అంతర్జాతీయం
జపాన్ భారత్ మధ్య 13 ఒప్పందాలు
జపాన్‌లో రెండ్రోజుల పర్యటనకు ఆగస్టు 29 టోక్యోకు వెళ్లిన మోడీ సెమీ కండక్టర్లు, శుద్ధ ఇంధనం, టెలికం, ఔషధాలకు సంబంధించి 13 ఒప్పందాలు చేసుకున్నారు. 50,000 మంది నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులను ఐదేళ్లలో భారత్ నుంచి జపాన్‌కు పంపించడం వీటిలో ఒకటి. జపాన్ సిగ్నల్ వ్యవస్థపై పనిచేసే ‘షింకన్‌సేన్ ఇ 10 సీరీస్’ రైళ్లను 2030 నాటికి భారత్‌కు ఇస్తామని జపాన్ సంసిద్ధత వ్యక్తపరిచింది. మోదీతో జపాన్ మాజీ ప్రధానులు యొషిహిదె సుగ, ఫుమియొ కిషిద భేటీఅయి.. సాంకేతికత, కృత్రిమ మేధ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం పై చర్చించారు.
థాయ్‌లాండ్ ప్రధానిగా షినవత్ర ఔట్
కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్‌సేన్‌తో ఫోనులో మాట్లాడి థాయ్ లాండ్ ప్రధాని షినవత్ర నైతిక ప్రమాణాలను ఉల్లంఘించినట్లు రుజువయ్యిందని.. రాజ్యాంగం ప్రకారం ఇటువంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని న్యాయస్థానం పేర్కొంది. అందుకే ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. షినవత్రను ప్రధాని స్థానం నుంచి తొలగించడంతో నూతన ప్రధానిని ఎన్నుకునే వరకూ దేశ ఉప ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్ ఆపద్ధర్మ ప్రధాని హోదాలో సేవలందిస్తారని అధికారులు పేర్కొన్నారు.
లెబనాన్‌లో యూఎన్ఓ శాంతి దళం రద్దు
దక్షిణ లెబనాన్‌లో అయిదు దశాబ్దాలుగా ఉన్న యూఎన్ఓ శాంతి స్థాపక దళం 2026 సంవత్సరాంతంలో రద్దవుతుందని భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. 1978లో దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణను పర్యవేక్షించేందుకు ఈ బలగాన్ని ఏర్పాటు చేశారు. 2006లో నెల రోజుల పాటు ఇజ్రాయెల్, హెజ్బొల్లాల మధ్య సాగిన యుద్ధం నేపథ్యంలో యూఎన్ఓ శాంతి దళం కాలపరిమితిని పొడిగించారు.
లిథువేనియా కొత్త ప్రధానిగా ఇంగా రుగినియెనె
లిథువేనియా నూతన ప్రధానమంత్రిగా ఇంగా రుగినియెనె ఎన్నికయ్యారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలిగా ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. ఆగస్టు 26న జరిగిన ఎన్నికలో మాజీ కార్మిక నాయకురాలు, కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన రుగినియెనెను లిథువేనియా పార్లమెంటు ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గత ప్రధాని గింటవుటాస్ పలుక్కాస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
భారత్, ఫిజీ దేశాల మధ్య ఏడు ఒప్పందాలు
ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు భారత్-ఫిజి నిర్ణయించాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతికి సంయుక్తంగా కృషిచేయాలని ప్రతిన పూనాయి. ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫిజీ ప్రధాన మంత్రి సితివేణి లిగమామద రబుక మధ్య ఆగస్టు 25న జరిగిన ద్వైపాక్షిక చర్చలు వేదికయ్యాయి. అలాగే వైద్యం, నైపుణ్యాభివృద్ధి, వ్యాపారం వంటి ఏడు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
పాకిస్థాన్‌లో కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్
చైనా స్ఫూర్తితో పాకిస్థాన్ అత్యాధునిక సాంకేతికతతో ఆర్మీ రాకెట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ దళం నియంత్రణలో బాలిస్టిక్, హైపర్ సోనిక్, క్రూజ్ క్షిపణులు ఉంటాయి. 2025, ఆగస్టు 14న పాకిస్థాన్ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
అత్యధిక రుణభారం ఉన్న దేశం అమెరికా
ప్రపంచంలోనే అత్యధిక రుణభారం అమెరికా మీద ఉంది. అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ప్రస్తుతం 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికా జీడీపీలో 122 శాతానికి సమానం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30.3 లక్షల కోట్ల డాలర్లు కాగా.. ఆ దేశ రుణ భారం అంతకంటే ఎక్కువగా దాదాపు 37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
డిపోర్ట్ నౌ అపీల్ లేటర్ జాబితాలో భారత్
తమ దేశంలో నేరం చేసి శిక్ష పడ్డ విదేశీయులను స్వదేశానికి తిప్పి పంపేందుకు బ్రిటన్ అనుసరిస్తున్న ‘డిపోర్ట్ నౌ, అపీల్ లేటర్’ విధానంలోకి భారత్ చేరింది. ఈ విధానం ప్రకారం శిక్ష పడ్డ విదేశీ నేరస్థులను వారి అపీళ్లపై విచారణ ప్రారంభం కాకముందు స్వదేశానికి తరలిస్తారు. ఇందుకు ముందు ఈ విధానం.. అయిదు దేశాలకు బ్రిటన్ అమలు చేసింది. ఇప్పుడు ఈ సంఖ్యను 23కి పెంచింది. ఇందులో భారత్ కూడా ఉంది.
