జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అక్టోబరులో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయనుంది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో వివరాలు పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో నాలుగు విద్యుత్ సంస్థల్లో 3 వేలకు పైగా ఖాళీలున్నట్లు తేలింది. వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చని అంచనా. ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీచేసే అవకాశాలున్నాయని అధికారులు చెపుతున్నారు. ఒక్కో క్యాడర్ వారీగా వివరాలను సంస్థల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ట్రాన్స్‌కోలలో పెద్దఎత్తున పదోన్నతులిచ్చారు. జెన్‌కోలో ఇంకా మరికొందరికి ఇవ్వనున్నారు. ఈ పదోన్నతులతో కిందిస్థాయిలో 3 వేలకు పైగా ఖాళీలు ఏర్పడతాయని తేలింది.
లైన్‌మెన్, ఏఈ, ఎస్ఈ పోస్టులు భర్తీ
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. డిస్కంలలో కిందిస్థాయిలో అసిస్టెంటు లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, సబ్ ఇంజినీరు, సహాయ ఇంజినీరుతోపాటు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కోలలో సహాయ ఇంజినీరు పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది.