.
పాలస్తీనాకు ఫ్రాన్స్ గుర్తింపు
పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నామని ఫ్రాన్స్ ప్రకటించింది. సౌదీ అరేబియాతో కలిసి ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ సమయంలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. మరోవైపు ఇదే వేదిక పైనుంచి పాలస్తీనాను గుర్తిస్తున్నామని బెల్జియం, లక్జెంబర్గ్, మాల్టా, శాన్ మారినో, అండోరా దేశాల నేతలు ప్రకటించారు. ఇంతకుముందే బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్ దేశాలు.. పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి.
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా జస్టిస్ సుశీలా కార్కీ
నేపాల్ తాత్కాలిక ప్రధాని మంత్రిగా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కీ నియమితులయ్యారు. ప్రధానిగా ఆమెను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు. మహిళలెవరూ ఇంతవరకు నేపాల్‌కు ప్రధానిగా లేరు. ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి, ఏకైక మహిళగానూ జస్టిస్ సుశీల నిలిచారు.
ఫ్రాన్స్ తదుపరి ప్రధానిగా లొకోర్ను
ఫ్రాన్స్ తదుపరి ప్రధానిగా ఆ దేశ రక్షణ మంత్రి సెబాస్టియన్ లొకోర్ను నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మెక్రాన్ ప్రకటించారు. 39 ఏళ్ల లొకోర్ను ఫ్రాన్స్ చరిత్రలో అతి చిన్న వయసు కలిగిన రక్షణ మంత్రిగా గుర్తింపు పొందారు. గతంలో కన్సర్వేటివ్ పార్టీలో పనిచేసిన లొకోర్ను 2017లో మెక్రాన్ బృందంలో చేరారు.
జపాన్ ప్రధాని రాజీనామా
జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు 2025, సెప్టెంబరు 7న ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2024లో ఫుమియో కిషిద రాజీనామా తర్వాత అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ఇషిబా.. అక్టోబరులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. జులైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువ సభలో ఇషిబా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మెజార్టీ సాధించలేకపోయింది. 2024 అక్టోబరులో జరిగిన దిగువసభ ఎన్నికల్లోనూ ఈ కూటమి ఓటమి పాలైంది. 1955లో స్థాపించిన ఎల్‌డీపీ రెండు సభల్లోనూ మెజార్టీ కోల్పోవడం ఇదే తొలిసారి.
థాయ్‌లాండ్ కొత్త ప్రధానిగా అనుతిన్
థాయ్‌లాండ్ పార్లమెంటు అనుతిన్ చర్న్‌విరకుల్‌ను దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. గత రెండేళ్లలో థాయ్ ప్రధానిగా ఎన్నికైన మూడో వ్యక్తి ఆయన. గత ప్రధాని పేతోంగ్‌తార్న్ షినవత్రాను పదవి నుంచి రాజ్యాంగ న్యాయస్థానం తొలగించిన నేపథ్యంలో నూతన ప్రధానమంత్రి ఎన్నిక జరిగింది. 492 మంది సభ్యులుండే ప్రజాప్రతినిధుల సభలో భూమిజైతై పార్టీ నాయకుడైన అనుతిన్ 247 ఓట్లు సాధించారు. నాలుగు నెలల్లో పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలు నిర్వహిస్తానన్న షరతుపై ఆయనకు పీపుల్స్ పార్టీ మద్దతు తెలిపింది. ఆయన గతంలో రెండుసార్లు ప్రభుత్వంలో పనిచేశారు.
వార్తల్లో వ్యక్తులు
మిథున్ మన్హాస్
డిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ఏకగ్రీవంగా బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడు. రోజర్ బిన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడింది. మన్హాస్ అధ్యక్షుడు కానున్న విషయాన్ని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించాడు. మన్హాస్ దిల్లీ తరఫున 157 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 130 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగాడు. జమ్ముకశ్మీర్ క్రికెట్ సంఘంలో పాలకుడిగా పనిచేశాడు. అతను భారత జట్టు తరఫున ఎప్పుడూ ఆడలేదు.
ప్రపంచ నంబర్‌వన్‌గా వరుణ్ చక్రవర్తి
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మేటి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు. రవి బిష్ణోయ్ 8వ, అక్షర్ పటేల్ 12వ, అర్ష్‌దీప్‌సింగ్ 14వ, కుల్దీప్ యాదవ్ 23వ స్థానాల్లో ఉన్నారు. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న భారత మూడో బౌలర్ వరుణ్. బ్యాటర్లలో అభిషేక్‌శర్మ నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్య నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ 12 స్థానంలో ఉన్నాడు.
ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా నారా దేవాంశ్
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాంశ్ ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్’ పురస్కారం అందుకున్నారు. చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్‌లో పురస్కార ప్రదానం జరిగింది. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది దేవాంశ్ వేగంగా పరిష్కరించి ఈ రికార్డు సొంతం చేసుకున్నారు.
ఉపష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతులుగా బాధ్యతలు స్వీకరించిన 15 మందిలో 11 మంది రాజకీయవేత్తలు. మిగతా నలుగురిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, విద్యావేత్తలు, దౌత్యవేత్తలకు చోటుదక్కినట్లయింది. ఇందులో తమిళనాడు నుంచి ముగ్గురు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల నుంచి ఇద్దరు చొప్పున, యూపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక, పంజాబ్‌ల నుంచి ఒకరు చొప్పున ఉన్నారు. రాధాకృష్ణన్ పదవీకాలం 2030 సెప్టెంబరు 11 వరకు ఉంటుంది.
ఏఐఎంఏ ప్రెసిడెంట్‌గా నరేంద్రన్
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ప్రెసిడెంట్‌గా టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా ఉన్న అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ ఎండీ సునీతా రెడ్డి ఏడాది కాలం పూర్తవ్వడం ఇందుకు నేపథ్యం. నరేంద్రన్ 2026 సెప్టెంబరు వరకు ఈ పదవిలో కొనసాగుతారని ఏఐఎంఏ తెలిపింది. నరేంద్రన్ టాటా గ్రూప్‌లో 36 ఏళ్లకు పైగా పని చేస్తున్నారు. మైనింగ్, లోహ పరిశ్రమల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
అటార్నీ జనరల్‌గా వెంకటరమణి పునర్నియామకం
భారత అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణి తిరిగి నియమితులయ్యారు. దీంతో సెప్టెంబరు 30న ముగియాల్సిన ఆయన పదవీకాలం మరో రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆయన 2022లో కె.కె.వేణుగోపాల్ స్థానంలో అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. 1950 ఏప్రిల్ 13న పుదుచ్చేరిలో జన్మించిన వెంకటరమణి 1977లో న్యాయవాదిగా తమిళనాడు బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 1979లో తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. 1997లో ఆయనకు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేటుగా గుర్తింపునిచ్చింది. వెంకటరమణి 2010 నుంచి 2013 వరకూ లా కమిషన్ సభ్యునిగా పనిచేశారు.
టి-మొబైల్ సీఈఓగా శ్రీని గోపాలన్
అమెరికాకు చెందిన టెలికాం నెట్‌వర్క్ సంస్థ టి-మొబైల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా భారతీయ మూలాలున్న అమెరికన్ శ్రీని గోపాలన్ నియమితులయ్యారు. 2025 నవంబరు 1 నుంచి గోపాలన్ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా గోపాలన్ ఉన్నారు. 2020 నుంచీ సీఈఓగా ఉన్న మైక్ సీవర్ట్ స్థానంలో శ్రీని పగ్గాలు చేపడతారు.
కోల్ ఇండియా సీఎండీగా సాయిరాం
తెలుగుతేజం సాయిరాం బొగ్గు రంగంలో ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా సీఎండీగా ఎంపికయ్యారు. వైజాగ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ సంస్థకు సీఎండీగా పనిచేస్తున్నారు. కోల్ ఇండియా సీఎండీ పదవి భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల బోర్డు మౌఖిక పరీక్షల్లో సాయిరాంను ఎంపిక చేసింది. ఈ పదవి కోసం దేశవ్యాప్తంగా 11 కీలక సంస్థల సీఎండీలు, డైరెక్టర్లు పోటీపడగా సాయిరాం మౌఖిక పరీక్షల్లో నెగ్గినట్లు బోర్డు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వానికి ఆయన పేరును సిఫార్సు చేసినట్లు తెలిపింది.
ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా అమిత్ ఖరే
నూతన ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు కార్యదర్శిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే సెప్టెంబరు 14న నియమితులయ్యారు. మూడేళ్ల ఒప్పంద ప్రాతిపాదికన ఈ పదవిలో కార్యదర్శి స్థాయిలో ఆయన కొనసాగనున్నారు. ఖరే 1985 బ్యాచ్ ఝార్ఖండ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పలు కీలక హోదాల్లో పనిచేశారు. 2021 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో సామాజిక రంగ సలహాదారుగా ఉన్నారు.
ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌గా ఇంజేటి శ్రీనివాస్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఇంజేటి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఒడిశా క్యాడర్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీనివాస్ గతంలో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి, క్రీడా విభాగ కార్యదర్శి, గిఫ్ట్‌సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ)కి తొలి ఛైర్‌పర్సన్ లాంటి పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
స్పోర్ట్స్
టీమ్‌ఇండియాదే తొమ్మిదో ఆసియా కప్
టీమ్‌ఇండియా తొమ్మిదోసారి ఆసియా కప్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. 1984లో తొలి ఆసియాకప్‌లో విజేతగా నిలిచిన భారత్ తర్వాత 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023, 2025లో కప్ నెగ్గింది. ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా.. ట్రోఫీని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025
ప్రపంచ పారా ఆర్చరీలో శీతల్ దేవి స్వర్ణంతో సహా మూడు పతకాలు సొంతం చేసుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన ఆమె.. మహిళల టీమ్ ఈవెంట్లో సరిత తోడుగా రజతం.. మిక్స్‌డ్ విభాగంలో తోమన్‌తో కలిసి కాంస్యం గెలుచుకుంది. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన అథ్లెట్ దీప్తి రజతంతో మెరిసింది. రెండు చేతులు లేకపోయినా వ్యక్తిగత పసిడి గెలుచుకున్న తొలి మహిళ ఆర్చర్‌గా శీతల్ రికార్డు సృష్టించింది. పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో తోమన్ కుమార్ విజేతగా నిలిచాడు. భారత్‌కే చెందిన రాకేశ్‌కుమార్ సాంకేతిక కారణాలతో ఫైనల్ నుంచి అర్ధంతరంగా వైదొలగడంతో స్వర్ణం తోమన్ సొంతమైంది.
జీవాంజి దీప్తికి మరో పతకం
తెలుగమ్మాయి జీవాంజి దీప్తి మరోసారి ప్రపంచ వేదికపై సత్తాచాటింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండో పతకం అందుకుంది. గత ఏడాది జపాన్‌లోని కోబెలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన దీప్తి.. ఈసారి దిల్లీలో మొదలైన ఈ మెగా ఈవెంట్లో రజతం సాధించింది. ఆమె టీ20 విభాగం 400 మీటర్ల పరుగులో 55.16 సెకన్లలో లక్ష్యానికి చేరుకుని రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో దీప్తికిదే ఉత్తమ ప్రదర్శన. తుర్కియే అథ్లెట్ ఐసిల్ ఓండెర్ 54.51 సెకన్లతో తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు (54.96 సె)ను బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది.
హైజంప్‌లో రికార్డు సృష్టించిన శైలేష్
హైజంపర్ శైలేష్ ప్రపంచ అథ్లెటిక్స్ తొలి రోజే గోల్డ్ మెడల్ సాధించాడు. 2023 పారా ఆసియా గేమ్స్ ఛాంపియన్ అయిన శైలేష్.. తన తొలి ప్రపంచ అథ్లెటిక్స్‌లోనే ఛాంపియన్‌షిప్ రికార్డుతో పసిడి నెగ్గాడు. టీ63 విభాగంలో శైలేష్ కుమార్ 1.91 మీటర్ల దూరం ఎగిరి స్వర్ణం సాధించాడు. ఈ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు ఒలింపిక్ స్వర్ణం కూడా నెగ్గిన ఎజ్రా ఫ్రెచ్ (అమెరికా)కు శైలేష్ షాకిచ్చాడు.
బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా గంగూలీ
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా అతడు తిరిగి బాధ్యతలు స్వీకరించాడు. వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సెప్టెంబరు 22న గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గతంలో అతడు 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2019 నుంచి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు.