తొలి రోబో మాల్
రోబోల పరిశోధన, తయారీలో గ్లోబల్ లీడర్‌గా మారిన చైనాలో అతి పెద్ద రోబో మాల్ ఏర్పాటైంది. మ్యూజిక్‌తోపాటు ఇంటి పనులు, తదితరాలకు సహకరించే వందల రకాల రోబోలను అక్కడ అమ్మడమే కాదు వాటికి సంబంధించిన అన్ని సర్వీసులూ అందుబాటులో ఉంచారు. ఇది ప్రపంచంలోనే తొలి రోబో మాల్‌గా గుర్తింపు పొందింది.
భారత్‌పై మళ్లీ సుంకాలను పెంచిన ట్రంప్
రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన ఆయన.. దానిని 50 శాతానికి పెంచారు. కొత్తగా విధించిన అదనపు 25% సుంకాలను ఆగస్టు 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా, తుర్కియేలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు. చైనాపై 30 శాతం, తుర్కియేపై 15 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి.
భారత్‌లో మొదటి మొబైల్ కాల్‌కు 30 ఏళ్లు
భారత్‌లో మొబైల్ కాల్స్ ప్రారంభమై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1995 జులై 31న మొదటి ఫోన్‌కాల్ కోల్‌కతా నుంచి ఢిల్లీకి వెళ్లింది. అప్పటి బెంగాల్ సీఎం జ్యోతిబసు నోకియా హెడ్‌సెట్ నుంచి ఢిల్లీలోని కేంద్ర టెలికాం మంత్రి సుఖ్‌రామ్‌కు ఈ కాల్‌ను చేశారు. 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దిల్లీలో ‘మొబైల్ కాన్‌క్లేవ్ 2025’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 1995 నుంచి 2025 వరకు భారత మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి మొబైల్ ఫోన్‌ను ప్రదర్శించారు. 120 కోట్ల మొబైల్ వినియోగదారులతో నేడు ప్రపంచంలోనే రెండోస్థానంలో భారత్ ఉన్నట్లు మంత్రి తెలిపారు.
జాతీయం
గిరిజన భాషల అనువాదానికి ఆది వాణి
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ‘ఆది వాణి’ పేరుతో కృత్రిమ మేధ సాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్‌ను ప్రారంభించనుంది. దేశంలోని భాషా వైవిధ్యాన్ని సంరక్షించి గిరిజన జాతులకు సాధికారికత కల్పించడం కోసం ఈ చర్య తీసుకున్నట్టు గిరిజన వ్యవహారాల శాఖ వెల్లడించింది. వివిధ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో ఐఐటీ దిల్లీ, బిట్స్ పిలానీ, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ నవ రాయ్‌పుర్ సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయి.
సుప్రీం జడ్జీల పదవీ ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీలు 2025, ఆగస్టు 29న పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ వారి చేత ప్రమాణం చేయించారు. దీంతో సీజేఐతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యాబలం 34కు చేరింది.
జన్‌ధన్ కు పదేళ్లు
పీఎం జన్‌ధన్ యోజన పథకం ప్రారంభించి 2025, ఆగస్టు 28 నాటికి 11 ఏళ్లు పూర్తయ్యింది. ఈ కాలంలో ఆ ఖాతాల్లో డిపాజిట్లు దాదాపు 16 రెట్లు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా అందించడం కోసం 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రుణ సౌకర్యం, సామాజిక భద్రత, పొదుపు, పెట్టుబడులకు ఉపయోగపడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
మరణ దండనను సవాల్ చేయవచ్చు
కేసు విచారణలో విధానపరమైన లోపాలుంటే తనకు విధించిన మరణ దండనను దోషి సవాల్ చేయవచ్చని, రాజ్యాంగ ఆర్టికల్ 32 అందుకు అనుమతిస్తుందని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. 2008లో నాగ్‌పుర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో మరణ దండనను ఎదుర్కొంటున్న దోషి వసంత్ సంపత్ అభ్యర్థనను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం అనుమతించింది.
సీఐఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా కమాండోల బృందం
ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేకంగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయాలని ‘కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం’ (సీఐఎస్‌ఎఫ్) నిర్ణయించింది. ‘విమానయాన భద్రత బృందం’ (ఏఎస్‌జీ) నుంచి 100 మంది మహిళలను తొలివిడతగా శిక్షణకు ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్‌లోని బర్వాహాలో వీరికి శిక్షణ మొదలైంది. ఎనిమిది వారాలపాటు ఇచ్చే శిక్షణతో వీరు ‘సత్వర ప్రతిస్పందన బృందం’ (క్యూఆర్‌టీ), ప్రత్యేక కార్యదళం (ఎస్‌టీఎఫ్)లో సేవలకు సన్నద్ధమవుతారు.
క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, ఆగస్టు 19న జాతీయ క్రీడా బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారింది. ఇటీవల ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లును రెండు ప్రధాన సవరణలతో పార్లమెంటు ఆమోదించింది. సమాచార హక్కు (ఆర్‌టీఐ) పరిధిని తగ్గించడం అందులో ముఖ్యమైనది. ప్రభుత్వ నిధులు, సహకారంపై ఆధారపడే క్రీడా సంస్థలను మాత్రమే ఆర్‌టీఐ పరిధిలో ఉంచారు. ఫలితంగా ఆర్‌టీఐ పరిధిలోకి రాకుండా బీసీసీఐకి వెసులుబాటు లభించింది.
ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన
ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ ఉపాధి యోజన’ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు అనుబంధ పోర్టల్‌ను ఏర్పాటు చేసంది. సంస్థల యజమానులు, తొలిసారి ఉద్యోగంలో చేరేవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి కేంద్ర క్యాబినెట్ జులై 1న ఆమోదం తెలిపింది. పథకం ద్వారా రూ.లక్ష కోట్లతో రెండేళ్ల కాలం (2025 ఆగస్టు 1 – 2027 జులై 31)లో 3.5 కోట్లకుపైగా ఉద్యోగాలు కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాంప్ పథకం
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్‌ఎంఈ ఫెర్ఫార్మెన్స్ (రాంప్)’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ బ్యాంకు సాయంతో దీన్ని అమలు చేస్తున్నారు. పరిశ్రమ నెలకొల్పడంలో ఉన్న సవాళ్లను అధిగమించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. పెట్టుబడి, స్థలం, ఉత్పత్తి ప్రక్రియ, మార్కెటింగ్, లాభనష్టాలు, ఎగుమతులు మొదలైన అంశాలపై ‘రాంప్ పథకం’ దృష్టి సారిస్తుంది.
రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట బురుజు నుంచి 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి రికార్డు సృష్టించారు. గతంలో ఏ ప్రధానీ ఇంత సుదీర్ఘమైన స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని జాతిజనులకు అందించలేదు. గత సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించిన మోదీ ఈసారి తన రికార్డును తానే అధిగమించారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్టు
కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన విత్తన బంతుల ప్రాజెక్టు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కింది. విద్యార్థులతో కలిసి తాను చేపట్టిన ఈ ప్రాజెక్టును లండన్ కేంద్రంగా పనిచేసే సంస్థ గుర్తించిందని మేయర్ ఆర్య ఎస్ రాజేంద్రన్ ఆగస్టు 11న వెల్లడించారు. ఇందులో 6 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని వివరించారు. ఆగస్టు నెల 9న 3 గంటల్లో తిరువనంతపురంలోని పుథరీకందం మైదానంలో 4 లక్షల విత్తన బంతులను విసిరామని తెలిపారు.
భారత్‌లో పెరిగిన ఆసియా సింహాల సంఖ్య
ఆసియా సింహాల సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరిగింది. గత అయిదేళ్లలో 32.2 శాతంగా ఈ వృద్ధి నమోదైంది. 2020లో 674గా ఉన్న వీటి సంఖ్య 2025 నాటికి 891కి పెరిగింది. ఆగస్టు 10న ‘ప్రపంచ సింహాల దినోత్సవం’ సందర్భంగా మృగరాజుల గణాంకాలపై విడుదలైన 16వ అంచనా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆడ సింహాల సంఖ్యలో 26.9 శాతం పెరుగుదల కనిపించగా.. వీటి సంఖ్య 260 నుంచి 330కు పెరిగింది. గత పదేళ్లలో సింహాల సంఖ్య 70.36 శాతం పెరిగింది. 2015లో 523 సింహాలు ఉండగా, 2025లో 891కి చేరాయి.
