నీట్ పీజీ-2026 ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఈ ఫలితాలను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత స్కోర్ కార్డులను అక్టోబరు 1 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని మెడికల్ అభ్యర్థులకు గుడ్న్యూస్ అందనుంది. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పీజీ సీట్లు మరో 400 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియపై వైద్య విద్యార్థుల్లో భారీగా అంచనాలు పెరిగాయి.
తెలంగాణలో మరింత పెరగనున్న పీజీ సీట్లు:
రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం మరింత అనుకూలంగా మారనుంది. మరో 400 పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఈసెట్ కలిపి మొత్తం 10 ప్రభుత్వ పీజీ కాలేజీలు, 19 ప్రైవేటు కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. గడచిన 2025-26 విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ కాలేజీల్లో 1,466 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 1,950 సీట్లు ఉండగా..మొత్తం కలిపి 3,416 పీజీ సీట్లు భర్తీ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో 400 సీట్లు కలవడంతో మరిన్ని సీట్లు పెరుగుతాయి.
అక్టోబర్లో కౌన్సెలింగ్ షెడ్యూల్:
స్కోర్ కార్డుల డౌన్లోడ్: అభ్యర్థులు తమ వ్యక్తిగత స్కోర్ కార్డులను అక్టోబరు 1 నుంచి ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కౌన్సిలింగ్ షెడ్యూల్: కాలేజీల వారీగా పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అక్టోబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది.
ఫీజుల వివరాలు: నీట్ పీజీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు సాధారణంగా ప్రభుత్వ కోటా, మేనేజ్మెంట్ కోటాను బట్టి మారుతుంది.
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు సుమారు రూ. 1,000 నుంచి రూ. 2,500 వరకు ఉంటుంది. అలాగే ప్రైవేటు కాలేజీల్లో ట్యూషన్ ఫీజులు కాలేజీని బట్టి సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండొచ్చు.





