ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గత నోటిఫికేషన్ ప్రకారం జూన్ 29వ తేదీ వరకు మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ..అభ్యర్థుల అభ్యర్థన మేరకు యూనివర్సిటీ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ గడువును మరికొన్ని రోజులు పొడిగించింది. ఈ సీట్లను TG-POLYCET 2026 ర్యాంక్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. కాగా జులై 21వ తేదీ వరకు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
కోర్సులు & సీట్ల వివరాలు:
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (2ఏళ్లు): మొత్తం సీట్లు – 515 (యూనివర్సిటీ పాలిటెక్నిక్ లలోనే 150 సీట్లు ఉన్నాయి).
డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (3 ఏళ్లు): మొత్తం సీట్లు-66 (యూనివర్సిటీలో 36, అఫిలియేటెడ్ కాలేజీల్లో 30 సీట్లు ఉన్నాయి).
ఎవరెవరు అర్హులు?
1.అభ్యర్థులు తప్పనిసరిగా TG-POLYCET 2026 ఎగ్జామ్‌లో ఎంబీపీసీ (MBBiPC) స్ట్రీమ్‌లో హాజరై ఉండాలి.
2.సైన్స్ సబ్జెక్టులతో పాటు టెన్త్ లేదా దానికి సమానమైన బోర్డు పరీక్షల్లో కనీసం 25% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
3.వయోపరిమితి విషయానికి వస్తే 31 డిసెంబర్ 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్లు:
గ్రామీణ ప్రాంతాలు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఈ అడ్మిషన్లలో భారీ ప్రాధాన్యత ఉంది. మొత్తం సీట్లలో 80% సీట్లు రూరల్/గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకే కేటాయించారు. అలాగే మహిళలకు ప్రతి కోర్సులో 33% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీకి 10% సూపరన్యూమరరీ సీట్లతో పాటు దివ్యాంగులు, NCC, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఎస్సీ /ఎస్టీ/దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు రూ. 600 కాగా.. జనరల్,ఇతర అభ్యర్థులు రూ. 1,300 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 30వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: జులై 21 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు PJTAU అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, తమ సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేసి అప్లై చేసుకోవచ్చు.