దేశవ్యాప్తంగా 334 పార్టీల రద్దు
చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశవ్యాప్తంగా 334 పార్టీలను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో తెలంగాణ నుంచి 13, ఏపీ నుంచి ఐదు పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలేవీ రిజిస్టర్డ్ అడ్రస్‌లో లేకపోవడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకపోవడంతో వీటిని నమోదిత రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
రద్దయిన తెలంగాణ పార్టీలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ (అంబేడ్కర్-ఫులే), ఇండియన్ మైనార్టీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, జాతీయ మహిళా పార్టీ, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, తెలంగాణ మైనార్టీస్ ఓబీసీ రాజ్యం, తెలంగాణ ప్రజా సమితి (కిశోర్‌రావు అండ్ కిషన్), తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ, యువ పార్టీ, యువ తెలంగాణ పార్టీ.
గిన్నిస్ రికార్డు సాధించిన పరీక్షా పే చర్చ
ప్రధాని మోడీ నిర్వహించే పరీక్షా పే చర్చ గిన్నిస్ రికార్డులకెక్కింది. ఒక నెలలో ఈ కార్యక్రమానికి అత్యధిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎనిమిదో ఎడిషన్‌కు 3.53 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఒక పౌర కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం విశేషమని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షల సమయంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ప్రధాని మోడీ చర్చించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ప్రాంతీయం
తెలంగాణ అప్పులు-ఆస్తుల నిష్పత్తి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది (2014-15) అప్పులతో పోలిస్తే 19.45% మేర ఆస్తులు అధికంగా ఉండగా, 2023-24నాటికల్లా అది 18.42%కి తగ్గిపోయింది. రాష్ట్ర అప్పులు-ఆస్తుల నిష్పత్తి 2017-18 నుంచి 2020-21 మధ్యకాలంలో పెరిగినా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. 2023-24 నాటికి తెలంగాణ అప్పు రూ.3.50 లక్షల కోట్లకు చేరింది. గత 10ఏళ్లలో నికరంగా ఆస్తులు 399% పెరగ్గా అప్పులు 403% పెరిగాయి.
ప్రపంచంలోనే ఎత్తయిన ఐకానిక్ టవర్
హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచస్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా నగరానికి ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ పేరిట ముఖద్వారం నిర్మించనుంది. తొలిదశలో హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ (గాంధీ సరోవర్) వరకు 9 కి.మీ. మేర అభివృద్ధి చేయనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఔటర్ రింగు రోడ్డుపైకి వెళ్లే మార్గం వద్ద గేట్ వేను నిర్మించనుంది. గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ‘ఐకానిక్ టవర్’ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయశాఖ నివేదిక
తెలంగాణలో వానాకాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం 69 శాతానికి చేరింది. మొత్తం 1.32 కోట్ల విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 91.52 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చింది. సూర్యాపేట, వనపర్తి, మేడ్చల్ జిల్లాల్లో 50% కంటే తక్కువ విస్తీర్ణంలో పంటలు వేయగా… మిగిలిన జిల్లాల్లో 50% దాటాయి. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా… మిగిలిన జిల్లాల్లో సాధారణ, అధిక వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది.
ఆపరేషన్ ముస్కాన్
తెలంగాణ రాష్ట్రంలో జులై నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 7678 మంది చిన్నారుల్ని రెస్క్యూ చేసినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆగస్టు 1న వెల్లడించింది. వీరిలో 7149 మంది బాలురు కాగా.. 529 మంది బాలికలున్నారు. వీరిలో 3783 మందిని ఒడిశా, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర 12 రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. ఇందులో నలుగురు నేపాల్ పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
నియామకాలు
ఐఎమ్‌ఎఫ్ ఈడీగా ఉర్జిత్ పటేల్
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రభుత్వం ఉర్జిత్ పటేల్‌కు కీలక అవకాశాన్ని కల్పించింది. ఆయనను ఐఎమ్‌ఎఫ్ ఈడీగా నియమిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆగస్టు 28న ఆదేశాలను జారీ చేసింది. ఉర్జిత్ పటేల్‌కు ఈ అవకాశాన్ని కల్పించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసింది. మూడేళ్ల పాటు ఐఎమ్‌ఎఫ్ ఈడీ హోదాలో ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ పంచోలీ
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీ పేర్లను సిఫార్సు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. సీజేఐతో కలిపి 34 న్యాయమూర్తి పోస్టులున్న సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు స్థానాల భర్తీ కోసం కొలీజియం వీరి పేర్లను ఎంపిక చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారిగా గోర్
భారత్‌కు తదుపరి రాయబారిగా తన సన్నిహితుడు సెర్గియో గోర్‌ను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైట్ హౌస్‌లో ట్రంప్‌నకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రత్యేక రాయబారి హోదాలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలనూ గోర్ పర్యవేక్షిస్తారని ట్రంప్ ప్రకటించారు.
