రైల్వే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రతిష్టాత్మక నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC)అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) తేదీలను రీషెడ్యూల్ చేసింది. ఈ నెలలో జరగాల్సిన పరీక్షల తేదీలలో బోర్డు కీలక మార్పులు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పరీక్షల రీషెడ్యూల్ వివరాలతో పాటు అడ్మిట్ కార్డులు, సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల డౌన్‌లోడ్, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల రీషెడ్యూల్ :
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC – CEN 07/2025) విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) మే 7, 8, 9 తేదీల్లో ఇప్పటికే విజయవంతంగా నిర్వహించగా.. జూన్ 13, 14 , జూన్ 16 నుంచి 20 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలలో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలను జూన్ 13 నుంచి జూన్ 20 వరకు వరుసగా నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
సిటీ ఇంటిమేషన్ స్లిప్ లింక్‌ను పరీక్షకు పది రోజుల ముందు, పరీక్ష రాయడానికి అవసరమైన అడ్మిట్ కార్డులు, పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు.
మొత్తం పోస్టులు, ఎంపిక విధానం:ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖ మొత్తం 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనుంది. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు..
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,424 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163 పోస్టులు
ట్రైన్స్ క్లర్క్: 77 పోస్టులు
ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో సాగుతుంది. మొదట స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు (CBT) నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి పోస్టుల ప్రాధాన్యతను బట్టి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత తుది ఎంపిక కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.





