కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువత కోసం ‘పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్’ను ప్రారంభించింది. ఈ పథకం కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో 21 నుంచి 24 ఏళ్లలోపు యువతకు ఇంటర్న్‌షిప్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం రూ.800 కోట్లు కేటాయించారు. ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ పథకం దేశంలో ఉపాధిపై దృష్టి సారించే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా పనిచేస్తుంది. ఇంటర్న్‌షిప్ 12 నెలల పాటు ఉంటుంది.
అర్హత: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు హైస్కూల్, హయ్యర్ సెకండరీ స్కూల్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్, డిప్లొమా లేదా పాలిటెక్నిక్ ఉండాలి. BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. భారత పౌరుడిగా ఉండటం తప్పనిసరి. ఉద్యోగం లేని వారే అర్హులు. అభ్యర్థి వయస్సు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ప్రతి నెలా రూ.5000 చొప్పున 12 నెలల పాటు ఈ సాయం అందిస్తారు. ఇందులో ప్రభుత్వం రూ.4500, కంపెనీ తన సీఎస్‌ఆర్ ఫండ్ నుంచి రూ.500 ఇస్తుంది.
అప్లికేషన్ ప్రాసెస్: అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 25 వరకు అప్లై చేయాలి. దరఖాస్తుదారులను అక్టోబర్ 26న ఎంపిక చేస్తారు. కంపెనీలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తాయి. పూర్తి వివరాలకు www.pminternship.mca.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.