‘జాతీయ మహిళా కమిషన్’ సభ్యుల నియామకం
జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ-2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేశ్ భగవత్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ మహిళా సంఘం 2025, ఆగస్టు 20న ప్రకటన విడుదల చేసింది. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయా కిశోర్ రహాట్కర్ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం 21 మందిని సభ్యులుగా నియమించారు.
అవార్డులు
గ్యాలంట్రీ పతకాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనిక, పోలీసు సిబ్బందికి గ్యాలంట్రీ పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వ్యూహకర్తలకు, అమలు చేసిన సైనిక సిబ్బందికి 127 గ్యాలంట్రీ, 40 సర్వీస్ అవార్డులను ఇచ్చింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా 1,090 మంది పోలీసు సిబ్బందికి గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఆపరేషన్ సిందూర్‌లో సేవలందించిన 18 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు. 290 మందికి మెన్షన్-ఇన్-డిస్పాచ్‌ను రాష్ట్రపతి ఆమోదించారు. వీరిలో 115 మంది సైన్యం నుంచి, ఐదుగురు నేవీ నుంచి, 167 మంది వైమానిక దళం నుంచి ఉన్నారు.
నిర్మలా సీతారామన్‌కు భారత లక్ష్మి పురస్కారం
చారిత్రక ఉడుపి శ్రీకృష్ణ మఠంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ‘భారత లక్ష్మి’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తితో కలిసి శ్రీకృష్ణ మఠంలో వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
మహా కవ్వంను ఆవిష్కరించారు. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి ఆమెకు ‘భారత లక్ష్మి’ పురస్కారాన్ని ప్రకటించగా.. అదమారు మఠాధిపతి విశ్వప్రియ తీర్థ స్వామి ఆ పురస్కారాన్ని ఆలయంలో ప్రదానం చేశారు.
చేనేత సేవా కేంద్రానికి జాతీయ పురస్కారం
చేనేత సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్‌కుమార్‌కు జాతీయ పురస్కారం లభించింది. ఢిల్లీలోని భారత మండపంలో ఆగస్టు 7న నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారానికి 38 దరఖాస్తులురాగా, తెలంగాణకు అవార్డు దక్కిందని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
వార్తల్లో వ్యక్తులు
రోజర్ బిన్నీ
బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఇన్నింగ్స్ ముగిసింది. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలయ్యే వరకు ఆయన విధులు నిర్వర్తిస్తాడు.బిన్నీ 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన గత నెలలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు నిబంధనల ప్రకారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ గరిష్ఠ వయోపరిమితి 70 ఏళ్లు. జాతీయ క్రీడా బిల్లు ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యల ఆఫీస్ బేరర్ల వయోపరిమితి 75 ఏళ్లు. ఆయా క్రీడల అంతర్జాతీయ సంఘాలు నిబంధనలు అనుమతిస్తే వాళ్లు అ వయసు వరకు కొనసాగవచ్చు.
సతీశ్‌కుమార్
రైల్వే బోర్డు ఛైర్మన్, కార్యనిర్వాహక అధికారి సతీశ్‌కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఆయన పదవీ కాలం 2025, ఆగస్టు 31 నాటికి ముగియాల్సి ఉండగా కాంట్రాక్ట్ ప్రాతిపాదికన 2026 ఆగస్టు వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రిమండలి నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. సతీశ్‌కుమార్ 2024, సెప్టెంబరు 1న ఈ పదవి చేపట్టారు. ఈ పదవికి ఎంపికైన తొలి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన ఖ్యాతి గడించారు.
అజిత్‌కుమార్ మొహంతి
అణుశక్తి కమిషన్ ఛైర్మన్‌గా, అణుశక్తిశాఖ (డీఏఈ) కార్యదర్శిగా ప్రముఖ భౌతికశాస్త్రవేత్త అజిత్‌కుమార్ మొహంతి పదవీ కాలాన్ని మరో ఆరునెలల పాటు పొడిగించినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. కేంద్ర మంత్రి మండలికి చెందిన నియామకాల కమిటీ ఈ పొడిగింపును ఆమోదించింది. 2025, సెప్టెంబరులో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మారం పవిత్ర
సూర్యాపేట జిల్లా, పెన్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా మారం పవిత్ర తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. సాంకేతికతను ఉపయోగించి ప్రయోగాల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. 2009లో రామన్నగూడెం యూపీఎస్‌లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా తన ప్రయాణం మొదలైంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో నిర్వహిస్తున్న సైన్స్ పోటీలు, ఇన్‌స్పైర్, నేషనల్ చిల్డ్రన్స్ కాంగ్రెస్, అగస్త్య, అన్వేష, జిజ్ఞాస వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.
