హైదరాబాద్‌లోని పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU),బైపీసీ (Bi.P.C) పూర్తి చేసిన విద్యార్థుల కోసం 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక యూజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేష్ విడుదల చేసింది. పశువైద్య, మత్స్య రంగాల్లో కెరీర్ ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET-2026) ర్యాంకు ఆధారంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 31 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు:
యూనివర్సిటీ పరిధిలో ప్రధానంగా రెండు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
బి.వి.ఎస్.సి & ఏహెచ్ (B.V.Sc. & A.H):
కోర్సు సమయం: ఐదున్నర సంవత్సరాలు.
అందుబాటులో ఉన్న కాలేజీలు: రాజేంద్రనగర్ (హైదరాబాద్), కోరుట్ల (జగిత్యాల), మామ్నూర్ (వరంగల్).
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ (B.F.Sc):
కోర్సు సమయం: 4 సంవత్సరాలు.
అందుబాటులో ఉన్న కాలేజీ: కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, పెబ్బేరు (వనపర్తి జిల్లా).
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు ఇంటర్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి.
కనీస మార్కులు: జనరల్ అభ్యర్థులకు ఈ నాలుగు సబ్జెక్టుల్లో కలిపి కనీసం 50% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగ (PwD)అభ్యర్థులకు 47.5% మార్కులు ఉంటే.. సరిపోతుంది.
వయోపరిమితి: ప్రస్తుత సంవత్సరం డిసెంబర్ 31 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఎంపిక విధానం,రిజర్వేషన్లు:
ప్రవేశాలను పూర్తిగా TG EAPCET-2026 స్టేట్ ర్యాంక్, అభ్యర్థుల రిజర్వేషన్, స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. అలాగే.. ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోసం 15% అఖిల భారత కోటా సీట్లు అందుబాటులో ఉంటాయి.
అప్లికేషన్ ప్రక్రియ & ఫీజు:
అర్హులైన అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ pvnrtvu.tgonline.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 3,000 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 1,500 గా నిర్ణయించారు.
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: జులై 31.





