అగ్రికల్చర్ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)గుడ్ న్యూస్ అందించింది . 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీ పాలిసెట్-2026 (TG-POLYCET) ఎంబైపీసీ (MBIPC) స్ట్రీమ్ ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవచ్చు. ఈ అడ్మిషన్లకు సంబంధించిన మొత్తం సీట్లు, అర్హతల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కోర్సులు – సీట్ల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ, దాని అనుబంధ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 580 సీట్లను భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా సీట్ల వివరాలు..
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్ల కోర్సు): ఇందులో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీల్లో 350 సీట్లు, అనుబంధ (అఫిలియేటెడ్) పాలిటెక్నిక్ కాలేజీల్లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్ల కోర్సు): ఇందులో మొత్తం 50 సీట్లు ఉన్నాయి. యూనివర్సిటీ పాలిటెక్నిక్ పరిధిలో 20 సీట్లు, అనుబంధ కాలేజీల్లో 30 సీట్లు కేటాయించారు.
అర్హతలు, వయోపరిమితి:
ఈ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఖచ్చితంగా టీజీ పాలిసెట్-2026 పరీక్షలో ఎంబైపీసీ (MBIPC) స్ట్రీమ్‌లో హాజరై, ర్యాంకు సాధించి ఉండాలి. దాంతో పాటు తెలంగాణ టెన్త్ (SSC) లేదా సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, నియోస్, టాస్ వంటి తత్సమాన బోర్డుల పరీక్షల్లో సైన్స్ ఒక సబ్జెక్టుగా ఉండి, కనీసం 35% మార్కులతో పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 31 డిసెంబర్ 2026 నాటికి 15 నుండి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్లు:
మొత్తం అందుబాటులో ఉన్న సీట్లలో 60 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాలు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. అలాగే ప్రతి కోర్సులో మహిళలకు 33% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. వీటితో పాటు ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీ కింద 10 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు ఉంటాయి. దివ్యాంగులు, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రత్యేక రిజర్వేషన్లు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
ఫీజు విషయానికి వస్తే.. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ (PH) అభ్యర్థులకు రూ. 600 కాగా,మిగిలిన ఇతర కేటగిరీల (OC/BC) అభ్యర్థులు రూ. 1,200 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభం:జూన్ 10 (నేటి నుంచే అప్లై చేసుకోవచ్చు)
ఆన్‌లైన్ అప్లికేషన్లకు ఆఖరి తేదీ:జూన్ 29 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత, విద్యా అర్హతల వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేసి, అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ pjtau.edu.in సంప్రదించవచ్చు.