బాలకృష్ణ
భారతీయ సినిమా రంగంలో 50 ఏళ్ల అసాధారణ ప్రయాణాన్ని పురస్కరించుకుని అగ్ర కథానాయకుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (డబ్ల్యు.బి.ఆర్) గోల్డ్ ఎడిషన్‌లో ఆయనకి చోటు దక్కింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ గౌరవాన్ని పొందిన తొలి నటుడు ఆయనే.
క్రిస్టియానో రొనాల్డో
కెరీర్‌లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న పోర్చుగల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో మరో ఘనత చేరింది. సౌదీ సూపర్ కప్ ఫైనల్లో అల్ అహిల్‌పై పెనాల్టీని గోల్‌గా మలిచిన రొనాల్డో అల్ నాసర్ క్లబ్ తరుఫున వందో గోల్ నమోదు చేశాడు. నాలుగు భిన్నమైన క్లబ్‌ల తరఫున వందేసి గోల్స్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్రలో నిలిచాడు. రియల్ మాడ్రిడ్ తరఫున 450 గోల్స్ సాధించిన రొనాల్డో.. మాంచెస్టర్ యునైటెడ్‌కు 145.. జువెంటస్‌కు 101 గోల్స్ కొట్టాడు.
అగార్కర్
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ మరో ఏడాది పొడిగించింది. 2026, జూన్ వరకు ఛైర్మన్‌గా అతడే కొనసాగనున్నాడు. భారత క్రికెట్లో సంధి దశను విజయవంతంగా అధిగమించడంతో పాటు.. భారత జట్టుకు కీలక విజయాలు సాధించేలా జట్లను ఎంపిక చేసినందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2023 జులైలో అతడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టు.. 2024లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిచింది.
రమేశ్ కార్తిక్‌నాయక్
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి తండాకు చెందిన రమేశ్ కార్తిక్‌నాయక్ రాసిన కవిత పాఠమైంది. ఆయన రచించిన ‘చక్‌మక్’ (చెకుముకి రాయి) ఆంగ్ల కవితా సంపుటిలోని ‘ది రోస్ ల్యాండ్’ కవితను సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఏడాది (2025) 8వ తరగతి ఆంగ్ల సిలబస్‌లో ఆరో పాఠంగా చేరుస్తూ.. ఆగస్టు 18న సమాచారం అందజేసింది.‘ది రోజ్ ల్యాండ్’ కవిత.. బంజారా తెగకు చెందిన తల్లీకొడుకుల జీవన ప్రయాణ ఇతివృత్తంతో సాగుతుంది. ఈయన ‘ధవలో గోర్’ (స్త్రీ శోకం) కథా సంపుటితో కేంద్ర సాహిత్య అకాడమీ ‘యువ పురస్కారం-2024’ అందుకున్నారు.
బీపీ పాండే
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా బీపీ పాండే 2025, ఆగస్టు 18న హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఛైర్మన్‌గ ఉన్న ఏకే ప్రధాన్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో పాండే నియామకం జరిగింది.
కొణిదెల ఉపాసన
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్‌పర్సన్‌గా తనను నియమించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఉపాసన కొణిదెల కృతజ్ఞతలు తెలిపారు. ‘స్పోర్ట్స్ హబ్ ఛైర్‌పర్సన్ సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను నిర్మించే దిశగా ఇదో శక్తిమంతమైన అడుగు’ అని పేర్కొన్నారు.
స్పోర్ట్స్
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగే భారత జట్టుకు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సారథ్యం వహించనున్నాడు. 2025, సెప్టెంబరు 13 నుంచి 21 వరకు టోక్యోలో జరిగే ఈ పోటీల కోసం 19 మంది క్రీడాకారులతో భారత జట్టును జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఆగస్టు 31న ప్రకటించింది. నీరజ్‌తో పాటు సచిన్ యాదవ్, యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ జావెలిన్ త్రోలో పోటీపడనున్నారు. భారత్ నుంచి నలుగురు జావెలియన్ త్రోయర్లు ప్రపంచ టోర్నీలో పాల్గొంటుండటం ఇదే మొదటిసారి.
ఐపీఎల్‌కూ అశ్విన్ వీడ్కొలు
గత ఏడాది చివర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఐపీఎల్‌కూ వీడ్కొలు చెప్పాడు. దీంతో లీగ్‌తో అతడి 16 ఏళ్ల బంధానికి తెరపడింది. 2009లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో అతడి ఐపీఎల్ ప్రయాణం మొదలైంది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు అతను రాజస్థాన్ నుంచి తన తొలి జట్టు చెన్నైకి మారాడు.
