వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) లో వ్యక్తిగత వివరాల్లో సవరణలకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు అప్‌గ్రేడ్ చేసేందుకు త్వరలో అవకాశం కల్పించనుంది. ఇప్పటికే కొత్తసాఫ్ట్‌వేర్ పనితీరును పరీక్షించిన కమిషన్.. రెండ్రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఉద్యోగార్థులు కూడా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. నూతన సాఫ్ట్‌వేర్ ప్రకారం 1-7వ తరగతి వరకు వ్యక్తిగత వివరాల నమోదుతో పాటు విద్యార్హతలు మార్చుకునేందుకు, వాటిని అప్‌లోడ్ చేసేందుకు అవకాశం కల్పించనుంది. ఓటీఆర్ ఎడిట్ సమయంలో ఉద్యోగార్థులు ఇప్పటికే నమోదు చేసిన ఫోన్‌నంబర్లు, ఈ-మెయిల్ వివరాలను మార్చకూడదని కమిషన్ కోరుతోంది. ఇప్పటివరకు ఈ-మెయిల్ వివరాలు ఓటీఆర్‌లో నమోదుచేయని అభ్యర్థులు ఎడిట్ సమయంలో తప్పనిసరిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. టీఎస్‌పీఎస్సీ వద్ద ప్రస్తుతం 25 లక్షల మంది ఉద్యోగార్థులు తమ పేర్లను ఓటీఆర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతంలో పది జిల్లాల ప్రాతిపదికన 4 నుంచి పదోతరగతి వరకు వివరాలు నమోదు చేశారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత నిర్వచనం మారింది. ఒకటి నుంచి ఏడోతరగతి వరకు చదివిన జిల్లా మేరకు స్థానికత నిర్ధరణ జరుగుతుంది. ఇప్పుడు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
ప్రివ్యూకు మూడు నిమిషాలు
ఓటీఆర్‌లో వివరాల నమోదులో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ప్రకటన దరఖాస్తులోనూ అవే తప్పులు వస్తాయి. అందుకే ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని వివరాలు నమోదు చేయాలని కమిషన్ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు ప్రక్రియలో కమిషన్ మార్పులు చేసింది. దరఖాస్తు పూర్తిచేసిన తరువాత ప్రివ్యూ కోసం 3 నిమిషాల సమయం ఇవ్వనుంది. ఈలోపు దరఖాస్తు సబ్మిట్ కాదు.