టెట్ అప్లికేషన్లకు మరో పది రోజుల గడువు మిగిలింది. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 12 వరకు అప్లికేషన్ చేసుకునేందుకు సమయం ఉండటంతో దాదాపు మూడు లక్షలకు పైగా అభ్యర్థులు ఈసారి దరఖాస్తు చేసుకుంటారని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ పేపర్–1, పేపర్–2 లో పాటు లాంగ్వేజ్ పండిట్ల విజ్ఞప్తి మేరకు ఈసారి పేపర్–3 కూడా నిర్వహించాలని విద్యా శాఖ భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ల (SGT) కోసం పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు (SCHOOL ASSISTANT) పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తున్నారు. దీంతో తెలంగాణాలో బీఈడీ పూర్తిచేసిన తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజీ పండిట్ అభ్యర్థులు కూడా సోషల్ స్టడీస్ కేటగిరిలో పేపర్ 2 నే రాయాల్సి వస్తోంది. గతంలో నిర్వహించిన ఆరు టెట్లలోనూ దీనినే రాశారు. అసలు పండిట్లకు సంబంధంలేని సబ్జెక్టులైన సోషల్, మ్యాథ్స్ ప్రశ్నలు ఈ పేపర్లో ఉంటాయి. దాదాపు 60 మార్కులు తమకు సంబంధం లేనివి ఉండడంతో తాము టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నామని బాషా పండిట్లు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే లాంగ్వేజ్ పండిట్ల కోసం ప్రత్యేకంగా పేపర్- 3 నిర్వహించాలని వారు కోరుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో లాంగ్వేజీ పండిట్ల కోసం టెట్ పేపర్–3ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా తెలుగు సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ప్రశ్నాపత్రం ఇవ్వాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు చేసిన అభ్యర్థులు దాదాపు 30 వేల మంది వరకు ఉన్నారు. పేపర్ 3 నిర్వహిస్తే వీరందరికీ లాభం కలగనుంది. ఇటీవల భాషా పండిట్ల విజ్ఞప్తిని తప్పకుండా పరిశీలిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో విద్యాశాఖ అధికారులు పేపర్–3 నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. సంబంధిత ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ఫైలును సీఎం ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఆమోదిస్తే పేపర్ 3 నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. టెట్ అప్లికేషన్ గడువు ముగిసేలోగానే పేపర్ 3 అంశంపై క్లారిటీ వచ్చే అవకాశముందని ఆఫీసర్లు చెబుతున్నారు.