మీరాబాయికి స్వర్ణం
భారత అగ్రశ్రేణి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పునరాగమనంలో అదరగొట్టింది. రికార్డు బద్దలు కొడుతూ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలుచుకుంది. ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన ఆమె ఆగస్టు 25న మహిళల 48కేజీ విభాగంలో 193 కిలోలు ఎత్తి విజేతగా నిలిచింది. ఇది ఛాంపియన్‌షిప్ రికార్డు. గత రికార్డు కన్నా 14 కిలోలు ఎక్కువ. చాను స్నాచ్‌లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కిలోలు ఎత్తింది.
క్రికెట్‌కు పుజారా వీడ్కోలు
టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కాలం భారత జట్టుకు గోడలా నిలిచిన బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఆగస్టు 24న ప్రకటించాడు. పుజారా 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 21301 పరుగులు చేశాడు.
యూత్ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్
తెలుగమ్మాయి తానిపర్తి చికిత (తెలంగాణ) చరిత్ర సృష్టించింది. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అండర్-21 మహిళల కాంపౌండ్ ఫైనల్లో చికిత 142-136తో యెరిన్ పార్క్ (కొరియా)పై నెగ్గింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల చికిత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోంది.
ఏపీఎల్-4 విజేత తుంగభద్ర వారియర్స్
ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (ఏపీఎల్) నాలుగో సీజన్లో తుంగభద్ర వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆగస్టు 23 విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో క్యాపిటల్ అమరావతి రాయల్స్‌పై గెలుపొందింది.
యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్
యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సారా ఎరాని-ఆండ్రియా వావసోరి (ఇటలీ) జంట విజేతగా నిలిచింది. 2025, ఆగస్టు 21న న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్లో ఎరాని ద్వయం 6-3, 5-7, 10-6తో ఇగా స్వైటెక్ (పోలెండ్)-కాస్పర్ రూడ్ (నార్వే) జోడీని ఓడించింది. 2019లో బెథాని మాటెక్ సాండ్స్-జేమీ ముర్రే తర్వాత యుఎస్ ఓపెన్లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న ఘనత ఎరాని-వావసోరి జోడీకే దక్కింది. టైటిల్ గెలిచిన ఎరాని జంటకు 8 కోట్ల 72 లక్షల భారీ ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్ స్వైటెక్ జోడీకి రూ.3 కోట్ల 48 లక్షలు దక్కాయి.
రోబోలకూ ఒలింపిక్ క్రీడలు
ఒలింపిక్ క్రీడలు మనుషులకు మాత్రమే కాదు రోబోలకు ఉండాలని చైనా వినూత్నంగా ఆలోచించింది. అందుకే మరమనుషులకు అక్కడి అధికారులు ఆగస్టు 15 నుంచి ఒలింపిక్ క్రీడలను నిర్వహిస్తున్నారు. తొలిసారి జరుగుతున్న ఈ వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్‌లో 16 దేశాలకు చెందిన దాదాపు 280 జట్లు పాల్గొంటున్నాయి. ఫుట్‌బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు, టేబుల్ టెన్నిస్‌తోపాటు.. ఔషధాలను గుర్తించడం, వస్తువులను తీసుకెళ్లడం, శుభ్రపరచడం వంటి విభాగాల్లో రోబోలు పాల్గొన్నాయి.
గుల్వీర్ సింగ్‌కు జాతీయ రికార్డు
భారత మారథాన్ పరుగు వీరుడు గుల్వీర్ సింగ్ 3000 మీటర్ల పరుగులో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. 2025, ఆగస్టు 13న బుడాపెస్ట్‌లో జరిగిన హంగేరియన్ అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో అతడు 3 వేల మీటర్ల రేసును 7 నిమిషాల 34.49 సెకన్లలో పూర్తి చేసి అయిదో స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ కిప్సాంగ్ మాథ్యూ (7:33.23 సె) విజేతగా నిలిచిన ఈ రేసులో.. హెరీరా (7:33.58-మెక్సికో), ఆస్కార్ చెలిమో (7:33.93) తర్వాతి రెండు స్థానాలు సాధించారు.
