తెలంగాణ విద్యుత్తు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలోనే భారీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇటీవలే విద్యుత్తు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మెరుగైన విద్యుత్తును అందించేందుకు, విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో దాదాపు 3 వేలకు పైగా ఖాళీలున్నాయి. ప్రధానంగా డిస్కంలలో అసిస్టెంటు లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, సబ్ ఇంజినీర్లు, సహాయ ఇంజినీరుతోపాటు వివిధ హోదాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ట్రాన్స్‌కో, జెన్‌కోలలో అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇటీవల డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్కోలోని ఉద్యోగులకు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది. దీంతొ కింది స్థాయిలో ఖాళీల సంఖ్య పెరిగింది.
ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న యాదాద్రి పవర్ స్టేషన్‌తో ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుందని ఇటీవలే విద్యుత్తు శాఖ ఒక అంచనాకు వచ్చింది. వీటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం తాజాగా చేసిన ప్రకటనతో వచ్చే నెలలో ఈ నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలున్నాయి.