దేశవ్యాప్తంగా లక్షలాది మంది మెడికల్ ఆస్పిరెంట్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ (NEET UG Re-Exam 2026) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. గురువారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రిజల్ట్స్‌ను అధికారికంగా ప్రకటించింది. పేపర్ లీక్ వివాదాల తర్వాత జూన్ 21న నిర్వహించిన ఈ రీ-ఎగ్జామ్‌కు దాదాపు 20 లక్షల మంది హాజరుకాగా, వారి నిరీక్షణకు తెరపడింది. విద్యార్థులు తమ స్కోర్‌కార్డును అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ టెన్షన్‌కు తెర:
మే 3న జరిగిన మొదటి పరీక్ష లీకేజీ వివాదాల తర్వాత, జూన్ 21న దేశవ్యాప్తంగా అత్యంత పకడ్బందీగా రీ-ఎగ్జామ్ నిర్వహించారు. జులై 13న ఓఎంఆర్ షీట్లు విడుదల చేసి, 15 వరకు అభ్యంతరాలను స్వీకరించిన ఎన్టీఏ.. ఫైనల్ కీ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఫలితాలను అందుబాటులోకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరీక్షకు హాజరైన దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల్లో.. రికార్డు స్థాయిలో 11.21 లక్షల మంది మెడికల్ అడ్మిషన్లకు అర్హత సాధించారు.
పంజాబ్, హర్యానా కుర్రాళ్లదే హవా:
ఈసారి ఫలితాల్లో విద్యార్థులు భారీ స్కోర్లు సాధించారు. దేశవ్యాప్తంగా 66 నగరాల నుంచి 198 మంది టాప్ ర్యాంకులు సాధించారు. మొత్తం 720 మార్కులకు గాను..
ఆర్యన్ గుప్తా (పంజాబ్), పనుల్ బన్సల్ (హరియాణా) 715 మార్కులు సాధించి దేశంలోనే టాప్ స్థానంలో నిలిచారు.
705కు పైగా మార్కులతో 17 మంది టాపర్లుగా నిలవగా.. ఇందులో మన తెలంగాణతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు విద్యార్థులు ఉన్నారు.
కేటగిరీల వారీగా క్వాలిఫై అయిన అభ్యర్థులు:
జనరల్ కేటగిరీ: 2.91 లక్షల మంది
OBC-NCL: 5.12 లక్షల మంది
SC కేటగిరీ: 1.58 లక్షల మంది
ST కేటగిరీ: 69,716 మంది
Gen-EWS: 95,026 మంది
PwBD & PwD:3,666, 303మంది