కిర్మాణి ఆత్మకథ స్టంప్డ్ ఆవిష్కరణ
భారత జట్టు మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి ఆత్మకథ ‘స్టంప్డ్’ను హైదరాబాద్‌లో క్రికెట్ ప్రముఖల సమక్షంలో ఆవిష్కరించారు. 1983 ప్రపంచకప్ ఫైనల్ హీరో మొహిందర్ అమర్‌నాథ్, కిర్మాణి, అజహర్, సిరాజ్, శివలాల్ యాదవ్, భారత ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు షబ్బీర్ అలీ, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్
ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా క్రీడాకారులు అదరగొట్టారు. 9 స్వర్ణాలు సహా 29 పతకాలతో టోర్నీలో ఆ దేశమే అగ్రస్థానం సాధించింది. మహిళల 4×100 మీటర్ల మెడ్లీ రిలే పోటీలో ఆ దేశ స్విమ్మర్లు ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించారు. అమెరికా బృందం 3 నిమిషాల 49.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తన పేరిటే ఉన్న రికార్డు (3:49.63 సె)ను బద్దలు కొట్టింది. పోటీల్లో ఆస్ట్రేలియా 8 స్వర్ణాలు సహా 20 పతకాలతో రెడో[ స్థానం సాధించింది. ఫ్రాన్స్ (4 స్వర్ణాలు), కెనడా (4 స్వర్ణాలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
భారత ఫుట్‌బాల్ కోచ్‌గా జమీల్
భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు చీఫ్ కోచ్‌గా ఖలీద్ జమీల్ ఎంపికయ్యాడు. రేసులో స్టీఫెన్ కాన్‌స్టంటైన్, స్టెఫాన్ టర్కోవిచ్‌లను వెనక్కి నెట్టిన 48 ఏళ్ల జమీల్‌ను అత్యున్నత పదవి వరించింది. దిగ్గజ ఆటగాడు విజయన్ సారథ్యంలోని ఏఐఎఫ్‌ఎఫ్ సాంకేతిక కమిటీ ముగ్గురి పేర్లతో జాబితాను తయారు చేయగా.. మాజీ అంతర్జాతీయ ఆటగాడు జమీల్‌కు ఎగ్జిక్యూటివ్ కమిటీ పచ్చజెండా ఊపింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
నేవీలోకి ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి
స్వీయ సాంకేతికతతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ త్రిపాఠీ వీటిని విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ సర్కార్‌లో జాతికి అంకితం చేశారు. ఒకేసారి రెండు భారీ యుద్ధనౌకలను ప్రారంభించడం భారత రక్షణ చరిత్రలో ఇదే మొదటిసారి.ఇండో-పసిఫిక్, చైనా ప్రాంత సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పీ-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్‌కతా, ముంబయిలలో ఈ యుద్ధ నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది.
ఇస్రో ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతం
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్‌డ్రాప్ పరీక్ష (ఐఏడీటీ-1) విజయవంతమైంది. ఆగస్టు 24న శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్‌ను చినూక్ హెలికాప్టర్ ద్వారా గగనతలంలోకి తీసుకెళ్లారు. తీరానికి 35 కి.మీ. దూరంలో మూడు కి.మీ. ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు.
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అయిన ‘అగ్ని-5’ను భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపుర్ పరీక్షా కేంద్రంలో ఈ ప్రయోగం జరిగింది. భారత అణ్వాయుధ కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణలకు బాధ్యత వహించే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5 వేల కిలోమీటర్లు. ఒకేసారి మూడు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లే, ఫైర్ చేసే సామర్థ్యం దీనికి ఉంది.
నౌకాదళంలోకి ఇక్షక్ సర్వే నౌక
రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్’ (జీఆర్‌ఎస్‌ఈ) కొత్తగా రూపొందించిన ఇక్షక్ సర్వే నౌకను భారత నౌకాదళానికి 2025, ఆగస్టు 14న అందజేసింది. జీఆర్‌ఎస్‌ఈ అందించిన మూడో సర్వే నౌక ఇది. ఈ నౌక సముద్రగర్భంలో వనరులు, నిర్మాణాల పరిశీలనకు ఉపయోగపడుతుంది. ఈ నౌక ఒక హెలికాప్టర్‌ను మోయగలదని, తక్కువ స్థాయి పోరాటంలో పాలు పంచుకోవడంతోపాటు సముద్రంలో ఆస్పత్రిలా ఉపయోగపడుతుందని జీఆర్‌ఎస్‌ఈ తెలియజేసింది.
కలాం 1200 తొలి స్టాటిక్ టెస్ట్ విజయవంతం
హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ లిమిటెడ్‌కు చెందిన విక్రమ్-1 వాహకనౌక మొదటి దశ ‘కలాం 1200’ మోటారుకు సంబంధించిన తొలి స్టాటిక్ టెస్ట్ విజయవంతమైంది. ఈ టెస్ట్‌ను శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో 2025, ఆగస్టు 8న నిర్వహించారు. విక్రమ్-1 వాహకనౌకకు సంబంధించిన వివిధ వ్యవస్థల్లో ఇదో ప్రధాన మైలురాయని ఇస్రో పేర్కొంది.





