సివిల్స్ ప్రిలిమ్స్ లో పాసైన తెలంగాణ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందుకోవాలంటే.. వెంటనే అప్లై చేసుకోవాలి. ఈ పథకం ద్వారా ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కంపెనీ అధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అప్లికేషన్లకు జులై 7వ తేదీ వరకు తుది గడువుంది.
దేశంలోనే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని చేపట్టింది. ఇటీవల సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయిన తెలంగాణ అభ్యర్థులందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ పథకం ద్వారా సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు.
గత ఏడాది 140 మంది ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులు ఈ అభయహస్తం సాయం అందుకున్నారు. వీరిలో 20 మంది మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి మరో లక్ష రూపాయల సాయం కూడా అందించామని, వారిలో ఏడుగురు సివిల్స్ లో సత్తా చాటినట్లు సింగరేణి సీఎండీ బలరాం ప్రకటించారు.
ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్ సైట్ www.scclmines.com ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.