బ్యాంకింగ్ రంగంలో.. స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా.. ఉన్న 1,500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జూన్ 18 నుంచి జులై 8 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్:
ఈసారి మొత్తం 1,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 1,446 రెగ్యులర్ పోస్టులు కాగా.. 54 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా చూస్తే జనరల్ కేటగిరీకి 588, ఓబీసీకి 390, ఎస్సీకి 234, ఎస్టీకి 144, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 144 పోస్టులను కేటాయించారు.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే.. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రొవిజనల్‌గా అప్లై చేసుకోవచ్చు. కానీ.. వారు సెప్టెంబర్ 30, 2026 నాటికి డిగ్రీ పాసైనట్లు సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది.
వయోపరిమితి:
వయస్సు విషయానికి వస్తే.. ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే.. అభ్యర్థులు ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2005 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
ఎస్‌బీఐ పీఓ ఉద్యోగానికి ఎంపికైతే.. ప్రారంభ బేసిక్ పే రూ. 48,480 గా ఉంటుంది. అన్ని రకాల అలవెన్సులు కలుపుకుని ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఏడాదికి సుమారు రూ. 21.97 లక్షల ప్యాకేజీ లభిస్తుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష, రెండో దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షల్లో పాసైన వారికి మూడో దశలో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ ఉంటాయి. డిసెంబర్ కల్లా ఫైనల్ రిజల్ట్స్ వచ్చేస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 750 కాగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం:
అర్హత ఉన్నవారు జూలై 8 లోపు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో.. మాత్రమే అప్లై చేసుకోవాలి.