భారత జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్
భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ ఎంపికైంది. ఆన్‌లైన్ గేమింగ్ నిరోధక చట్టం నేపథ్యంలో జెర్సీ స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్11 వైదొలిగింది. కొత్త స్పాన్సర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ, రూ.579 కోట్లతో అపోలో టైర్స్‌తో ఒప్పందం చేసుకుంది. డ్రీమ్11తో ఒప్పందం (రూ.358 కోట్లు) కంటే ఇది చాలా ఎక్కువ. 2028 మార్చి వరకు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ కాలంలో 121 ద్వైపాక్షిక, 21 ఐసీసీ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు అపోలో టైర్స్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.
స్విస్ గ్రాండ్ టైటిల్
భారత చెస్ స్టార్ వైశాలి ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2025, సెప్టెంబరు 15న సమర్‌కండ్ (ఉజ్బెకిస్థాన్)లో జరిగిన మ్యాచ్‌లో తాన్ జ్యోంగి (చైనా)తో ఆఖరిదైన 11వ రౌండ్‌ను డ్రాగా ముగించిన వైశాలి 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె వరుసగా రెండో ఏడాది స్విస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది.
ఆర్మాండ్ డుప్లాంటిస్ వరల్డ్ రికార్డు
పోల్ వాల్ట్ సూపర్ స్టార్ ఆర్మాండ్ డుప్లాంటిస్ (డెన్మార్క్) ప్రపంచ పోల్ వాల్ట్‌లో మరో రికార్డు సృష్టించాడు. 2025, సెప్టెంబరు 15న టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతడు విజేతగా నిలిచాడు. 6.30 మీటర్లతో 14వ సారి రికార్డు బద్దలు కొట్టిన డుప్లాంటిస్ తన కెరీర్‌లో మూడోసారి ప్రపంచ టైటిల్ సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్‌లో వరుసగా ఇది 49వ మీట్ విజయం కాగా.. ఒలింపిక్స్‌తో కలుపుకుంటే వరుసగా అయిదో మేజర్ టైటిల్.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీనాక్షి, జైస్మీన్ పసిడి పతకాలు నెగ్గారు. 2025, సెప్టెంబరు 14న లివర్‌పుల్‌లో జరిగిన 57 కేజీల తుదిపోరులో జైస్మీన్ 4-1తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత జూలియా జెరెమెటా (పోలెండ్)ను ఓడించింది. 48 కేజీల ఫైనల్లో మీనాక్షి 4-1తో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ నజమ్ కిజైబి (కజకిస్థాన్)పై నెగ్గింది.
యుఎస్ ఓపెన్
స్పెయిన్‌కి చెందిన కార్లోస్ అల్కరాస్ యుఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచాడు. యుఎస్ ఓపెన్ గెలిచే సమయానికి అల్కరాస్ వయసు 22 ఏళ్ల 125 రోజులు. అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు అతడు. జాన్ బోర్గ్ (22 ఏళ్ల 32 రోజులు) ముందున్నాడు. పిన్న వయసులో మూడు భిన్న గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచిన ఆటగాడు అల్కరాసే. మాట్స్ విలాండర్ (24 ఏళ్ల 6 రోజులు) రికార్డును అధిగమించాడు. అల్కరాస్ ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవలేదు. యుఎస్ ఓపెన్ గెలిచిన అల్కరాస్ రూ.44 కోట్లు ప్రైజ్‌మనీగా అందుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన సినర్‌కు రూ.27 కోట్ల 99 లక్షలు లభించాయి.అల్కరాస్, సినర్ గత ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను పంచుకున్నారు.
ఆసియాకప్ హాకీ విజేత భారత్
భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. బిహార్‌లో జరిగిన ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై నెగ్గింది. ఈ టైటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన 2026 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించింది. భారత్‌కు ఇది నాలుగో ఆసియాకప్ టైటిల్. ఆ జట్టు ఇంతకుముందు 2003, 2007, 2017లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. దక్షిణ కొరియా ఈ టైటిల్‌ను అయిదుసార్లు (1994, 1999, 2009, 2013, 2022) సొంతం చేసుకుంది. వచ్చే హాకీ ప్రపంచకప్ 2026 ఆగస్టు 14 నుంచి 30 వరకు జరుగుతుంది.
