దేశ వ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించిన నీట్ యూజీ-2026 మూడో రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ విడతలో మొత్తం 4,687 ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీలోగా కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు..
రౌండ్ 3 సీట్ల కేటాయింపు :
ఈ మూడో విడత కౌన్సెలింగ్‌లో అదనంగా చేర్చిన 183 కొత్త సీట్లతో కలిపి మొత్తం 4,687 ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) సీట్లను అర్హులైన అభ్యర్థులకు కేటాయించడం జరిగింది.
అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్: ఈ రౌండ్లో కొత్తగా సీటు పొందిన వారితో పాటు, మునుపటి రౌండ్ల నుంచి అప్‌గ్రేడేషన్ కోరిన అభ్యర్థులు కూడా అధికారిక ఎంసీసీ వెబ్సైట్ నుంచి తమ అలాట్మెంట్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రిపోర్టింగ్ గడువు: అలాట్మెంట్ పొందిన విద్యార్థులు అక్టోబర్ 9వ తేదీలోగా తమకు కేటాయించిన కాలేజీల్లో తప్పని సరిగా రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. లేదంటే.. సీటు రద్దయ్యే అవకాశం ఉంది.
‘స్ట్రే వేకెన్సీ రౌండ్’ షెడ్యూల్:
మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత మిగిలిపోయే.. ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి చివరి అవకాశంగా ‘స్ట్రే వేకెన్సీ రౌండ్’నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు: అక్టోబర్ 12 నుంచి 14 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
చాయిస్ ఫిల్లింగ్ : అక్టోబర్ 12 నుంచి 15 వరకు చాయిస్ ఫిల్లింగ్‌కు అవకాశం ఇస్తారు.
ఫలితాల వెల్లడి: అక్టోబర్ 17న స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫలితాలు విడుదలవుతాయి.
కాలేజీల్లో చేరేందుకు గడువు: అక్టోబర్ 19 నుంచి 26 మధ్య కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు.
కౌన్సెలింగ్ & రిజిస్ట్రేషన్ ఖర్చులు :
నీట్ కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఎంసీసీ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజులు..
ప్రభుత్వ కోటా సీట్ల కోసం సాధారణ రిజిస్ట్రేషన్ ఫీజు సుమారు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు (కేటగిరీ, కౌన్సెలింగ్ రౌండ్ బట్టి) ఉంటుంది.
ప్రైవేట్ / డీమ్డ్ యూనివర్సిటీల మేనేజ్మెంట్ కోటా సీట్లకు రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద సుమారు రూ. 50,000 నుంచి రూ. 2,00,000 వరకు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
నీట్ యూజీ 2026 మూడో రౌండ్లో సీటు పొందిన విద్యార్థులు గడువు తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సీటు రాని వారు త్వరలో ప్రారంభంకానున్న స్ట్రే వేకెన్సీ రౌండ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.