యుఎస్ ఓపెన్ ఛాంపియన్‌షిప్
డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకా మరోసారి యుఎస్ ఓపెన్ ఛాంపియన్ అయింది. న్యూయార్క్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) ఎనిమిదో సీడ్ అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను గ్రానోలర్స్ (స్పెయిన్)-జెబాలాస్ (అర్జెంటీనా) జంట గెలుచుకుంది.
క్రికెట్‌కు అమిత్ మిశ్రా వీడ్కోలు
భారత క్రికెట్లో మేటి స్పిన్నర్ అమిత్ మిశ్రా 42 ఏళ్ల వయసులో క్రికెట్లో తన ఇన్నింగ్స్‌ను ముగించాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. చివరగా 2017లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మిశ్రా.. 2024 వరకు ఐపీఎల్‌లో కొనసాగాడు. టీమ్‌ఇండియా తరఫున 22 టెస్టులు ఆడిన మిశ్రా 76 వికెట్లు పడగొట్టాడు. 36 వన్డేల్లో 64 వికెట్లు పడగొట్టాడు. అతడు 10 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. 2003లో వన్డే అరంగేట్రం చేసిన మిశ్రా.. 2008లో తొలి టెస్టు ఆడాడు. సొంతగడ్డపై కుంబ్లే, హర్భజన్‌లే ఎక్కువగా ఆడడంతో టెస్టు అరంగేట్రం కోసం మిశ్రా నిరీక్షించాల్సివచ్చింది. క్రికెట్ నుంచి రిటైరైనా కోచింగ్, వ్యాఖ్యానం ద్వారా ఆటతో అనుబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు మిశ్రా తెలిపాడు.
మహిళల ప్రపంచకప్ విజేతకు రూ.39.55 కోట్లు
మహిళల వన్డే ప్రపంచకప్ విజేతకు రూ.39.55 కోట్ల భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. కప్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం నగదు బహుమతిగా ఇవ్వనుండడం ఇదే తొలిసారి. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్ సెప్టెంబరు 30న ఆరంభమైంది. గత టోర్నీ (2022) ఛాంపియన్ (రూ.11.65 కోట్లు)కు లభించిన మొత్తంతో పోలిస్తే ఇది మూడు రెట్ల కంటే ఎక్కువ. ప్రస్తుత కప్‌లో రన్నరప్‌గా నిలిచే జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. 2022 మహిళల ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ.30.79 కోట్లే. 2023 పురుషుల వన్డే ప్రపంచకప్ విజేతకు ఇచ్చిన ప్రైజ్‌మనీ రూ.35 కోట్లు.
ఢిల్లీలో 2026 ప్రపంచ బ్యాడ్మింటన్
2026లో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. 2025లో పారిస్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఆగస్టు 31న ముగిసింది. ఆ వెంటనే బీడబ్ల్యూఎఫ్ తర్వాతి టోర్నీకి దిల్లీని వేదికగా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. భారత్ చివరగా 2009లో ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడు హైదరాబాద్‌లో ఇది జరిగింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్ ఇప్పటివరకు 15 పతకాలు సాధించింది. అందులో సింధు గెలిచినవే అయిదు. ఆమె ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. సైనా నెహ్వాల్ రెండు కాంస్యాలు గెలుచుకుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
మిగ్-21 యుద్ధ విమానానికి వీడ్కోలు
ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతలాన్ని శాసించిన దిగ్గజ యుద్ధవిమానం మిగ్-21కు 2025, సెప్టెంబరు 26న వైమానిక దళం నుంచి వీడ్కోలు పలికారు. చండీగఢ్‌లో జరిగిన వేడుకలో ఈ ఫైటర్ జెట్‌లను లాంఛనంగా వాయుసేన నుంచి ఉపసంహరించారు. వాటి స్థానాన్ని దేశీయ తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్-21 భారత తొలి సూపర్‌సోనిక్ యుద్ధవిమానం. 1963లో తొలి మిగ్-21 స్క్వాడ్రన్ ఏర్పాటైన చండీగఢ్‌లోనే తాజాగా వీటికి వీడ్కోలు పలికారు.
అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా ‘అగ్ని ప్రైమ్’ క్షిపణిని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. రైలుపై ఈ తరహాలో క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైల్వే వ్యవస్థ ద్వారా ఎక్కడికైనా క్షిపణిని సులభంగా తరలించే వీలుంది. అతి తక్కువ వెలుతురులోనూ, అతి స్వల్ప సమయంలోనూ ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు.
తేజస్ యుద్ధ విమానాలు
తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన (ఎల్‌సీఏ) తేజస్‌లను కొనుగోలు చేసేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.62,370 కోట్లు. ఒప్పందంలో భాగంగా మొత్తం 97 ఎంకే1ఏ విమానాలను హెచ్‌ఏఎల్ అందించనుంది. ఇందులో ఫైటర్ జెట్లు 68, శిక్షణకు వినియోగించే రెండు సీట్ల విమానాలు 29 ఉన్నాయి. 2027-28 నుంచి ఈ విమానాల అందజేత ప్రారంభమవుతుంది. ఆరేళ్లలో అన్ని విమానాలు భారత సైన్యానికి అందుతాయి.సెప్టెంబరు 26 నుంచి నిష్క్రమించనున్న మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో వీటిని సైన్యం వినియోగించనుంది.
నేవీ శిక్షణకు సిమ్యులేటర్
నేవీ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ (ఎఫ్‌ఏసీ) సిమ్యులేటర్‌ను విడుదల చేసినట్లు జెన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ తెలిపింది. ఓడల నిర్వహణ, నావిగేషన్, పోరాట వ్యూహాలు, రిమోట్ ఆయుధ అనుసంధానం లాంటివన్నీ ఈ సిమ్యులేటర్ అందిస్తుంది.నౌకాదళ శిక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎఫ్‌ఏసీ సిమ్యులేటర్ తోడ్పడుతుందని జెన్ టెక్నాలజీస్ ఛైర్మన్, ఎండీ అశోక్ అట్లూరి పేర్కొన్నారు.
పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక తాజాగా సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి.. గంటకు 6,87,000 కి.మీ. వేగంతో పయనించింది. ఇంత వేగంతో ప్రయాణిస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవడానికి 19 సెకన్లు మాత్రమే పడుతుంది. పార్కర్ సోలార్ ప్రోబ్ ఇప్పటికే మూడుసార్లు ఈ వేగాన్ని సాధించింది. సూర్యుడికి చేరువయ్యే క్రమంలో ఎదురైన తీవ్రస్థాయి గురుత్వాకర్షణ బలం వల్ల ఇది సాధ్యమైంది. 2018లో నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్.. కక్ష్యలో పరిభ్రమిస్తూ పలుమార్లు భానుడి సమీపంలోకి వెళుతోంది. తద్వారా వ్యోమగాములు, ఉపగ్రహాలు, విద్యుత్ గ్రిడ్‌కు హానికలిగించే సౌర గాలులు, జ్వాలలు, తుపాన్లపై కీలక వివరాలను సేకరిస్తోంది. పార్కర్ ప్రోబ్ అందించే డేటా.. అంతరిక్ష వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు చేయడానికి ఉపయోగపడుతుంది.
నేవీ చేతికి ఆండ్రోత్ యుద్ధనౌక
తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక అండ్రోత్ సెప్టెంబరు 13న నౌకాదళం చేతికి అందింది. కోల్‌కతాలోని ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) దీన్ని రూపొందించింది. ఈ శ్రేణిలో ఇది రెండో యుద్ధనౌక. మొదటిది ఐఎన్‌ఎస్ అర్నాలా. అది జూన్ 18న లాంఛనంగా భారత నౌకాదళంలో చేరింది. లక్షదీవుల్లోని అండ్రోత్ అనే దీవి పేరును రెండో యుద్ధనౌకకు ఖరారు చేశారు.
ఆత్మహత్యల నివారణకు ఏఐ యాప్
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఢిల్లీ-ఎయిమ్స్ కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత యాప్‌ను సెప్టెంబరు 10న ఆవిష్కరించింది. ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం నేపథ్యంలో ‘నెవర్ ఎలోన్’ పేరిట దీనిని ప్రారంభించింది. దీని సహాయంతో కళాశాల, యూనివర్సిటీ విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని గమనిస్తూ వారిలో ఆత్మహత్య ఆలోచనలను గుర్తించొచ్చని మానసిక విభాగం ప్రొఫెసర్ డాక్టర్ నందకుమార్ వెల్లడించారు.





